వేర్వేరు చోట్ల కేసులు నమోదు
పిఠాపురం: మండలంలో ఆదివారం జూదాలు ఆడుతున్న 8 మందిని అరెస్టు చేసినట్లు ఎస్సై ఎన్.రామకృష్ణ తెలిపారు. ఆయన కధనం ప్రకారం మండలం ఏకే మల్లవరంలో పేకాట ఆడుతున్న వారిపై దాడిచేసి నలుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి రూ.7130 స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. గొల్లప్రోలు శివారు రైల్వే ట్రాక్ వద్ద కొంతమంది కోడిపందాలు ఆడుతున్నారన్న సమాచారంతో అక్కడికి వెళ్లి ఇద్దరిని అదుపులోకి తీసుకుని ఒక కోడిపుంజును, రెండు కత్తులను, వారి వద్ద నుంచి రూ.1060 స్వాధీనం చేసుకున్నారు. అలాగే చేబ్రోలు శివారులో కొందరు కోడి పందాలు ఆడుతున్నారన్న సమాచారంతో అక్కడ మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని, ఒక కోడిపుంజును, రెండు కత్తులతో పాటు, రూ.6940ల నగదును స్వాధీనం చేసుకుని వారందరిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఆరికిరేవుల, బంగారమ్మపేటల్లో..
కొవ్వూరు: ఆరికిరేవుల, బంగారమ్మపేటలో కోడిపందేలు ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను పట్టణ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. ఆరికిరేవులలో నలుగురిని అదుపులోకి తీసుకుని రూ.600 నగదు, ఒక కోడి, ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నారు. బంగారమ్మపేటలో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని సీఐ పి.విశ్వం తెలిపారు. వీరి నుంచి రూ.1,760 నగదు, కోడి, కోడి కత్తి స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు.నిందితులను అరెస్ట్ చేసినట్టు ఆయన తెలిపారు.
అప్పుల బాధతో గోదావరిలో దూకిన వ్యక్తి
అల్లవరం: అమలాపురం ఎర్రవంతెన హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన చోడపనీడి వెంకటేశ్వరరావు (62) అప్పుల బాధ తాళలేక ఆదివారం బోడసకుర్రు బ్రిడ్జిపై నుంచి వైనతేయ నదిలోకి దూకేశాడు. అమలాపురం నుంచి ఏపీ 16 డీఓ 222 నెంబర్ స్విఫ్ట్ కారుతో వచ్చి బోడసకుర్రు బ్రిడ్జిపై పార్కు చేసి ఆదివారం సాయంత్రం 7.30 సమయంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బ్రిడ్జిపై నుంచి వ్యక్తి దూకడాన్ని గుర్తించిన ప్రయాణిలకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై తిరుమలరావు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. వెంకటేశ్వరరావు అప్పుల బాధలు భరించలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని ప్రాథమిక విచారణలో పోలీసులు తెలిపారు. కుమారుడు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర కార్యదర్శిగా శ్రీదేవి
రాయవరం: బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర కార్యదర్శిగా రాయవరం మండలం వెదురుపాకకు చెందిన ఎం.శ్రీదేవి నియమితులయ్యారు. ఈ విషయాన్ని శ్రీదేవి ఆదివారం విలేకరులకు తెలిపారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోనూరు సతీష్‌శర్మ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్‌కె మనోహరరావు ఈ మేరకు నియామకం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారన్నారు.

బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర కార్యదర్శిగా శ్రీదేవి