అన్నదాతకు అ‘ధనం’
● కొబ్బరిలో అంతర పంటగా వక్క సాగు
● ఎకరాకు రూ.1.20 లక్షల ఆదాయం
● చెట్టుకు 2 కిలోల వక్కల దిగుబడి
దేవరపల్లి: మెట్ట రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా బహుళ పంటలు సాగు చేస్తూ అదనపు ఆదాయం పొందుతున్నారు. కొబ్బరి, ఆయిల్‌పామ్ తోటల్లో ప్రధాన పంటల కంటే అంతర పంటల ద్వారానే ఎక్కువ రాబడి పొందుతున్నారు. కోకోతో పాటు వక్క, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క వంటి సుగంధ ద్రవ్యాలను అంతర పంటలుగా సాగు చేస్తూ ఎకరాకు ఏటా సుమారు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల ఆదాయం పొందుతున్నారు. మూడేళ్లుగా అంతర పంటలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో రైతులకు గిట్టుబాటు ధర లభిస్తోంది. వీటి సాగులో పెట్టుబడి తక్కువ ఆదాయం ఎక్కువగా ఉందని రైతులు తెలిపారు.
వక్కతో అధిక ఆదాయం
వక్క పంట ద్వారా రైతులకు మంచి ఆదాయం వస్తోంది. కొబ్బరిలో కోకో, వక్క అంతర పంటలుగా సాగు చేస్తున్నారు. మార్కెట్లో ప్రస్తుతం కిలో వక్కలకు రూ.550 వరకూ ధర వస్తోంది. చెట్టుకు ఎకరాకు 2 కిలోల వరకూ దిగుబడి వస్తోంది. తద్వారా ఒక్కో చెట్టుకు రూ.1,100 ఆదాయం వస్తోందని రైతులు చెబుతున్నారు. ఎకరాకు 120 మొక్కలు వేస్తున్నారు. వీటి ద్వారా ఎకరాకు ఏడాదికి సుమారు రూ.1.20 లక్షల రాబడి వస్తోంది. కొవ్వూరు డివిజన్‌లోని దేవరపల్లి, చాగల్లు, నిడదవోలు, నల్లజర్ల మండలాల్లోని సుమారు 50 ఎకరాల్లో వక్కను అంతర పంటగా సాగు చేస్తున్నారు. దేవరపల్లి మండలం దేవరపల్లి, రామన్నపాలెం, కురుకూరు, పల్లంట్ల, యాదవోలు, దుద్దుకూరు, చాగల్లు మండలం చిక్కాల, కలవలపల్లి, నిడదవోలు మండలం కోరుమామిడి గ్రామాల్లో వక్క సాగు జరుగుతోంది. ఇక్కడ పండించిన పంటను డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం, అంబాజీపేట, తెలంగాణలోని ఖమ్మం ప్రాంతాల నుంచి వస్తున్న వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు.
మంచి ఆదాయం వస్తోంది
కొబ్బరిలో అంతర పంటలతో మంచి ఆదాయం వస్తోంది. నేను ఐదెకరాల్లో కొబ్బరి ప్రధాన పంటగా వేసి, కోకో, వక్క, మిరియాలను అంతర పంటగా సాగు చేస్తున్నాను. కోకోకు ఏడాదికి ఎకరాకు రూ.2.50 లక్షల నుంచి రూ.3 లక్షల ఆదాయం వస్తోంది. వక్క పంటకు దాదాపు రూ.1.20 లక్షలు అదనపు ఆదాయం వస్తోంది. ఎకరాకు 120 మొక్కలు వేశాను. ఒక్కో చెట్టు నుంచి ఏడాదికి రూ.1,100 వరకూ వస్తోంది. వక్క సాగుకు ఈ నేలలు అనుకూలంగా ఉండటంతో మంచి దిగుబడులు వస్తున్నాయి.
– జుజ్జవరపు సతీష్, ఆదర్శ రైతు,
కురుకూరు, దేవరపల్లి మండలం
బహుళ పంటల సాగు
కొబ్బరిలో అంతర పంటగా బహుళ పంటలు సాగు చేస్తున్న రైతులు అదనపు ఆదాయం పొందుతున్నారు. కొబ్బరిలో కోకో, వక్క, సుగంధ ద్రవ్యాలను అంతర పంటలుగా సాగు చేస్తున్నారు. ఒక్కో వక్క చెట్టుకు 2 నుంచి 2.5 కిలోల దిగుబడి వస్తుంది. మొక్క వేసిన ఐదేళ్ల నుంచి దిగుబడి వస్తుంది. నాలుగైదు మీటర్ల ఎత్తు పెరుగుతుంది. ప్రస్తుతం మార్కెట్లో వక్క ధర బాగుంది. జాజి ధర కూడా బాగానే ఉంది. ఈ మొక్క వేసిన ఏడేళ్లకు దిగుబడి వస్తోంది. అంబాజీపేట నుంచి వక్క మొక్కల సరఫరా జరుగుతోంది. – బి.సుజాత కుమారి,
జిల్లా ఉద్యానవన శాఖ అధికారి, రాజమహేంద్రవరం
అన్నదాతకు అ‘ధనం’
అన్నదాతకు అ‘ధనం’
అన్నదాతకు అ‘ధనం’
అన్నదాతకు అ‘ధనం’
Comments
Please login to add a commentAdd a comment