
మహిళలకు సమానత్వం కల్పించాలి
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): మహిళలకు సమానత్వం కల్పించాలనే నినాదంతో ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించుకుంటున్నామని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో శనివారం జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, శక్తి యాప్ ద్వారా మహిళల రక్షణకు చర్యలు తీసుకుంటున్నారని, దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు. మెప్మా ఆధ్వర్యాన కోటి ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడం ద్వారా రూ.కోటి ఆదాయం సమకూర్చామని చెప్పారు. జిల్లాలో మహిళా రక్షక్ ఏర్పాటు చేసిన ఎస్పీ నరసింహ కిషోర్ అభినందనీయులని, రానున్న రోజుల్లో ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు మన జిల్లా నాంది పలికిందని అన్నారు.
ఆదికవి నన్నయ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ మాట్లాడుతూ, కుటుంబం నుంచే మహిళల పట్ల వివక్షను పారదోలినప్పుడే నిజమైన మహిళా సాధికారిత సాధ్యమవుతుందని అన్నారు. రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ కమిషనర్ కేతన గార్గ్ మాట్లాడుతూ, పారిశుధ్య కార్మికులు, సచివాలయ సిబ్బంది కార్పొరేషన్‌కు వెన్నెముకగా ఉన్నారని, వారిలో పెద్ద సంఖ్యలో మహిళలుండటం గమనార్హమని అన్నారు. డీఎస్పీ భవ్య కిశోర్ మాట్లాడుతూ, సైబర్ నేరాల బారిన పడకుండా ఎన్నో కార్యక్రమాలను చేపట్టామన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ అలరించాయి. తొలుత అతిథులు మెప్మా, డీఆర్‌డీఏ, నగరపాలక సంస్థ, వైద్య, ఆరోగ్య శాఖ, డీఎల్‌ఎస్‌ఏ, పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను తిలకించారు. నగరపాలక సంస్థ పారిశుధ్య సిబ్బందిని సత్కరించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ, డీఆర్‌డీఏ, వైద్య, ఆరోగ్యం, ఆర్ట్స్ కళాశాల, స్పోర్ట్స్, వ్యవసాయ శాఖకు చెందిన 77 మందికి అవార్డులు అందజేశారు. పోలీసు శాఖ నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. మహిళా అధికారులను సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అదనపు ఎస్పీలు సుబ్బరాజు, మురళీకృష్ణ, మహిళ, శిశు సంక్షేమ అధికారి కె.విజయ కుమారి, డీఆర్‌డీఏ పీడీ ఎన్‌వీవీఎస్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment