అమలాపురం టౌన్: పట్టణం సమీపంలోని ఈదరపల్లి గ్రామానికి చెందిన రౌడీషీటర్ పోలిశెట్టి రామకృష్ణ కిషోర్ (24) హత్యకు గురయ్యాడు. ఈ ఘటనలో అదే గ్రామానికి చెందిన అడపా సాయి లక్ష్మణ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈదరపల్లి శ్మశానంలో ఈ సంఘటన జరిగింది. అవివాహితుడైన హతుడు కిషోర్‌పై పట్టణ పోలీసు స్టేషన్‌లో పలు కేసులున్నాయి. ఇటీవల కొన్ని రౌడీ గ్యాంగ్‌లు తరచుగా ఆధిపత్య పోరుకు దిగుతున్నాయి. వీటిల్లో ఉన్న రౌడీలు పూటుగా తాగి, అప్పుడప్పుడు ఘర్షణలకు దిగుతున్నారు. ఇటువంటి ఘర్షణలోనే కిషోర్‌ను ప్రత్యర్థులు మట్టుబెట్టారని పోలీసులు చెప్పారు.
అమలాపురం డీఎస్పీ ఎం.అంబికా ప్రసాద్ కథనం ప్రకారం.. రౌడీ గ్యాంగ్‌లకు చెందిన కొంత మంది యువకులు తాగిన మైకంలో ఈదరపల్లి రంగా విగ్రహం వద్ద గురువారం రాత్రి ఘర్షణకు దిగారు. ఆ గొడవలు రాత్రి సద్దుమణిగాయి. శుక్రవారం ఉదయం వారు మళ్లీ అదే చోట ఘర్షణకు దిగడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే రంగప్రవేశం చేసి, రంగా విగ్రహం వద్ద ఎవరూ గుమిగూడకుండా చర్యలు చేపట్టారు.
ఈలోగా ఈదరపల్లి శ్మశానం వద్ద రౌడీషీటర్ కిషోర్, అతడి స్నేహితుడు అడపా సాయిలక్ష్మణ్‌పై ప్రత్యర్థులు కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. కొన ఊపిరితో ఉన్న కిషోర్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలిస్తూండగా ప్రాణాలు వదిలాడు. గాయపడిన సాయి లక్ష్మణ్‌ను తొలుత స్థానిక ప్రభుత్వాస్పత్రికి, పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
నలుగురి పేర్లు వెల్లడి
ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన సాయి లక్ష్మణ్‌ను డీఎస్పీ ఎం.అంబికా ప్రసాద్, పట్టణ సీఐ డి.దుర్గాశేఖరరెడ్డి ఏరియా ఆస్పత్రిలో వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్టేట్‌మెంట్ నమోదు చేశారు. ఈదరపల్లికి చెందిన సతీష్, ఇంద్ర, పట్టణంలోని కొంకాపల్లికి చెందిన రౌడీ షీటర్ ఇండిగుల ఆనంద్, అల్లవరం మండలం గూడాలకు చెందిన సుధీర్‌తో పాటు మరి కొంత మంది తమపై దాడి చేశారని లక్ష్మణ్ తెలిపాడు. వీరిలో ఇండిగుల ఆనంద్ టీడీపీ సానుభూతిపరుడు.
టీడీపీ అమలాపురం నియోజకవర్గ నాయకుడు, మాజీ రౌడీ షీటర్‌కు ప్రధాన అనుచరుడిగా ఉన్నాడు. ఈ హత్య తాగిన మైకంలో చెలరేగిన ఘర్షణల వల్లే జరిగిందని డీఎస్పీ అంబికా ప్రసాద్ చెప్పారు. సాయిలక్ష్మణ్ నుంచి స్టేట్‌మెంట్ తీసుకున్న అనంతరం పోలీసు అధికారులు ఈదరపల్లి శ్మశానం వద్దకు చేరుకున్నారు. ఈ సంఘటనకు దారి తీసిన పరిస్థితులపై విచారణ జరిపారు. గాయపడిన సాయి లక్ష్మణ్ పరిస్థితిని జిల్లా ఏఎస్పీ ఎస్.ఖాదర్ బాషా కూడా స్వయంగా పరిశీలించారు.
రెండు పోలీసు బృందాలు
సాయి లక్ష్మణ్ చెప్పిన ప్రత్యర్థుల ఆచూకీ తెలుసుకునేందుకు ఇద్దరు ఎస్సైలతో కూడిన రెండు పోలీసు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామని డీఎస్పీ అంబికా ప్రసాద్ తెలిపారు. ఎస్సై హరీష్‌కుమార్, ఎస్సై ప్రభాకర్‌ల ఆధ్వర్యాన రెండు పోలీసు బృందాలు నిందితుల కోసం గాలింపు మొదలుపెట్టాయి. కాగా, ఈ సంఘటనలో హత్యకు గురైన రౌడీషీటర్ కిషోర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కిషోర్ అవాహితుడు. తరచూ వివాదాలకు దిగుతూంటాడని పోలీసులు చెప్పారు.
హత్యకు నిరసనగా దుకాణం దహనం
రౌడీ షీటర్ పోలిశెట్టి రామకృష్ణ కిషోర్ హత్యను నిరసిస్తూ అతడి వర్గానికి చెందిన కొందరు స్థానిక ఎర్ర వంతెన వద్ద ఉన్న ఓ దుకాణాన్ని శుక్రవారం రాత్రి దహనం చేశారు. సప్తగిరి అపార్ట్‌మెంట్స్‌లో ఉంటున్న టీడీపీ నాయకుడు, మాజీ రౌడీ షీటర్ గంధం పల్లంరాజుకు చెందిన ఈ దుకాణాన్ని కిషోర్ వర్గీయులు దహనం చేసినట్టు పోలీసులు గుర్తించారు.
దహనమవుతున్న దుకాణం వద్దకు డీఎస్పీ అంబికా ప్రసాద్ చేరుకుని స్థానికులను విచారించారు. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు మోటారు సైకిల్‌పై వచ్చి దుకాణానికి నిప్పు పెట్టినట్టు స్థానికులు చెప్పారు. షాపు దహనానికి పాల్పడిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసును లోతుగా విచారిస్తున్నారు. ఈ ఘటనలో పక్కనున్న దుకాణాలు కూడా పాక్షికంగా దెబ్బ తిన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment