వర్సిటీ ప్రగతే పరమావధి
రాజానగరం: ఇంటర్మీడియెట్ విద్య పూర్తి చేసుకుని.. జీవితానికి ఓ గమ్యం నిర్దేశించుకుని.. ఆసక్తి, అభిరుచికి అనుగుణంగా ఉన్నత విద్య అభ్యసించేందుకు వచ్చిన యువత.. జీవితంలో స్థిరపడేలా చేయడమే కాకుండా.. సమాజానికి ఉపయోగపడేలా వారిని తీర్చిదిద్దేవి విశ్వవిద్యాలయాలు. విద్యార్థులకు అడుగడుగునా మార్గదర్శకత్వాన్ని అందించే గురుతర బాధ్యత ఆ విశ్వవిద్యాలయాల్లోని అధ్యాపకులదే. వారితో పాటు విద్యార్థులను సరైన మార్గంలో నడిపించే కీలక బాధ్యత ఆ యూనివర్సిటీ ఉప కులపతి (వైస్ చాన్సలర్) భుజస్కంధాలపై ఉంటుంది. ఆదికవి నన్నయ యూనివర్సిటీలో అటువంటి కీలక పదవిలో నియమితులయ్యారు ఆచార్య సత్తుపాటి ప్రసన్నశ్రీ. గిరిజన తెగలో జన్మించిన ఆమె.. కష్టపడి, ఉన్నత చదువులు చదివి.. అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించిన ఆమె వైస్ చాన్సలర్ స్థాయికి ఎదిగారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 10 సెమినార్లు నిర్వహించి, 60 సెమినార్లలో పాల్గొన్నారు. ఆమె రచించిన 125 పరిశోధన వ్యాసాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ప్రచురితమయ్యాయి. బోధనారంగంలో అపార అనుభవం కలిగిన ఆమె వీసీగా ప్రత్యేక విజన్‌తో పని చేసి, ‘నన్నయ’ వర్సిటీ ప్రగతిని ఇనుమడింపజేయాలని భావిస్తున్నారు. వీసీగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ‘సాక్షి’ ఇంటర్వ్యూలో ఆచార్య ప్రసన్నశ్రీ అనేక అంశాలు ముచ్చటించారు. ఆ వివరాలు..
ఆనందంగా ఉంది
యూనివర్సిటీ వైస్ చాన్సలర్ కావాలని అధ్యాపకులైన ప్రతి ఒక్కరికీ డ్రీమ్ ఉంటుంది, అది సాధారణ కమ్యూనిటీలోని వారికి సాకారం కావచ్చునేమో కానీ.. నాలాంటి ఒక గిరిజన మహిళకు కష్టమే. చదువు ఎందుకు అనే సమాజంలో పుట్టిన నేను ఒక యూనివర్సిటీకి వైస్ చాన్సలర్ కావడమంటే అవధులు లేని ఆనందంగానే ఉంది.
ఆ అదృష్టం నాదే..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 1957లో ఆవిర్భవించిన తరువాత ఇంతవరకూ ఏ యూనివర్సిటీకీ గిరిజన మహిళ వీసీ కాలేదు. ఆ అవకాశం తొలిసారి నాకే దక్కడం అదృష్టంగా భావిస్తున్నా.
ఒకే కుటుంబంగా పని చేయాలి
1987లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా బోధనా వృత్తిలోకి అడుగుపెట్టాను. ఆంధ్రా యూనివర్సిటీ డిపార్టుమెంట్ ఆఫ్ ఇంగ్లిష్ ప్రొఫెసర్‌గా పని చేశా. 38 సంవత్సరాల సీనియారిటీతో ఉన్న తనను ‘నన్నయ’ వీసీగా నియమించినందుకు కృతజ్ఞతలు. పరిపాలన నాకు కొత్త కాదు. చిందరవందరగా ఉన్న వలకు మాట్లు వేసి, సరిచేసే ప్రయత్నంలో ఉన్నా. వర్గాలు, వైషమ్యాలు విడనాడి, వర్సిటీ ప్రగతికి అందరూ ఒకే కుటుంబంలా పని చేస్తేనే ఇక్కడ ఉంటారు.
పరిశోధనలకు ప్రోత్సాహం
సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ, సమాజానికి తోడ్పడేలా పరిశోధనలు జరగాలి. అందుకు అవసరమైన ప్రోత్సాహాన్ని పరిశోధకులకు ఇచ్చేందుకు ఇక్కడున్న వనరులు, సదుపాయాలపై ఆకళింపు చేసుకుని, తదనుగుణంగా చర్యలు తీసుకుంటాం.
రాష్ట్రపతి నుంచి అవార్డు
ఆకలి వేసి వారికి ఆహారం అందిస్తేనే దానికి విలువ ఉంటుంది. ఆ భావనతోనే అంతరించిపోయే పరిస్థితిలో ఉన్న 19 ఆదిమ జాతి భాషలకు లిపిని అందించే ప్రయత్నం చేశాను. ఆ సమయంలో అనేక మంది పెద్దల నుంచి సరైన సహకారం లభించకపోగా, అవమానాలు ఎదురయ్యాయి. అయినా వెనుకడుగు వేయలేదు. మనం చేసే పని సమాజానికి ఉపయోగపడుతుందనుకున్నప్పుడు ఒడుదొడుకులను లెక్క చేయకూడదనుకున్నా. ఆదివాసీ తెగల సంస్కృతీ సంప్రదాయాలపై పరిశోధనలు చేసి, బగత, గదబ, కొలామి, కొండదొర వంటి 19 గిరిజన భాషలకు లిపి రూపొందించాను. నా కృషికి గుర్తింపుగా అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నుంచి 2022లో నారీశక్తి పురస్కారం అందుకున్నా. ఆదిమ జాతి వారంటే అమాయకులు, తెలివి లేని వారు కాదు. సరైన ప్రోత్సాహం లేకపోవడమే వారి వెనుకబాటుకు ప్రధాన కారణం. నిజం చెప్పాలంటే సమాజానికి ఆది పురుషుడు ఆదిమ జాతివాడే.
నేనూ గోదావరి వాసినే..
సాహిత్య, సాంస్కృతిక రాజధానిగా పేరొందిన రాజమహేంద్రవరం, ముఖ్యంగా గోదావరి తీరాన ఉన్న నన్నయ వర్సిటీకి వీసీగా పని చేయడం సంతోషంగా ఉంది. నా అత్తింటి వారు రాజమహేంద్రవరం వారే. అల్లు ఎరకయ్య మా మామయ్య. అలా నేను కూడా గోదావరి వాసినే అయినందుకు గర్వపడుతున్నాను. ఇక్కడి సాహిత్య, సాంస్కృతిక శోభను ఇనుమడింపజేసేలా యూనివర్సిటీ పరంగా ప్రయత్నిస్తాను. సంగీతం, సాహిత్యం, కళలు అంటే చాలా ఇష్టం. ఆదికవి నన్నయ నడయాడిన ఈ నేలలో ఆ వైబ్రేషన్స్ ఉంటాయి.
‘నన్నయ’ వీసీగా ప్రసన్నశ్రీ బాధ్యతల స్వీకరణ
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఉప కులపతిగా ఆచార్య సత్తుపాటి ప్రసన్నశ్రీ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకూ ఇన్‌చార్జి వీసీగా ఉన్న ఆచార్య వై.శ్రీనివాసరావు నుంచి ఆమె బాధ్యతలు స్వీకరించారు. వీసీగా బాధ్యతలు చేపట్టేందుకు వచ్చిన ఆమెకు యూనివర్సిటీ ముఖద్వారం వద్ద అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది ఘన స్వాగతం పలికారు. వర్సిటీ ముఖద్వారంలోని ఆదికవి నన్నయ విగ్రహానికి, సెంట్రల్ లైబ్రరీ వద్ద ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి ఆచార్య ప్రసన్నశ్రీ పూలమాలలు వేసి, అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎన్‌సీసీ విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించి, వీసీ చాంబర్‌కి వెళ్లి, బాధ్యతలు స్వీకరించారు. అనంతరం వర్సిటీలోని వివిధ విభాగాలు, తాడేపల్లిగూడెం, కాకినాడ క్యాంపస్‌లలోని సిబ్బందితో సమావేశమయ్యారు.
సమాజహితంగా ఎదగాలి
ఈ సందర్భంగా ఆచార్య ప్రసన్నశ్రీ మీడియాతో మాట్లాడుతూ, గిరిజన మహిళగా తనకు లభించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ, వర్సిటీ ప్రగతికి సమష్టిగా కృషి చేస్తామని చెప్పారు. వర్సిటీ అంతా ఒక కుటుంబమని, దీనికి పెద్దగా తనకు బాధ్యత అప్పగించారని అన్నారు. ఈ కుటుంబ గౌరవాన్ని ఇనుమడింపజేసే విధంగా సభ్యుల ప్రవర్తన ఉండాలని స్పష్టం చేశారు. విద్యార్థులు కూడా ఉన్నత లక్ష్యాలతో సమాజహితంగా ఎదగాలని హితవు పలికారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య జి.సుధాకర్, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
వర్గవైషమ్యాలు వీడాలి
అవగాహన చేసుకుని..
అవసరమైన చర్యలు తీసుకుంటా
‘నన్నయ’ నూతన వీసీ ఆచార్య ప్రసన్నశ్రీ
వర్సిటీ ప్రగతే పరమావధి
Comments
Please login to add a commentAdd a comment