
ఉపాధి హామీలో కోనసీమ ఫస్ట్
అమలాపురం రూరల్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ (నరేగా) పథకం అమలులో అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఈ ఆర్థిక సంవత్సరంలో 57 లక్షల పనిదినాలకు గాను 56 లక్షలు పని దినాల కల్పన సాధించి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిందని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ తెలిపారు. శుక్రవారం ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశి భూషణ్ కుమార్‌లు అమరావతి నుంచి వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో చిన్న, సన్నకారు రైతులకు చెందిన లక్ష ఎకరాల్లో పండ్ల తోటల పెంచడానికి ప్రణాళికలు సిద్ధం, పంట సేద్యపు నీటి కుంటల నిర్మాణం, పల్లె పండగ పనులైన గోకులాలు, సీసీ రోడ్లు నిర్మాణాల పురోగతిపై సమీక్షించారు. అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో రోజువారీ సగటు వేతనాన్ని రూ.291.21 చెల్లిస్తూ కోనసీమ జిల్లా... రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. జిల్లా వ్యాప్తంగా పల్లె పండగలో 896 గోకులాలు మంజూరు చేయగా వీటిలో 720 గోకులాలు నిర్మాణాలు పూర్తి అయ్యాయన్నారు.
జిల్లావ్యాప్తంగా 118 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు మంజూరు చేయగా వీటిలో 84 కిలోమీటర్లు అంతర్గత సీసీ రోడ్లు నిర్మాణం పూర్తయిందన్నారు. ఈ విభాగం బోగస్ మస్టర్లకు అడ్డుకట్ట వేయటంతోపాటు, పని వేళల్లో మార్పులు చేస్తూ కూలీలకు గిట్టుబాటు వేతనం అందించాలని సూచించారు. ఉద్యోగులు అవినీతికి పాల్పడితే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ అవసరాలకు ఈ కుంటలను వినియోగించుకుంటూనే వీటిలో చేపల పెంపకం ద్వారా అదనపు అదాయాన్ని సమకూర్చుకుంటున్నారని తెలిపారు. డ్వామా పీడీ ఎస్.మధుసూదన్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ సీహెచ్ ఎన్‌వీ కృష్ణారెడ్డి, పంచాయతీరాజ్ ఎస్‌ఈ పి.రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment