ఘనంగా లక్ష తులసి పూజ
పెరవలి: అన్నవరప్పాడు వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం లక్ష తులసి పూజ ఘనంగా నిర్వహించారు. ఈ పూజలో 120 మంది దంపతులు పాల్గొన్నారు. తెల్లవారుజామున అర్చకులు మూలవిరాట్టుకు అభిషేకం నిర్వహించారు. అనంతరం, ప్రత్యేక మండపంలో ఏర్పాటు చేసిన వేదిక పైకి శ్రీదేవీ భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వార్ల ఉత్సవ మూర్తులను వేంచేయించి, లక్ష తులసి పూజ ప్రారంభించారు. సాయంత్రం నాలుగు గంటల వరకూ ఈ పూజ జరిగింది. మల్లేశ్వరం, అన్నవరప్పాడు, పిట్టల వేమవరం, ఖండవల్లి, కడింపాడు, దొంగరావిపాలెం, గోపాలపురం, రావులపాలెం నుంచి వందలాదిగా భక్తులు తరలివచ్చి, ఈ పూజను కన్నులారా వీక్షించారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం ప్రతిధ్వనించింది.
భాగ్యనగర్ ఫ్యాక్టరీ పరిశీలన
గోపాలపురం: మండలంలోని సగ్గొండ పంచాయతీ పరిధిలోని భాగ్యనగర్ క్లోరైడ్ ఫ్యాక్టరీని వివిధ శాఖల అధికారులు ఆదివారం పరిశీలించారు. ఈ పరిశ్రమలో శనివారం అల్యూమినియం ఫ్లోరైడ్ ఒక్కసారిగా బయటకు పొక్కడంతో అక్కడే పని చేస్తున్న ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాలుష్య నియంత్రణ మండలి, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, అగ్నిమాపక, పోలీసు అధికారులు ఈ పరిశ్రమలో తనిఖీలు చేశారు. యాజమాన్యానికి సూచనలు సలహాలు ఇచ్చారు.
అయినవిల్లిలో భక్తుల సందడి
అయినవిల్లి: విఘ్నేశ్వర స్వామివారిని ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుని, ప్రత్యేక పూజలు చేశారు. ప్రధానార్చకుడు అయినవిల్లి సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో స్వామికి మేలుకొలుపు సేవ, పంచామృతాభిషేకం, ఏకా దశ, లఘున్యాస పూర్వక అభిషేకాలు, శ్రీలక్ష్మీగణపతి హోమం, గరిక పూజ జరిపారు. స్వామిని అర్చకులు వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. మహానివేదన చేశారు. రాత్రి 8 గంటలకు విశేష సేవలు చేసి, ఆలయ తలుపులు మూసివేశారు. స్వామివారి పంచామృతాభిషేకాల్లో 3 జంటలు లక్ష్మీగణపతి హోమంలో 25 జంటలు, గరిక పూజలో ఒక జంట పాల్గొన్నాయి. లఘున్యాస ఏకాదశ రుద్రాభిషేకాల్లో 62 మంది పాల్గొన్నారు. ముగ్గురు భక్తులు ఉండ్రాళ్ల పూజలు జరిపారు. 77 మంది చిన్నారులకు అక్షరాభ్యాసాలు, 15 మంది చిన్నారులకు అన్నప్రాశనలు, 14 మందికి తులాభారం, ఒకరికి నామకరణం చేశారు. స్వామికి 12 మంది తలనీలాలు సమర్పించారు. 48 నూతన వాహనాలకు ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి అన్నప్రసాదాన్ని 4,100 మంది భక్తులు స్వీకరించారు. ఆదివారం ఒక్క రోజు స్వామివారికి వివిధ పూజా టికెట్లు, అన్నదాన విరాళాల ద్వారా రూ.5,72,525 ఆదాయం లభించినట్లు ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు.
ఘనంగా లక్ష తులసి పూజ
Comments
Please login to add a commentAdd a comment