ఐదు నుంచి వేంకటేశ్వర బ్రహ్మోత్సవాలు
● ఐదు రోజులు విశేష వాహన సేవలు
● 6న వైభవంగా శ్రీవారి కళ్యాణోత్సవం
కొత్తపేట: ఆత్రేయపురంలోని లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయ దశమ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 5 నుంచి 9వ తేదీ వరకూ వైభవంగా నిర్వహించనున్నారు. ఆ మేరకు ఆలయ శాశ్వత ధర్మకర్త, ఆలయ కమిటీ చైర్మన్ పాతపాటి వెంకట సత్యనారాయణరాజు ఆధ్వర్యంలో వెంకట సత్యరాజ్యలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ పర్యవేక్షణలో ఐదు రోజుల పాటు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. బ్రహ్మోత్సవాల వివరాలను ఉత్సవ కమిటీ సభ్యులు ఆదివారం విలేకరులకు తెలిపారు. ఐదో తేదీ తెల్లవారు జాము నుంచి ప్రారంభం కానున్న ఉత్సవాలలో ఆ రోజు నుంచి వివిధ వాహనాలపై శ్రీవారి ఊరేగింపులు కనువిందు చేయనున్నాయి. రాత్రి 7.30 గంటలకు శేష వాహనోత్సవం నిర్వహిస్తారు. ఆరో తేదీ ఉదయం 10.30 గంటలకు శ్రీవారి కళ్యాణోత్సవం, సాయంత్రం 6 గంటలకు హనుమద్ వాహనోత్సవం, 7న ఉదయం 108 బిందెలతో కలశాభిషేకం, మహిళలచే సామూహిక కుంకుమార్చన, సాయంత్రం 108 తామర పుష్పాలతో మహాలక్ష్మీహోమం, అనంతరం సింహ వాహనోత్సవం నిర్వహిస్తారు. 8న గరుడ వాహనోత్సవం, అనంతరం శంకు, చక్ర నామార్చన, సహస్ర దీపాలంకరణ సేవ, ఊంజల్ సేవ నిర్వహిస్తారు. 9 న మహా శాంతి హోమం, పూర్ణాహుతి, అనంతరం శ్రీచక్ర స్నానం, అన్న సమారాధన, పల్లకిసేవ, రాత్రి శ్రీపుష్పయాగోత్సవం నిర్వహించనున్నారు.
ఐదు నుంచి వేంకటేశ్వర బ్రహ్మోత్సవాలు
Comments
Please login to add a commentAdd a comment