గ్రీన్‌ఫీల్డ్ రయ్‌వే
ఎకరం రూ.2 కోట్లు
ఇప్పటికే రెండు హైవేలు ఉండటం, మరో హైవే వస్తూండటంతో దేవరపల్లి ప్రాంతంలో ఇప్పటికే భూముల ధరలు ఊహించని విధంగా పెరిగాయి. ఎకరం రూ.2 కోట్లు పైగా పలుకుతోంది. మూడు జాతీయ రహదారులు అందుబాటులోకి రావడంతో మెట్ట ప్రాంతంలో వ్యవసాయ ఉత్పత్తులకు మెరుగైన రవాణా సౌకర్యం ఏర్పడనుంది. పంట ఉత్పత్తులను దూర ప్రాంతాల్లోని మార్కెట్లకు రవాణా చేయడం ద్వారా ఇక్కడి రైతులు గిట్టుబాటు ధర పొందే అవకాశం కలుగుతుంది. ఇప్పటికే ఈ ప్రాంతం నుంచి రైతులు హైదరాబాద్, విశాఖపట్నం, విజయనగరం, కోల్‌కతా వంటి ప్రాంతాలకు వ్యవసాయ ఉత్పత్తులు రవాణా చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా నిమ్మ, అరటి, కోకో, జీడిగింజల వంటి పంట ఉత్పత్తులు వస్తుంటాయి.
● ఖమ్మం – దేవరపల్లి మధ్య నిర్మాణం
● జూన్ నాటికి పూర్తి
● రూ.2,200 కోట్ల వ్యయం
దేవరపల్లి: రెండు తెలుగు రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరో నాలుగు నెలల్లో ఈ జాతీయ రహదారి ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఎక్కడా గ్రామాలను తాకకుండా పచ్చని పంట పొలాల మధ్య నుంచి దీనిని నిర్మిస్తున్నారు. ఈ హైవే నిర్మాణం పూర్తయితే ఉత్తరాంధ్ర నుంచి తెలంగాణకు రవాణా సదుపాయం మెరుగుపడటంతో పాటు సమయం, దూరం ఆదా కానున్నాయి.
162 కిలోమీటర్లు
తెలంగాణలోని ఖమ్మం నుంచి తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి వరకూ రూ.2,200 కోట్లతో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) సుమారు 162 కిలోమీటర్ల పొడవున ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవేను నిర్మిస్తోంది. ఇది పూర్తయితే దేవరపల్లి – ఖమ్మం మధ్య సుమారు 70 కిలోమీటర్ల మేర దూరం తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. దీని నిర్మాణానికి 2022 ఏప్రిల్‌లో అప్పటి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. గత ఏడాది సెప్టెంబర్ నాటికి ఈ హైవే నిర్మాణం పూర్తి కావాల్సి ఉండగా అధిక వర్షాలు, తుపానుల కారణంగా పనుల్లో జాప్యం జరిగింది.
వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో..
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ సహకారంతో కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ దీని నిర్మాణ పనులు చేపట్టింది. ఈ నేపథ్యంలో మొన్నటి వరకూ సాధారణ జంక్షన్‌గా ఉన్న దేవరపల్లి ఇప్పుడు మూడు జాతీయ రహదారుల జంక్షన్‌గా కొత్త రూపు సంతరించుకుంటోంది. కోల్‌కతా – చైన్నె 16వ నంబర్ జాతీయ రహదారి దేవరపల్లి మీదుగానే సాగుతోంది. అలాగే, దేవరపల్లి – ఖమ్మం జిల్లా తల్లాడ మధ్య ఇప్పటికే 316డి హైవే ఉంది. ఇప్పుడు కొత్తగా దేవరపల్లి – ఖమ్మం మధ్య కొత్తగా గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మిస్తున్నారు. ఇది 16వ నంబర్ జాతీయ రహదారిని దేవరపల్లి వద్ద గోపాలపురం రోడ్డులోని డైమండ్ జంక్షన్‌కు రెండు కిలోమీటర్ల దూరంలో కలుస్తుంది. ఈ ప్రాంతంలో మూడు హైవేలు కలుస్తూండటంతో వాటిని విభజిస్తూ నూతన టెక్నాలజీతో అవుటర్ రింగ్ రోడ్డు (డ్రమ్‌ఫుట్) నిర్మిస్తున్నారు. ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవేకి ప్రభుత్వం సుమారు 1,100 ఎకరాలు సేకరించింది.
