కొండెక్కుతున్న కోడిమాంసం ధరలు | - | Sakshi
Sakshi News home page

కొండెక్కుతున్న కోడిమాంసం ధరలు

Apr 2 2025 12:07 AM | Updated on Apr 2 2025 12:07 AM

కొండె

కొండెక్కుతున్న కోడిమాంసం ధరలు

సాక్షి, అమలాపురం: బర్డ్‌ ఫ్లూతో విలవిలలాడిన కోడి కోలుకుంటోంది. సంక్రాంతి తరువాత మొదలైన పౌల్ట్రీ రైతుల కష్టాలు.. ఇంచుమించు తెలుగు సంవత్సరాది వరకు కొనసాగాయి. గత వారం రోజుల నుంచి కోడి ధర క్రమేపీ పెరుగుతూ ఇప్పుడు కొండెక్కింది. బర్డ్‌ ఫ్లూ దెబ్బకు కోళ్ల పెంపకాన్ని రైతులు తగ్గించి వేయడంతో... డిమాండ్‌లో సగం కూడా కోళ్లు మార్కెట్‌కు రాకపోవడంతో వాటి ధర అంచనాలకు మించి పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు.

పౌల్ట్రీలపై బర్డ్‌ ఫ్లూ ఎఫెక్ట్‌

తూర్పు గోదావరి జిల్లాలో 2.50 కోట్ల వరకు గుడ్లు పెట్టే కోళ్లు, నాలుగు లక్షల వరకు బ్రాయిలర్‌ కోళ్ల పెంపకం జరుగుతోంది. ఈ జిల్లాలో ప్రతి రోజూ 80 లక్షల కోడిగుడ్ల ఉత్పత్తి అవుతుండగా 48 లక్షల గుడ్లు ఒడిశా, బిహార్‌, కోల్‌కతాలకు ఎగుమతవుతున్నాయి. కాకినాడ జిల్లాలో ఐదు లక్షల లేయర్‌ కోళ్లు పెరుగుతున్నాయి. లక్షకు పైగా నాటు కోళ్ల పెంపకం జరుగుతోంది. మరో మూడు లక్షల వరకు బ్రాయిలర్‌ కోళ్ల పెంపకం సాగుతోందని అంచనా. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ జిల్లాలో 18 కమర్షియల్‌ పౌల్ట్రీ ఫామ్‌లు ఉండగా వీటిలో సుమారు 57 లక్షలకు పైగా కోళ్లు ఉన్నాయని పశు సంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. వీటిలో 5 లక్షల వరకు బ్రాయిలర్‌ ఫామ్‌లు కాగా, మిగిలిన లేయర్‌ (కోడి గుడ్డు పెట్టే) కోళ్లు. మూడు జిల్లాల్లో రోజుకు 100 టన్నుల వరకు కోడి మాంసం విక్రయాలు చేసేవారు. అదే ఆదివారం, ఇతర పండగల సమయంలో 150 టన్నుల వరకు విక్రయాలు ఉంటాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.

గత ఫిబ్రవరిలో తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలం కానూరి అగ్రహారంలో లక్షలాది కోళ్లు మృతి చెందడంతో ఆ ప్రభావం మూడు జిల్లాల పౌల్ట్రీలపై పడింది. బర్డ్‌ ఫ్లూకు ముందు కిలో చికెన్‌ ధర రూ.240 నుంచి రూ.260 వరకూ ఉండేది. బర్డ్‌ ఫ్లూ భయంతో నాలుగైదు రోజులలో అది కాస్తా కేజీ రూ.150కి పడిపోయింది. తరువాత కేజీ రూ.120కి చేరింది. ధర తగ్గడం అటుంచి వారం రోజుల పాటు ప్రభుత్వ అధికారులే కోడి మాంసం విక్రయాలను అడ్డుకున్నారు. తరువాత అమ్మకాలకు అనుమతి ఇచ్చినా నెల రోజుల పాటు చికెన్‌ అమ్మకాలు మూడు జిల్లాలలో దాదాపు నిలిచిపోయాయి. కేవలం మాంసం, చేపలు, రొయ్యల అమ్మకాలు మాత్రమే సాగాయి. పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాల్లోనూ, రెస్టారెంట్‌లు ఇలా ప్రతిచోటా చికెన్‌ తప్ప మిగిలిన మాంసాహారాలు మాత్రమే అందుబాటులో ఉండేవి. సంక్రాంతి నుంచి పౌల్ట్రీ పరిశ్రమ కోలుకుంటున్న సమయంలో బర్డ్‌ ఫ్లూ చావు దెబ్బతీసింది. జిల్లా సరిహద్దును ఆనుకుని తూర్పు గోదావరి జిల్లాలో మొదలైన బర్డ్‌ ఫ్లూ వైరస్‌ దెబ్బ కోనసీమ జిల్లా పౌల్ట్రీని కుదేలు చేసింది. ఈ జిల్లాలో వైరస్‌ జాడ లేకున్నా అమ్మకాలపై ప్రభావం చూపుతోంది. కోడి మాంసం, కోడి గుడ్డు అమ్మకాలను అధికారులు నిషేధించడంతో ధర పడిపోయి రైతులు.. అమ్మకాలు లేక వ్యాపారులు ఆందోళన చెందారు.

