కోటసత్తెమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు
నిడదవోలు రూరల్: తిమ్మరాజుపాలెంలో వేంచేసియున్న కోటసత్తెమ్మ తల్లిని ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధానార్చకుడు అప్పారావుశర్మ పర్యవేక్షణలో అమ్మవారికి ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. దర్శనాలు, ప్రసాదం, పూజా టికెట్లు, ఫొటోల అమ్మకం ద్వారా దేవస్థానానికి రూ.1,04,088 ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ వి.హరి సూర్య ప్రకాష్ తెలిపారు. ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్, చైర్మన్ దేవులపల్లి రవిశంకర్, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
నర్సరీలో హైకోర్టు న్యాయమూర్తి
కడియం: కడియపులంకలోని పుల్లా ఆంజనేయులుకు చెందిన శ్రీ సత్యదేవ నర్సరీని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జునరావు ఆదివారం సందర్శించారు. నర్సరీ అధినేత ఆంజనేయులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. వివిధ రకాల మొక్కల గురించి వివరించారు. కడియం ప్రాంత నర్సరీలు అద్భుతంగా ఉన్నాయని న్యాయమూర్తి అన్నారు. పుల్లా వీరబాబు, పుల్లా రాజశేఖర్, డీఎస్పీ భవ్యకిశోర్, తహసీల్దార్ సునీల్ తదితరులు పాల్గొన్నారు.
నేడు హుండీల
ఆదాయం లెక్కింపు
అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో హుండీల ఆదాయాన్ని సోమవారం లెక్కించనున్నారు. అన్నవరం దేవస్థానంలో హుండీల ఆదాయాన్ని గత జనవరి 30వ తేదీన లెక్కించారు. తిరిగి 30 రోజుల అనంతరం లెక్కింపు చేపట్టనున్నారు. జనవరి 30 నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకూ మాఘ మాసం కావడంతో సత్యదేవుని ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. వారు హుండీల్లో పెద్ద మొత్తంలో కానుకలు సమర్పించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో ఈసారి హుండీల ద్వారా సుమారు రూ.1.5 కోట్లు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. హుండీల ఆదాయం లెక్కింపును దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వి.సుబ్బారావు పర్యవేక్షించనున్నారు. లెక్కింపులో దేవస్థానం సిబ్బంది అందరూ పాల్గొనాలని ఈఓ ఆదేశించారు.
అయినవిల్లికి పోటెత్తిన భక్తులు
అయినవిల్లి: సంకటహర చతుర్థి సందర్భంగా ఆదివారం అయినవిల్లి విఘ్నేశ్వరస్వామి వారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని పూజలు చేయించుకున్నారు. 2,730 మంది భక్తులు స్వామివారి అన్న ప్రసాదం స్వీకరించారు. ఆదివారం ఒక్క రోజు వివిధ పూజల టికెట్లు, అన్నదాన విరాళాల ద్వారా దేవస్థానానికి రూ.2,70,660 ఆదాయం లభించినట్లు ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు.
కొత్త అల్లుడికి
కోనసీమ మర్యాదలు
29 వంటకాలతో విందు భోజనం
అమలాపురం టౌన్: ఇంటికి వచ్చిన అల్లుడికి ఆ కుటుంబ సభ్యులు కోనసీమ మర్యాదలు రుచి చూపించారు. ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో ఉంటున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి యర్రమల్లు వంశీకి అమలాపురం శ్రీరామపురానికి చెందిన ప్రత్యూషతో ఇటీవల వివాహమైంది. అత్తవారింటికి ఆదివారం వచ్చిన వంశీ 29 రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. కొత్త దంపతులిద్దరికీ సంప్రదాయబద్ధంగా ఒకే అరిటాకులో పదార్థాలన్నీ వడ్డించగా వంశీ, ప్రత్యూష ఆ విందు ఆరగించారు. కొత్త జంటకు భోజనంలో బిర్యానీ, పులిహోర, ఉల్లి చట్నీ, పన్నీర్ కర్రీ, ములక్కాడ, టమాటా కర్రీ, ఆనపకాయ కూర, చేమదుంపల పులుసు, సాంబారు, దోసకాయ పప్పు, ఆవకాయ, కొబ్బరి కాయ పచ్చడి తదితర వంటకాలు వడ్డించారు. మామ తుమ్మూరి వీర వెంకట సత్యనారాయణ, అత్త ఉమా శ్రీదేవి తమ అల్లుడికి దగ్గరుండి మరీ వడ్డించారు.
కోటసత్తెమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు
Comments
Please login to add a commentAdd a comment