
ఉపాధి కూలీల కనీస వేతనం స్వల్పంగా పెంపు
నల్లజర్ల: ఉపాధి హామీ పథకం కూలీలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రోజువారీ కనీస వేతనం రూ.307 చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో రోజువారీ కనీస వేతనం రూ.300 ఉండగా ఈ ఏడాది స్వల్పంగా రూ.7 మాత్రమే పెంచారు. పెంపు ఉత్తర్వులు మంగళవారం నుంచే అమలులోకి రానున్నాయని ఉపాధి హామీ పథకం ఏపీఓ వెంకట్రావు తెలిపారు. ఫీల్డ్ అసిస్టెంట్లు, మేస్త్రులు కేటాయించిన కొలతలతో పనులు పూర్తి చేస్తే కూలీలకు ప్రభుత్వం ప్రకటించిన గరిష్ట ఽవేతనం అందనున్నది. గత ఐదేళ్లతో పోల్చితే ఈ ఏడాది పెంపు తక్కువేనని కూలీలు చెబుతున్నారు. 2020–21లో రూ.230 చెల్లించేవారు. 2022లో రూ.15 పెంచారు. 2023లో రూ.12, 2024లో రూ15, 2025లో రూ.28 చొప్పున పెంచారు. అటువంటిది ఈ ఏడాది రూ.7 మాత్రమే పెంచడంపై కూలీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో ప్రస్తుతం రైతువారీ పనులు లేవు. ఉన్న పనులన్నీ యంత్రాలతో చేయిస్తున్నారు. గ్రామీణ కూలీల జీవనోపాధికి ఉపాధి హామీ పనులే ఆధారం. కుటుంబ పోషణ కోసం మండుటెండలో సైతం చెమట చుక్కలు చిందిస్తూ పని చేస్తున్న తమ వేతనాలను మరింతగా పెంచాలని వేతనదారులు కోరుతున్నారు.