
మహిళలకు కూటమి ప్రభుత్వం దగా
దేవరపల్లి: ఎన్నికల్లో సూపర్ సిక్స్ పేరిట ప్రజలను మభ్యపెట్టి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పథకాలు అమలు చేయకుండా మహిళలను కూటమి ప్రభుత్వం దగా చేసిందని వైఎస్సార్ సీపీ గోపాలపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్, రాష్ట్ర మాజీ హోం మంత్రి తానేటి వనిత విమర్శించారు. యర్నగూడెంలోని తన క్యాంపు కార్యాలయం వద్ద శనివారం ఆమె విలేకర్లతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలవుతున్నా ఇప్పటి వరకూ ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేయకుండా ప్రజలను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు. ఉచిత బస్సు ఆచూకీ ఎక్కడా లేకపోగా, జిల్లా వరకే ఉచిత బస్సు ప్రయాణమని ప్రభుత్వం ప్రకటించడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఐదేళ్ల పాలనలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ.12 లక్షల కోట్ల అప్పు చేసిందంటూ ఎన్నికల్లో అసత్య ప్రచారం చేసిన కూటమి.. అధికారంలోకి వచ్చాక మాట మార్చిందని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా గత ప్రభుత్వం చేసిన అప్పు రూ.6 లక్షల కోట్లని ప్రకటించారని తెలిపారు. తొమ్మిది నెలల పాలనలో కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకూ రూ.లక్ష కోట్ల అప్పు చేసిందని చెప్పారు. తల్లికి వందనం కోసం పేద పిల్లల తల్లులు ఎదురు చూస్తున్నారన్నారు. ప్రజలను మోసం చేయడం చంద్రబాబుకు పరిపాటిగా మారిందని, భవిష్యత్తులో మరోసారి మోసపోవద్దని వనిత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని పులివెందుల ఎమ్మెల్యేగా రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత సంబోధిస్తున్నారని, ఎవరైనా ముందు ఎమ్మెల్యే అయ్యాకనే మంత్రి, ముఖ్యమంత్రి అవుతారనే విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో దళిత మహిళకు హోం మంత్రిగా అవకాశమిచ్చి గౌరవించారని, ప్రస్తుత సీఎం చంద్రబాబు కూడా ఇదే ఒరవడిని పాటించి అనితకు హోం మంత్రి పదవి ఇచ్చారని చెప్పారు. జగన్ ఈ విధానం ప్రారంభించకపోతే అనితకు హోం మంత్రి పదవి దక్కేదే కాదని స్పష్టం చేశారు. ఎదుటి వారిని గౌరవించి, తిరిగి గౌరవం పొందాలని టీడీపీ, జనసేన మహిళలకు సూచించారు. వైఎస్సార్ సీపీ మహిళలు హుందాగా నడుచుకోవాలని, అసభ్య పదజాలాలు వాడవద్దని వనిత విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆచంట అనసూయ, నియోజకవర్గ, మండల మహిళా అధ్యక్షులు దాకారపు బంగారమ్మ, కడలి హైమావతి, నాగమణి, జెడ్పీటీసీ సభ్యురాలు కాకులపాటి లలిత తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment