నిజాయితీతో సేవలందించాలి
● ఏలూరు పోలీస్ రేంజ్ ఐజీ అశోక్‌కుమార్
● 100 మంది ఎస్సైలకు నియామక పత్రాలు
ఏలూరు టౌన్: సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ కు నిర్భయంగా, నిష్పక్షపాతంగా, నిజాయితీతో సేవలందించాలని ఏలూరు పోలీస్ రేంజ్ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్ అన్నారు. అనంతపురం పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో శిక్షణ పూర్తి చేసుకున్న ప్రొబేషనరీ సబ్ ఇన్ స్పెక్టర్లు ఐజీని ఏలూరు రేంజ్ కార్యాలయంలో ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రొబేషనరీ ఎస్సైలకు ఆయన నియామక ఉత్తర్వు లు అందజేశారు. రేంజ్ పరిధిలో 100 మంది (68 మంది పురుషులు, 32 మంది మహిళలు) ఎస్సై శిక్షణ పూర్తి చేసుకోగా జిల్లాల వారీగా ఏలూరు 1, అల్లూరి సీతారామరాజు 4, కాకినాడ జిల్లా 2, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా 1, తూర్పు గోదావరి జిల్లాకు 15, పశ్చిమ గోదావరి జిల్లా 1, కృష్ణా జిల్లాకు 20, ఎన్‌టీఆర్ జిల్లాకు 56 మందిని నియమించారు. ఈ సందర్భంగా ఐజీ అశోక్ కుమార్ మాట్లాడుతూ, పోలీస్ శాఖ ప్రతిష్టను మరింత పెంచేలా ప్రజలకు అత్యుత్తమ స్థాయిలో సేవలు అందించాలని సూచించారు. బాధితుల పక్షాన న్యాయం చేయాలని, నిందితులకు చట్ట ప్రకారం శిక్షలు పడేలా పారదర్శకత, జవాబుదారీతనంతో పని చేయాలని అన్నారు. పోలీస్ శాఖలో అడుగు పెడుతున్న మీరంతా సమాజంలో నేరస్తులకు భయం, బాధితులకు అభయం అందించేలా పని చేయాలన్నారు. పోలీస్ విధుల్లో పని చేయటం అదృష్టంగా భావిస్తూ చట్టాలకు లోబడి సత్వర న్యాయం అందించేలా కృషి చేయాలని ఐజీ పిలుపునిచ్చారు.
నిజాయితీతో సేవలందించాలి
Comments
Please login to add a commentAdd a comment