
బాలాజీని దర్శించుకున్న హైకోర్టు జడ్జి
మామిడికుదురు: అప్పనపల్లి బాల బాలాజీ స్వామిని రాష్ట్ర హైకోర్టు జడ్జి తర్లాడ రాజశేఖరరావు కుటుంబ సమేతంగా శనివారం దర్శించుకున్నారు. ఆయనకు అర్చకులు ఆలయ మర్యాదలతో సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. జడ్జి రాజశేఖరరావు పేరిట ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. ఆలయ ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు ఆధ్వర్యంలో జడ్జి రాజశేఖరరావుకు స్వామి వారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు.
ఈవీఎంల గోడౌన్ తనిఖీ
ముమ్మిడివరం: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం) గోడౌన్‌కు పటిష్ట భద్రత కల్పించాలని, పోలీసు సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) బీఎల్‌ఎన్ రాజకుమారి సూచించారు. ఎయిమ్స్ ఇంజినీరింగ్ కళాశాల మూడో అంతస్తులో ఈవీఎం, వీవీ ప్యాట్‌లు భద్రపర్చిన గోడౌన్‌ను శనివారం వివిధ శాఖాధికారులతో కలిసి ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాధారణ తనిఖీలలో భాగంగా ఈవీఎం, వీవీప్యాట్‌ల గోడౌన్‌ను, సీసీ కెమెరాల పనితీరు, అగ్నిమాపకదళ పరికరాలు తదితర అంశాలను పరిశీలించామన్నారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా తనిఖీలు చేసి సమగ్ర నివేదికను సమర్పిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా పర్యవేక్షణ రిజిస్టర్‌లో సంతకం చేశారు. ఆమె వెంట డిప్యూటీ తహసీల్దార్ శివరాజ్ గణపతి తదితరులున్నారు.
పేద విద్యార్థులకు
25 శాతం సీట్లు
అమలాపురం రూరల్: జిల్లాలోని ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయించడం జరుగుతుందని జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) షేక్ సలీం బాషా తెలిపారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. 2025–26 విద్యా సంవత్సరానికి ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో 25 శాతం సీట్లు కేటాయించేందుకు విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం ఈ నెల 19 నుంచి 26 వరకు సీఎస్‌ఈ వెబ్‌పోర్టల్లో ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాలల మేనేజ్‌మెంట్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఒకటో తరగతిలో తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు ఈ నెల 28 నుంచి మే 15 వరకూ సీఎస్‌ఈ.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. నివాసానికి ఒక కిలోమీటరు దూరంలో ఉండే పాఠశాలలను ఎంపిక చేసుకోవాలని, లేనిపక్షంలో మూడు కిలోమీటర్ల పరిధిలో స్కూళ్లను ఎంచుకునే అవకాశం ఉందన్నారు. దీనికి సంబంధించి మండల విద్యాశాఖ కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామన్నారు. మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు సమగ్ర శిక్షా ఆల్టర్నేటివ్ స్కూల్స్ కో ఆర్డినేటర్ డి.రమేష్ బాబు 85550 93096 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
పద్మ అవార్డులకు
దరఖాస్తుల ఆహ్వానం
అమలాపురం రూరల్: అంతర్జాతీయ క్రీడలలో అత్యున్నత ప్రతిభను ప్రదర్శంచిన క్రీడాకారులకు భారత ప్రభుత్వం ఏటా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పద్మ పురస్కారాలు అందిస్తుంది. ఈ మేరకు 2026కి గాను పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు కోనసీమ క్రీడాభివృద్ది అధికారి, కోచ్ పీఎస్ సురేష్ కుమార్ తెలిపారు. దరఖాస్తు వివరాలను www.padmaawardr.gov.in వెబ్ సైట్ నుంచి పొందాలన్నారు. అనంతరం క్రీడాకారులు ఈ వెబ్ సైట్‌లో వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకుని, ఆ పత్రాలను word & PDF ఫార్మెట్‌లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ మెయిల్ sports inap@gmai. com, incentiver.schemes@gmai.com మెయిల్ అడ్రస్‌కు మే 26వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు పంపాలన్నారు.

బాలాజీని దర్శించుకున్న హైకోర్టు జడ్జి