మార్గదర్శకాలు పాటించాలి
రాజమహేంద్రవరం రూరల్: స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమం మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ పి.ప్రశాంతి శుక్రవారం ఒక ప్రకటనలో అధికారులను ఆదేశించారు. ‘ఒకసారి వాడిన ప్లాస్టిక్‌ను నివారించండి.. పునర్వినియోగాన్ని ప్రోత్సహించండి’ అనే నినాదంతో శనివారం ఈ కార్యక్రమం నిర్వహించాలన్నారు. నగరపాలక సంస్థ, గ్రామ పంచాయతీల ఆధ్వర్యాన పారిశుధ్యంతో పాటు సింగిల్ ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టడంపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలు చేపట్టిన అనంతరం జిల్లా పరిషత్ సమావేశానికి హాజరు కావాలని జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి అధికారులను ఆదేశించారు. ఆయా శాఖలు, మతపరమైన సంస్థల ప్రతినిధుల ఆధ్వర్యాన స్వచ్ఛతా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.