రాజమహేంద్రవరం: హేతుబద్ధత కలిగిన, తప్పులకు తావు లేని ఓటర్ల జాబితాను రూపొందించేందుకు అధికార యంత్రాంగం పటిష్ట ప్రణాళికతో చర్యలు తీసుకుంటోంది. ఓటర్ల తుది జాబితాకు రూపుదిద్దడంలో పారదర్శకతకు పెద్దపీట వేస్తోంది. ఇందులో రాజకీయ పార్టీలను భాగస్వాముల్ని చేస్తోంది. కియోస్క్‌లు ఏర్పాటు చేసి మరీ కొత్త ఓటర్లను నమోదు చేస్తోంది.
జిల్లావ్యాప్తంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఓటు విలువపై ప్రజల్లో ముఖ్యంగా యువతలో చైతన్యం కల్పిస్తోంది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తోంది. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు తప్పులు లేని ఓటర్ల జాబితా రూపకల్పనపై ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. వచ్చే నెల ఐదో తేదీ నాటికి సంపూర్ణ ఓటర్ల జాబితాను రూపొందించనుంది.
1,569 పోలింగ్ కేంద్రాల్లో ప్రక్రియ
జిల్లా వ్యాప్తంగా 1,569 పోలింగ్ కేంద్రాల పరిధిలో 15,76,026 మంది ఓటర్లు ఉన్నారు. ప్రజల నుంచి ఫారం 6, 7, 8లకు సంంధించి 2,92,462 దరఖాస్తులను అధికార యంత్రాంగం స్వీకరించింది. వీటిలో ఇప్పటికే 2,50,096 పరిష్కరించగా, మిగిలిన 42,366 దరఖాస్తుల పరిష్కారానికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతోంది. 18 ఏళ్ల వయసు నిండిన వారిని ఓటర్లుగా నమోదు చేసేందుకు కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల వివరాలు, వారి ఎపిక్ కార్డు సంఖ్యతో బేరీజు వేసుకుంటోంది.
ఓటు లేని వారి నుంచి ఫారం–6 దరఖాస్తులు స్వీకరిస్తోంది. స్వీప్ తదితర కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పిస్తోంది. ఫలితంగా పెద్ద ఎత్తున కొత్త ఓటర్ల నమోదుకు ఎక్కువ దరఖాస్తులు అందుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో ప్రత్యేక ఓటు నమోదు శిబిరాలు ఇప్పటికే నిర్వహించారు. గత నెల 4, 5, ఈ నెల 2, 3 తేదీల్లో నిర్వహించిన ఈ ప్రత్యేక శిబిరాల్లో 31,748 దరఖాస్తులు వచ్చాయి.
పక్కాగా కసరత్తు
ముసాయిదా ఓటర్ల జాబితాపై అందిన దరఖాస్తులను ఈ నెల 26వ తేదీ నాటికి పూర్తి స్థాయిలో పరిష్కరించి, వచ్చే నెల 5న ఓటర్ల తుది జాబితా ప్రచురించే దిశగా అధికారులు పక్కా చర్యలు తీసుకుంటున్నారు. జాబితాలో చేర్పులు, మార్పులకు సంబంధించి ఆయా గ్రామ పంచాయతీలు, వార్డు సచివాలయల్లో నోటీసులు ఉంచుతున్నారు.
క్షేత్ర స్థాయిలో బూత్ లెవెల్ అధికారులు (బీఎల్‌ఓ), జిల్లా స్థాయి అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తున్నారు. ఎఫ్‌పీ రేషియో, జెండర్ రేషియో విషయంలో వాస్తవ పరిస్థితిని అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగా రేషన్ కార్డులో ఉన్న 18 ఏళ్లు నిండిన వారి వివరాలను, ఆ పోలింగ్ కేంద్రాల్లో ఉన్న ఓటర్ల సంఖ్యతో సరి చూసి, పక్కాగా జాబితా రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నారు.
రాజకీయ నేతలతో సమావేశమవుతూ..
ఈ నెల 20వ తేదీ నాటికి పెండింగ్ దరఖాస్తులన్నింటినీ పరిష్కరించేందుకు కలెక్టర్ కె.మాధవీలత ప్రతి బుధవారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి, సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు.
వారి సూచనలను పరిగణనలోకి తీసుకుంటూనే ఫారం 6, 7, 8 దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. యువ ఓటర్లు ఓటు హక్కు నమోదు చేసుకోవడం నుంచి ఓటు హక్కు వినియోగించుకునేంత వరకూ ఓటర్లలో చైతన్యం తీసుకురావడంలో రాజకీయ పార్టీలు కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ సూచిస్తున్నారు.
వెల్లువెత్తిన దరఖాస్తులు
ఓటు హక్కు నమోదు, మార్పులు, చేర్పులకు ఈ నెల 2, 3 తేదీల్లో నిర్వహించిన ప్రత్యేక శిబిరాల్లో జిల్లా వ్యాప్తంగా 17,924 దరఖాస్తులు అందాయి.
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలన్నదే ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ లక్ష్యం. అందుకు అనుగుణంగా ఓటర్ల జాబితా రూపకల్పనలో పారదర్శకత పాటిస్తున్నాం. ముసాయిదా జాబితాపై అభ్యంతరాలను దరఖాస్తుల రూపంలో స్వీకరించి, పరిష్కారానికి వేగంగా అడుగులు వేస్తున్నాం.
ఓటు హక్కు నమోదుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రత్యేకంగా యువతకు అందుబాటులో ఉండేలా కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. జనవరి మొదటి వారంలో తుది జాబితా విడుదల చేయనున్న నేపథ్యంలో ఏ ఒక్కరూ తాను ఓటు హక్కు పొందలేదన్న భావన కలగకుండా చేసేందుకు కృషి చేస్తున్నాం. – కె.మాధవీలత, జిల్లా కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment