
క్రైస్తవులకు రక్షణ కల్పించాలి
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): క్రైస్తవులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యాన అన్ని క్రైస్తవ సంఘాలతో రాజమహేంద్రవరంలో మంగళవారం శాంతి ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఏవీ అప్పారావు రోడ్డులోని నెతన్య చర్చి వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ ఏవీ అప్పారావు రోడ్డు, గోరక్షణ పేట, జాంపేట, దేవీచౌక్ మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయం వరకూ సాగింది. అనంతరం పాస్టర్ ఫెలోషిప్ నాయకులు ఆర్‌డీఓ కృష్ణనాయక్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఫెలోషిప్ నాయకులు బిషప్ కె.ప్రతాప్ సిన్హా, రెవరెండ్ కె.సుధీర్ కుమార్, రెవరెండ్ జుహాని హలోనిన్, రెవరెండ్ పి.విక్టర్, రెవరెండ్ ఎన్‌ఎస్‌సి ప్రసాద్ తదితరులు మాట్లాడుతూ, ప్రస్తుతం క్రైస్తవులపై దాడులు పెరిగాయని అన్నారు. క్రైస్తవ సంఘాల్లోకి వచ్చి దుర్భాషలాడుతూ, చర్చిలను కూల్చివేస్తామంటూ బెదిరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రముఖ క్రైస్తవ నాయకుడు, దైవజనులు ప్రవీణ్ కుమార్ పగడాల మృతిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆయన మరణంపై క్రైస్తవ సమాజానికి ఉన్న అనుమానాలను నివృత్తి చేసి, మృతికి నిజమైన కారణాలపై స్పష్టత ఇవ్వాలని పోలీస్ శాఖను, ప్రభుత్వాన్ని కోరారు. ప్రవీణ్ పగడాల మృతిపై సామాజిక మాధ్యమాలు, టీవీ చానళ్లలో జరుగుతున్న అసత్య ప్రచారాలను అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రవీణ్‌పై నిరాధార ఆరోపణలు చేసి, ఆయన వ్యక్తిత్వంపై దాడి చేస్తూ, కించపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనను, ఆయన కుటుంబాన్ని అభిమానించే మొత్తం క్రైస్తవ సమాజాన్ని మానసిక వేదనకు గురి చేయడం బాధాకరమని అన్నారు. మీడియా ద్వారా విషప్రచారం చేస్తున్న వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పదేపదే క్రైస్తవులను, క్రైస్తవ మత విశ్వాసాలను, ఏసుక్రీస్తును అసభ్య పదజాలంతో, కించపరిచే మాటలతో, బూతులతో దూషిస్తూ, చాలా కాలం నుంచి సోషల్ మీడియాలో యథేచ్ఛగా పోస్టులు పెడుతూ, తమ మనోభావాలను దెబ్బ తీస్తున్న రాధామనోహర్‌దాస్, లలిత్ కుమార్, హమారా ప్రసాద్ తదితరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. మత విద్వేషాలను రెచ్చగొట్టి, కవ్వింపు చర్యలు జరగకుండా కట్టడి చేయాలని విజ్ఞప్తి చేశారు. శాంతి ర్యాలీలో డాక్టర్ మోజేష్‌బాబు, రెవరెండ్ ఎం.విజయ సారథి, డాక్టర్ జి.జాన్ ప్రసాద్, ఎర్నెస్ట్ మోజెస్ తదితరులు పాల్గొన్నారు.
ఫ దాడులు అరికట్టాలి
ఫ క్రైస్తవ సంఘాల శాంతి ర్యాలీ
ఫ పాస్టర్ ప్రవీణ్ మృతికి కారకులైన
వారిని శిక్షించాలని డిమాండ్

క్రైస్తవులకు రక్షణ కల్పించాలి