
ఘటనా స్థలి వద్ద ఉన్న పాదరక్షలు
రాయవరం: పచ్చని పంట పొలాల మధ్య..ప్రశాంతంగా ఉండే వాతావరణంలో..గడ్డివామిలో కాలిన స్థితిలో కన్పించిన మృతదేహం కలకలం రేపింది. రాయవరం మండలం మాచవరం–పసలపూడి ప్రధాన గ్రామాల మధ్య శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది.
వెలుగు చూసిందిలా..
మాచవరం–పసలపూడి గ్రామాల మధ్య మండపేట–కాకినాడ ప్రధాన రహదారిని ఆనుకుని పంట పొలం ఉంది. పంటపొలాన్ని ఆనుకుని ఉన్న దిమ్మపై పాడుబడిన మోటార్ షెడ్ ఉంది. ఈ షెడ్‌ను ఆనుకుని ఉన్న చిన్న గడ్డివాములో పూర్తిగా కాలిన స్థితిలో ఉన్న మృతదేహం కౌలు రైతు కురుపూడి గోవిందు కంటబడింది. పొలం యజమాని ద్వారా సమాచారం అందుకున్న ఎస్సై పీవీవీఎస్‌ఎన్ సురేష్ సిబ్బందితో వచ్చి పరిశీలించి, విషయాన్ని మండపేట రూరల్ సీఐ శివగణేష్‌కు తెలిపారు. డీఎస్పీ డి.బాలచంద్రారెడ్డి, సీఐ శివగణేష్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
మృతదేహమెవరిది?
అక్కడ లభించిన చేతికి వేసుకునే గాజుల ముక్కలు, మహిళలు వేసుకునే పాదరక్షల ఆధారంగా మహిళ మృతదేహంగానే భావిస్తున్నారు. ఎక్కడ నుంచైనా మహిళను తీసుకుని వచ్చి ఇక్కడ హత్య చేసి, గడ్డివాములో మృతదేహాన్ని కాల్చారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వార్త ఆనోటా ఈనోటా తెలియగానే స్థానికులు పెద్ద ఎత్తున ఘటనా స్థలికి చేరుకున్నారు.
డాగ్ స్క్వాడ్, క్లూస్‌టీమ్ ఆధారాల సేకరణ
క్లూస్‌టీమ్ ఎస్సై ఎస్.ప్రశాంతి ఆధ్వర్యంలో సిబ్బంది అక్కడ ఉన్న ఆధారాలను సేకరించారు. పోలీసు జాగిలం ఘటనా స్థలిని దగ్గరలో ఉన్న మరో పంట దిమ్మ వరకు వెళ్లి తిరిగి వెనక్కు వచ్చింది. పోలీసులు ప్రధానంగా మిస్సింగ్ కేసులపై దృష్టి సారించారు. మృతదేహాన్ని మండపేట ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు.
లంచం తీసుకున్న కేసులో అటవీ అధికారికి మూడేళ్ల జైలు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): లంచం తీసుకున్న కేసులో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కుంజమ్ భాస్కరరావుకు మూడేళ్ల జైలు శిక్ష, రూ.5 వేలు జరిమానా విధిస్తూ ఏబీసీ కోర్టు స్పెషల్ జడ్జి యూ.ప్రసాద్ శుక్రవారం తీర్పునిచ్చారు. కాకినాడ రేంజ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న భాస్కరరావు ద్రాక్షారామాకు చెందిన సుంకర వేణుగోపాల్ కలప డిపో వద్ద సీజ్ చేసిన బిల్ బుక్స్, పర్మిట్, బిల్స్ తిరిగి ఇచ్చేందుకు, సీ ఫీజు సొమ్ము తగ్గించేందుకు 2010 జనవరి 23న రూ.5 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీనిపై వేణుగోపాల్ ఏసీబీ ఆధికారులను ఆశ్రయించగా వారు వలపన్ని అతనిని పట్టుకున్నారు. నేరం రుజువు కావడంతో ఏసీబీ కోర్టు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. రూ.5 వేలు చెల్లించని పక్షంలో మరో మూడు నెలల సాధారణ జైలు అమలు చేస్తారు. కేసును పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి.శేషయ్య వాదించారు. ఏసీబీ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సీహెచ్ సౌజన్య పర్యవేక్షించారు.

ఘటనా స్థలిని పరిశీలిస్తున్న డీఎస్పీ బాలచంద్రారెడ్డి, సీఐ శివగణేష్
Comments
Please login to add a commentAdd a comment