
రత్నగిరి.. భక్తజనసిరి
అన్నవరం: సత్యదేవుడిని శనివారం పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించి, పూజలు చేశారు. రత్నగిరితో పాటు వివిధ ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి, శనివారం తెల్లవారుజామున పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవదంపతులు తమ బంధుమిత్రులతో కలసి సత్యదేవుని ఆలయానికి తరలివచ్చారు. వీరందరూ స్వామివారి వ్రతాలాచరించి, దర్శనాలు చేసుకున్నారు. దీంతో ఆలయం వద్ద రద్దీ ఏర్పడింది. ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం పట్టింది. స్వామివారిని 40 వేల మంది దర్శించుకున్నారు. వ్రతాలు 1,800 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సత్యదేవుని అన్న ప్రసాదాన్ని సుమారు 4 వేల మంది స్వీకరించారు. ఆలయంలో సత్యదేవుని ప్రాకార సేవ ఘనంగా నిర్వహించారు. సెలవు కావడంతో ఆదివారం కూడా రత్నగిరిపై భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉంది. ఆదివారం ఉదయం 10 గంటలకు సత్యదేవుడు, అమ్మవారిని టేకు రథంపై ఊరేగించనున్నారు.
సువర్ణ ఇండియా బాధితులకు
న్యాయం చేయాలి
అమలాపురం రూరల్: అమరావతి హైకోర్టు గతేడాది నవంబర్‌లో ఇచ్చిన తీర్పు ప్రకారం సువర్ణ ఇండియా డిపాజిట్ బాధితులకు న్యాయం చేయాలని బాధితుల రాష్ట్ర సంఘం అధ్యక్షుడు కాశీ వెంకట్రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం త్రిరత్న బుద్ధ విహార్ హాలులో సువర్ణ ఇండియా బాధితుల సమావేశం జరిగింది. వెంకట్రావు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల పరిధిలో 24 బ్రాంచీల ద్వారా రూ.12 కోట్ల డిపాజిట్ల సేకరించి 2014లో ముంచేశారన్నారు. అమలాపురం ప్రధాన కేంద్రంగా 2011లో సువర్ణ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయాన్ని ప్రారంభించి డిపాజిట్లు సేకరించారన్నారు. 2016లో కంపెనీకి చెందిన ఆస్తులు, డైరెక్టర్ల పేరు మీద ఉన్న ఆస్తులను అప్పటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధికారులు సీజ్ చేశారని తెలిపారు. సీజ్ చేసిన ఆస్తులకు సంబంధించి రాజమహేంద్రవరంలోని న్యాయస్థానంలో విచారణ జరుగుతుండగానే కంపెనీ ఎండీ బూసి వెంకట నాగవేణు, ఇతర డైరెక్టర్లు కలిసి ఏపీలో పలుచోట్ల సీజ్ చేసిన ఆస్తులను విక్రయించారన్నారు. 2024లో హైకోర్టు తీర్పు ప్రకారం కంపెనీకి చెందిన భూములను నగదు రూపంలో డిపాజిట్ దారులకు చెల్లించాలన్నారు. సమావేశంలో డిపాజిట్‌దారులు పాల్గొన్నారు.
బాలబాలాజీకి
రూ.3.36 లక్షల ఆదాయం
మామిడికుదురు: అప్పనపల్లి బాలబాలాజీ స్వామి ఆలయానికి శనివారం భారీగా భక్తులు తరలి వచ్చారు. తెల్లవారు జామున సుప్రభాత సేవ, తొలి హారతితో దర్శనాలు ప్రారంభమయ్యాయి. పవిత్ర వైనతేయ గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, స్వామి వారికి తలనీలాలు, ముడుపులు, మొక్కుబడులు చెల్లించారు. వివిధ సేవల ద్వారా రూ.3,36,594 ఆదాయం వచ్చింది. స్వామి వారిని 5 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. 3 వేల మంది అన్న ప్రసాదం స్వీకరించారు. లడ్డూ ప్రసాదం విక్రయం ద్వారా రూ.65,670 ఆదాయం వచ్చిందని ఈఓ ఎం.సత్యనారాయణరాజు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment