
157 నీటితొట్టెల నిర్మాణం
పెరవలి: వేసవిలో పశువుల దాహార్తిని తీర్చేందుకు జిల్లాలోని 15 మండలాల్లో 157 నీటితొట్టెలు నిర్మించనున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. పెరవలి మండలం ముక్కామలలో నీటితొట్టెల నిర్మాణానికి మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, ఈ నీటితొట్టెలను ఆయా పంచాయతీలు నిర్వహిస్తాయని చెప్పారు. కలెక్టర్ పి.ప్రశాంతి మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకం కింద జిల్లావ్యాప్తంగా 157 గ్రామాల్లో నీటితొట్టెల నిర్మాణానికి రూ.50.24 లక్షలు కేటాయించామని తెలిపారు. ఈ పనులు ఏప్రిల్ 10 నాటికి పూర్తి చేస్తామన్నారు. పెరవలి మండలంలో 18, చాగల్లు 10, దేవరపల్లి 10, గోపాలపురం 4, కొవ్వూరు 8, నల్లజర్ల 5, రాజానగరం 44, రంగంపేట 15, తాళ్లపూడి 5, నిడదవోలు 23, ఉండ్రాజవరంలో 15 చొప్పున నీటితొట్టెలు నిర్మిస్తామని వివరించారు. కార్యక్రమంలో డ్వామా పీడీ ఎం.నాగమల్లేశ్వరరావు, డీఆర్‌డీఏ పీడీ ఎన్‌వీవీఎస్ మూర్తి, ఎంపీడీఓ సీహెచ్ వెంకటరమణ, తహసీల్దార్ డి.అచ్యుత కుమారి, పశువైద్యాధికారి చరణ్ తదితరులు పాల్గొన్నారు.
2.35 లక్షల మందికి పింఛన్లు
పెరవలి: జిల్లావ్యాప్తంగా ప్రతి నెలా 2,35,076 మందికి రూ.102.28 కోట్ల మేర ఎన్‌టీఆర్ సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. పెరవలి మండలం ముక్కామలలో ఆయన, కలెక్టర్ పి.ప్రశాంతి మంగళవారం పింఛన్లు పంపిణీ చేశారు. గ్రామంలో ఇద్దరికి కొత్తగా మంజూరైన పింఛన్లను అందజేశారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ ఎన్‌వీవీఎస్ మూర్తి, ఎంపీడీఓ సీహెచ్ వెంకట రమణ, తహసీల్దార్ డి.అచ్యుత కుమారి తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన ‘పది’ పరీక్షలు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మంగళవారంతో ప్రశాంతంగా ముగిశాయి. మార్చి నెల 17వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ పరీక్షలను జిల్లా వ్యాప్తంగా 134 కేంద్రాల్లో నిర్వహించారు. చివరి రోజు సోషల్ పరీక్ష జరిగింది. దీనికి 23,846 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా, 23,440 మంది రాశారు. డీఈవో మూడు పరీక్షా కేంద్రాలను, తనిఖీ అధికారులు 42 పరీక్షా కేంద్రాలను పరిశీలించారు.

157 నీటితొట్టెల నిర్మాణం