ధర పెరిగినా రైతుకు

ఒరిగిందేమీ లేదు

పౌల్ట్రీ వ్యాపారంలో గత మూడు నెలల నుంచి తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం. బర్డ్‌ ప్లూ వైరస్‌ వదంతులతో పెంచిన కోళ్లను ఇంకా మేపలేక దశల వారీగా విక్రయించుకుని తీవ్రమైన నష్టాలను చవిచూశాం. ఇటీవల ఉగాది, రంజాన్‌ సందర్భంగా బాయిలర్‌ ధరల పెరిగినా రైతులకు ఒరిగిందేమీ లేదు. ప్రస్తుతం బాయిలర్‌ కోళ్లు రైతుల వద్ద లేకపోవడంతో కంపెనీల నుంచి దిగుమతి చేసుకోవడంతో ఆ లాభాలు వాళ్లకే వెళ్లిపోతున్నాయి. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పెరిగిన ధర నిలకడగా ఉండే అవకాశం కూడా లేదు.

– బొబ్బా వెంకన్న, పౌల్ట్రీ రైతు,పెదపళ్ల,

ఆలమూరు మండలం, కోనసీమ జిల్లా

బర్డ్‌ఫ్లూ నుంచి కోలుకుంటున్న కోడి

భారీగా పెరిగిన బ్రాయిలర్‌..

లేయర్‌ కోడి ధరలు

బ్రాయిలర్‌ రైతు వద్ద కేజీ

రూ.152, రిటైల్‌ రూ.175

లేయర్‌ లైవ్‌ రైతు వద్ద కేజీ రూ.125

బ్రాయిలర్‌ మాంసం కేజీ రూ.300.. లేయర్‌ మాంసం కేజీ రూ.200

డిమాండ్‌లో మూడు వంతులు మాత్రమే మార్కెట్‌కు

బర్డ్‌ ఫ్లూతో ఇంచుమించు నెలన్నర రోజులు అతలాకుతలమైన పౌల్ట్రీ పరిశ్రమ పది రోజులుగా కోలుకుంటోంది. కోడి మాంసం ధరలు క్రమేపీ పెరుగుతున్నాయి. బ్రాయిలర్‌ లైవ్‌ రైతు వారీ కేజీ ధర రూ.152 వరకు ఉండగా షాపుల వద్ద లైవ్‌ రిటైల్‌ ధర కేజీ రూ.175 నుంచి రూ.180 వరకు ఉంది. కేజీ మాంసం ధర రూ.300కు పైబడి ఉంది. ఇక లేయర్‌ రిటైల్‌ ధర కేజీ రూ.125 నుంచి రూ.130 వరకు ఉండగా, మాంసం ధర కేజీ రూ.200 వరకు ఉంది. ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితి చూస్తే బ్రాయిలర్‌, లేయర్‌ మాంసం ధరలు మరింత పెరిగే అవకాశముందని రైతులు, వ్యాపారులు అంచనా వేస్తున్నారు. బర్డ్‌ఫ్లూ ప్రచారం వల్ల బ్రాయిలర్‌ ఫిబ్రవరి 15 నుంచి మార్చి మొదటి వారం వరకు కొత్త బ్యాచ్‌లు (కోళ్లు పెంచడాన్ని) తగ్గించారు. దీనివల్ల మార్కెట్‌కు డిమాండ్‌కు తగిన కోళ్లు రావడం లేదు. ఇప్పుడున్న అవసరాలలో మూడవ వంతు కూడా కోళ్ల లభ్యత లేదని అమలాపురానికి చెందిన కోడి మాంసం విక్రయదారుడు యేసు సాక్షికి తెలిపాడు. ఈ కారణంగానే కోడి మాంసం ధరలకు రెక్కలు వచ్చాయి.

కొండెక్కుతున్న కోడిమాంసం ధరలు1
1/1

కొండెక్కుతున్న కోడిమాంసం ధరలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement