ప్రజాభ్యుదయమే పరమావధి
● ప్రజా సమస్యల పరిష్కారంపై
నిరంతర పోరాటం
● జిల్లాలో ఘనంగా వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవం
● కేక్ కట్ చేసి, జెండా
ఆవిష్కరించిన నేతలు
సాక్షి, రాజమహేంద్రవరం: ప్రజాభ్యుదయమే పరమావధిగా, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా, సవాళ్లను సోపానాలుగా మలచుకుని ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూ.. మహానేత వైఎస్సార్ ఆశయ సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతున్న పార్టీ వైఎస్సార్ సీపీ అని పార్టీ నేతలు అన్నారు. రాజకీయాల్లో నైతిక విలువలను చాటి చెప్పిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ అంటూ ప్రజలకు భరోసా ఇస్తూ ముందుకు వెళుతున్నారని కొనియాడారు. జగన్ చెప్పారంటే.. చేస్తారంతే.. అంటూ ప్రజల్లో నమ్మకం, విశ్వాసం గడించిన పార్టీగా వైఎస్సార్ సీపీ చరిత్ర సృష్టించిందని గుర్తు చేశారు. వైఎస్సార్ సీపీ 15వ ఆవిర్భావ దినోత్సవం జిల్లావ్యాప్తంగా బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు కేక్‌లు కట్ చేసి, పార్టీ జెండాలు ఆవిష్కరించారు.
రాజమండ్రి రూరల్
వైఎస్సార్ సీపీ రాజమహేంద్రవరం రూరల్ కార్యాలయంలో మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యాన పార్టీ జెండా ఆవిష్కరించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ప్రజా శ్రేయస్సు, సమస్యల పరిష్కారానికి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న పోరాటాలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ ఇన్‌చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, చందన నాగేశ్వర్, గిరిజాల బాబు తదితరులు పాల్గొన్నారు.
రాజమండ్రి సిటీ
ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ పిలుపునిచ్చారు. మార్గాని ఎస్టేట్‌లోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, రాష్ట్ర బీసీ నాయకుడు మార్గాని నాగేశ్వరరావు, నాయకులు అడపా శ్రీహరి, నక్కా శ్రీనగేష్, పోలు విజయలక్ష్మి, వాసంశెట్టి గంగాధరరావు, దాసి వెంకట్రావు, బిల్డర్ చిన్న, కానుబోయిన సాగర్, మార్తి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
అనపర్తి
రాష్ట్రంలో భవిష్యత్తులో ఏ ఎన్నిక జరిగినా వైఎస్సార్ సీపీదే ఘన విజయమని అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి అన్నారు. అనపర్తిలో వైఎస్సార్ సీపీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎర్ర కాలువ వంతెన వద్ద దివంగత మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కాంస్య విగ్రహానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. పార్టీ జెండా ఎగురవేశారు. అందరికీ స్వీట్లు పంచారు.
కొవ్వూరు
కొవ్వూరులోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ఆధ్వర్యాన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. తలారి, పార్టీ శ్రేణులు పార్టీ జెండాను ఆవిష్కరించారు. కేక్ కేట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.
గోపాలపురం
దేవరపల్లి మండలం యర్నగూడెంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద మాజీ మంత్రి, పార్టీ గోపాలపురం నియోజకవర్గ ఇన్‌చార్జి తానేటి వనిత ఆధ్వర్యాన ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండా ఆవిష్కరించారు. కేక్ కట్ చేశారు. వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు.
నిడదవోలు
నిడదవోలు పట్టణంలోని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పార్టీ పట్టణ కార్యదర్శి గాజుల రంగారావు, మున్సిపల్ వైస్ చైర్మన్ వెలగడ బాలరాజు, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రజాభ్యుదయమే పరమావధి
Comments
Please login to add a commentAdd a comment