రాజమహేంద్రవరంలో తమ ప్రియతమ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి స్వాగతం పలుకుతున్న ప్రజలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ/సాక్షి, అమలాపురం: గోదావరి వరద బాధితులను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. ముమ్మిడివరం, పి.గన్నవరం నియోజకవర్గాల పరిధిలోని వరద బాధితులతో నేరుగా మాట్లాడనున్నారు. వరద బాధితులకు ప్రభుత్వ సాయం అందిన తీరుతో పాటు వారి ఇబ్బందులను స్వయంగా తెలుసుకుని, మనోధైర్యం కల్పించనున్నారు.
గోదావరి నదీ కోతను పరిశీలించి, బాధితులతో మాట్లాడతారు. సీఎం పర్యటనకు కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆధ్వర్యాన పక్కా ఏర్పాట్లు చేశారు. సీఎం పర్యటించే మార్గం సింగిల్ రోడ్డు కావడంతో బయటి ప్రాంతాల నుంచి వచ్చే వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. సీఎం రాక కోసం తొలిసారిగా లంక గ్రామమైన గురజాపులంకలో హెలిపాడ్ ఏర్పాటు చేయడం విశేషం.
సహాయ, పునరావాసానికే ప్రాధాన్యం
వరద గోదావరి గత నెల 22న ఉగ్రరూపం దాల్చింది. ఆ తరువాత కాస్త నెమ్మదించినా.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయ్యాక డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని సుమారు 30 లంక గ్రామాలకు వరద పోటెత్తింది. ప్రజలు ముంపు బారిన పడ్డారు. వరద ముంపులో 10 రోజులకు పైనే లంక గ్రామాలున్నాయి. ఆ సమయంలో బాధితుల పరామర్శకు వస్తే ప్రభుత్వ సహాయ, పునరావాస కార్యక్రమాలకు ఆటంకం కలుగుతుందని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భావించారు.
ముంపులో ఉన్న బాధితులందరికీ ప్రభుత్వ సాయం అందించి, ఆదుకోవడమే ఏకై క అజెండాగా కలెక్టర్ సహా మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. గతంలో మాదిరిగా మాటలు చెప్పి, ప్రచారం చేసుకునేలా వ్యవహరించ లేదు. మాటలు ఒకటి, చేతలు మరొకటి కాకుండా బాధితులకు తక్షణ సాయం అందించేందుకు వీలుగా యుద్ధప్రాతిపదికన కోనసీమ జిల్లాకు రూ.3 కోట్లు పైగా అందించారు.
కేవలం నిధులు ఇచ్చి చేతులు దులుపుకోవడం కాకుండా.. గత పాలకులకు భిన్నంగా బాధితులందరికీ సాయం అందించడమే ప్రధాన లక్ష్యంగా జిల్లా యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు. చివరి బాధితుల వరకూ సాయం చేరాలనే ఆదేశాలతో వలంటీర్ల నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకూ ప్రతి ఒక్కరూ సీఎం ఆదేశాలను తు.చ. తప్పకుండా అమలు చేస్తూ.. వరద బాధితులకు అండగా నిలిచారు.
గత పాలకులకు భిన్నంగా..
గతంలో వరదలు, ప్రకృతి విపత్తుల సమయంలో సాయం అందించినా.. అందించకున్నా ముఖ్యమంత్రి స్థాయిలోని వ్యక్తి ఆర్భాటపు పరామర్శలతో ప్రచారం చేసుకోవడం అందరికీ తెలిసిందే. అందుకు భిన్నమైన రీతిలో స్పందించిన తొలి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాధితుల హృదయాల్లో నిలిచిపోయారు. లంకల్లోని బాధిత కుటుంబాలకు ప్రభుత్వ సాయం పూర్తిగా అందించిన తరువాతే ఆ ప్రాంతాల్లో పర్యటించాలని ముందుగానే నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలోనే ముంపు బాధితులను స్వయంగా పలకరించి, వారికి ప్రభుత్వ సాయం ఏ మేరకు అందిందో స్వయంగా తెలుసుకునేందుకు కోనసీమ జిల్లా లంకల్లో పర్యటించనున్నారు. ప్రభుత్వ సాయంపై వారు సంతృప్తిగా ఉన్నారా లేక ఇంకా ఏవైనా లోటుపాట్లు ఉన్నాయా అనే విషయాలు తెలుసుకోనున్నారు. సాయం అందని వారు ఎవరైనా ఉన్నారా, పంట నష్టం ఏ మేరకు జరిగిందో తెలుసుకుంటారు. ఇటువంటి సందర్భాల్లో గత పాలకులు ముందుగానే నిర్దేశించిన ప్రాంతాలకు వెళ్లి, ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడే వారిని ఏర్పాటు చేసి, వారితోనే మమ అనిపించి వెళ్లిపోయేవారు. దీనికి భిన్నంగా నేడు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించే గ్రామాలను గుర్తించడం వరకే అధికారులు పరిమితమయ్యారు.
సాయం అందించారిలా..
►ముంపు తగ్గి, ట్రాక్టర్లు వెళ్లడానికి మార్గం సుగమం అయిన వెంటనే వరద బాధితులందరికీ 25 కేజీల బియ్యం, కిలో కందిపప్పు, లీటర్ పామాయిల్, కిలో ఉల్లిపాయలు, కిలో బంగాళా దుంపల చొప్పున అందజేశారు. అర్ధరాత్రి వరకూ కూడా ఈ సాయం పంపిణీ చేయడం విశేషం. గత పాలకుల హయాంలో ఈవిధంగా సాయం అందించడానికి నాలుగైదు రోజుల నుంచి వారం రోజులు పట్టేది.
► ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మూడో ప్రమాద హెచ్చరిక ప్రకటిస్తేనే కానీ గత ప్రభుత్వ హయాంలో బాధితులకు భోజనాలు, ఆహార పొట్లాలు అందించే వారు కాదు. ఈసారి రెండో ప్రమాద హెచ్చరిక స్థాయిలోనే వీటిని అందజేయడం విశేషం.
► అలాగే, బాధితులు ఒక్కరే ఉంటే రూ.వెయ్యి, ఒకరికి మించి ఉంటే రూ.2 వేల చొప్పున వెంటనే ఆర్థిక సాయం కూడా పంపిణీ చేశారు. గతంలో ఎప్పుడూ ఈవిధంగా సాయం అందించలేదని బాధితులు ఆనందం వ్యక్తం చేశారు.
రాజమహేంద్రవరంలో సీఎంకు ఘన స్వాగతం
సాక్షి, రాజమహేంద్రవరం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సోమవారం సాయంత్రం ఘన స్వాగతం లభించింది. అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు జిల్లా గొమ్ముగూడెం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం హెలీకాప్టర్‌లో బయలుదేరి సాయంత్రం 6.24 గంటలకు రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు చేరుకున్నారు. హెలీప్యాడ్ వద్ద మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు.
ప్రతి ఒక్కరినీ అప్యాయంగా పలకరించిన సీఎం హెలీప్యాడ్ నుంచి రోడ్డు మార్గంలో ఆర్‌అండ్‌బీ అతిథి గృహానికి చేరుకున్నారు. స్వాగతం పలికిన వారిలో మంత్రులు చెల్లుబోయిన వేణు, తానేటి వనిత, కారుమూరి నాగేశ్వరరావు, పినిపే విశ్వరూప్, ఎంపీ మార్గాని భరత్, జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, ఎమ్మెల్సీలు వంకా రవీంద్రనాథ్, తోట త్రిమూర్తులు, కుడుపూడి సూర్యనారాయణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, తలారి వెంకట్రావు, సత్తి సూర్యనారాయణ రెడ్డి, కురసాల కన్నబాబు, జి.శ్రీనివాస్ నాయుడు, జ్యోతుల చంటిబాబు, రూడా చైర్మన్ మేడపాటి. షర్మిలా రెడ్డి, రాజమండ్రి రూరల్, సిటీ కో–ఆర్డినేటర్లు చందన నాగేశ్వర్, గూడూరి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ కె.మాధవీలత, ఎస్పీ సీహెచ్.సుధీర్ కుమార్ రెడ్డి, జేసీ ఎన్.తేజ్ భరత్, మున్సిపల్ కమిషనర్, కె.దినేష్ కుమార్, సహాయ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి, ఆర్డీవో సీహెచ్ చైత్ర వర్షిణి ఉన్నారు.
నేడు కోనసీమ జిల్లా పర్యటన
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కోనసీమ జిల్లాలో మంగళవారం పర్యటించనున్నారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం గురజపులంక, రామాలయపేట, అయినవిల్లి మండలం కొండుకుదురు గ్రామాల్లోని వరద బాధితులతో మాట్లాడుతారు. అనంతరం హెలీకాప్టర్‌లో తాడేపల్లికి బయలుదేరి వెళుతారు.
వరద బాధితులకు అందించిన సాయం
బాధిత కుటుంబాలు : 26,064
ఆహార పొట్లాలు : 86,013
వాటర్ ప్యాకెట్లు : 2,13,000
ఉచిత బియ్యం : 651.600 మెట్రిక్ టన్నులు
కందిపప్పు : 26,064 మెట్రిక్ టన్నులు
బంగాళా దుంపలు : 26.064 మెట్రిక్ టన్నులు
పామాయిల్ : 26,064 లీటర్లు
ఉల్లిపాయలు : 26,064 మెట్రిక్ టన్నులు
పాలు అర లీటర్ : 32,000
కొవ్వొత్తుల ప్యాకెట్లు : 1,00,000
సీఎం పర్యటన సాగనుందిలా..
ఉదయం 9.10: రాజమహేంద్రవరం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరుతారు.
9.40: ముమ్మిడివరం మండలం గురజాపులంకకు రాక.
9.40 నుంచి 10.25: బాధితులతో మాటామంతి.
10.35 – 11.10: లంక ఆఫ్ ఠాణేలంక రామాలయంపేటలో బాధితులతో ముఖాముఖి.
11.20: అయినవిల్లి మండలం కొండుకుదురు, తొత్తరమూడి చేరిక.
11.20 – 11.50: తొత్తరమూడిపేటలో వరద బాధితులతో మాటామంతి.
11.50: తొత్తరమూడిపేట నుంచి గురజాపులంక చేరిక.
మధ్యాహ్నం 12.15: హెలికాప్టర్‌లో తాడేపల్లికి పయనం.
Comments
Please login to add a commentAdd a comment