
హోరాహోరీగా ఎడ్ల పట్టు
కడియం: మండలంలోని మురమండ శివార్లలోని శ్రీ నందన్నబాబు ఆలయం వద్ద ఆదివారం ఉగాది పండగను పురస్కరించుకుని ఎడ్ల పట్టు ప్రదర్శన హోరాహోరీగా జరిగింది. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 16 జతల ఎడ్లు ఈ పోటీల్లో తలపడ్డాయి. రాజానగరం మండలం చక్రద్వారబంధానికి చెందిన ముంగర నాగేశ్వరరావుకు చెందిన ఎడ్ల జత 21.13 సెకన్లలో నిర్ణీత దూరం చేరుకుని విజేతగా నిలిచింది. ఆలాగే ఆలమూరు మండలం మూలస్థానానికి చెందిన మురమళ్ల రాంబాబు ఎడ్లజత 21.72 సెకన్లలో చేరి ద్వితీయ స్థానాన్ని, కడియం మండలం మురమండ గ్రామానికి చెందిన మిద్దే సురేష్‌కు చెందిన ఎడ్ల జత 22.60 సెకన్లలో నిర్ణీత దూరం చేరుకుని మూడో స్థానాన్ని దక్కించుకున్నాయి. పోటీలకు ముందు నందన్నబాబుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పోటీలను ప్రారంభించారు. టీడీపీ నాయకుడు డాక్టర్ గోరంట్ల రవిరామ్‌కిరణ్ తదితరులు పోటీలను తిలకించారు. ఆలయ నిర్వాహకులు మొగలపు చిన్న ఆధ్వర్యంలో యేటా ఉగాది రోజున ఎడ్ల పట్టు ప్రదర్శ నిర్వహిస్తున్నారు. అదే విధంగా ఈ యేడాది కూడా ఏర్పాటు చేశారు. అలాగే దాతల సహకారంతో అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఈ పోటీలను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. కడియం పోలీసుల ఆధ్వర్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.
జిల్లా వ్యాప్తంగా 16 జట్లు పోటీ విజేతగా నిలిచిన చక్రద్వారబంధం ఎడ్లు తరువాతి స్థానాలను దక్కించుకున్న
మూలస్థానం, మురమండ ఎడ్లు