ఆంధ్రాలో హైవే సాగుతుందిలా..
ఏలూరు జిల్లా చింతలపూడి సమీపంలోని రేచర్ల నుంచి ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే మన రాష్ట్రంలో ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి టి.నర్సాపురం, వేపుగుంట, గుర్వాయగూడెం, బొర్రంపాలెం, జంగారెడ్డిగూడెం వద్ద మద్ది ఆంజనేయస్వామి ఆలయం సమీపాన ఎర్రకాలువ మీదుగా కొయ్యలగూడెం మండలం రాజవరం, యర్రంపేట, తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం యాదవోలు, చిన్నాయగూడెం, గోపాలపురం మండలం వాదాలకుంట, వెదుళ్లకుంట గ్రామాల మీదుగా దేవరపల్లి వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిని కలుస్తుంది. జంగారెడ్డిగూడెం వద్ద పుట్లగట్లగూడెం – గుర్వాయగూడెం వద్ద జంక్షన్ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి 83 ఎకరాలు సేకరించారు. ఖమ్మం – దేవరపల్లి మధ్య 8 టోల్‌ప్లాజాలు, 51 మైనర్, 9 మేజర్ బ్రిడ్జిలు నిర్మిస్తున్నారు.
ఉమ్మడి ‘పశ్చిమ’లో 72 కిలోమీటర్లు
గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులను హైదరాబాద్‌కు చెందిన డెకెం సంస్థ చేపట్టింది. తెలంగాణలో ఖమ్మం నుంచి రేచర్ల వరకూ ఒకే ప్యాకేజీగా పనులు జరుగుతున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 72 కిలోమీటర్ల పొడవున మూడు ప్యాకేజీల్లో ఈ పనులు జరుగుతున్నాయి. సేకరించిన భూములకు సంబంధించిన రైతులందరికీ పరిహారం అందించారు.
భూసేకరణకు అడ్డంకులు
గ్రీన్‌ఫీల్డ్ హైవేకి అవసరమైన భూసేకరణకు కొయ్యలగూడెం మండలం పొంగుటూరు వద్ద బ్రేక్ పడింది. ఆ గ్రామానికి చెందిన రైతు కోర్టుకు వెళ్లడంతో మూడెకరాల భూసేకరణ నిలిచిపోయింది. న్యాయస్థానం తీర్పు రిజర్వులో పెట్టి దాదాపు ఏడాది కావస్తోంది. తీర్పు కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు.
85 శాతం పూర్తి
ఖమ్మం – దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఇప్పటి వరకూ రేచర్ల నుంచి గుర్వాయగూడెం వరకూ 85 శాతం, అక్కడి నుంచి దేవరపల్లి వరకూ 65 శాతం పనులు పూర్తయ్యాయి. వంతెనలు, కల్వర్టుల నిర్మాణాలు పూర్తయ్యాయి. దేవరపల్లి వద్ద డ్రమ్‌ఫుట్ నిర్మాణం జరుగుతోంది. మొత్తంగా 85 శాతం పనులు పూర్తయ్యాయి. వచ్చే జూన్ నాటికి ఈ రోడ్డును ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తాం.
– సురేంద్రనాథ్, ప్రాజెక్ట్ డైరెక్టర్, నేషనల్
హైవేస్, రాజమహేంద్రవరం
Comments
Please login to add a commentAdd a comment