కూరగాయలు..కూల్
● నీటితో పని చేసే కూలర్లు
● ఇంధనంతో పని లేదు
● పైసా ఖర్చూ ఉండదు
● కూరగాయలు, పండ్లు నిల్వ
చేసుకునే అవకాశం
● రైతులకు 50 శాతం రాయితీపై పంపిణీ
పిఠాపురం: ఆకుకూరలు, పండ్లు ఏరోజుకారోజు వాడుకుంటేనే నాణ్యత కలిగి ఉంటాయనేది అందరికీ తెలుసున్న విషయం. అలా ఏరోజుకారోజు పంటలు అందుబాటులో ఉండాలంటే వీలు కాని పరిస్థితి. అలాగని నిల్వ ఉంచి అమ్ముదామంటే అవి సహజత్వాన్ని కోల్పోయి తగిన ధర రాదు. కొనే వారూ ఉండరు. కోసిన పంట ఆ రోజు అమ్ముడవకపోతే రైతుకు నష్టం తప్పదు. అలాగని కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేయాలంటే పెట్టుబడి తడిపి మోపెడవుతుంది. అలాంటి రైతుల కోసం కేవలం నీటితో పని చేసే సబ్జీ కూలర్లు అందుబాటులోకి వచ్చాయి. ఎటువంటి విద్యుత్, ఇంధనం అవసరం లేకుండా కేవలం నీటితో పని చేసే ఈ కూలర్లను ఉద్యాన శాఖ అధికారులు రైతులకు అందిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని తిరుపతి, విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చిన ఈ కూలర్లను కొత్తగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. వీటిని ముంబై ఐఐటీ విద్యార్థులు రూపొందించారు. ఈ కూలర్‌లో 24 గంటలకోసారి 20 లీటర్ల నీరు పోస్తే అందులో నిల్వ చేసిన కూరగాయలు, పండ్లు సుమారు వారం రోజుల పాటు పాడవకుండా ఉంటాయి. దీని నిర్వహణకు ఎటువంటి అదనపు ఖర్చూ ఉండదు. పదేళ్లపాటు నిరంతరం పని చేస్తుంది. ఈ సబ్జీ కూలర్ల ద్వారా రైతులు తక్కువ ఖర్చుతో తమ పంట ఉత్పత్తులను నిల్వ చేసుకుని, తగిన ధర వచ్చినప్పుడు అమ్ముకుని లాభాలు ఆర్జించే వీలుంటుంది. ఉష్ణోగ్రతలను సమతులం చేయడం ద్వారా ఎటువంటి రసాయనాలూ వాడనవసరం లేకుండానే కూరగాయలు, పండ్లు తాజాగా ఉండేలా ఈ కూలర్ కాపాడుతుంది. సేంద్రియ పద్ధతిలో పండించిన పంట ఉత్పత్తులను వారం రోజుల పాటు పాడవకుండా నిల్వ ఉంచుకుని, విక్రయించుకోవడానికి సబ్జీ కూలర్ ఉపయోగపడుతుంది.
సబ్జీ కూలర్ రకాలు
సామర్థ్యం ధర (రూ.వేలు)
25 కేజీలు 21,000
50 కేజీలు 39,900
100 కేజీలు 57,000
వీటిని 50 శాతం రాయితీతో ఉద్యాన శాఖ అందిస్తోంది.
జిల్లాలో ఉద్యాన పంటల విస్తీర్ణం 36,723 హెక్టార్లు
ఉద్యాన రైతులు 95,000
Comments
Please login to add a commentAdd a comment