మహాప్రభో.. మా కులమేదో చెప్పండి! | - | Sakshi
Sakshi News home page

మహాప్రభో.. మా కులమేదో చెప్పండి!

Apr 2 2025 12:07 AM | Updated on Apr 2 2025 12:07 AM

మహాప్

మహాప్రభో.. మా కులమేదో చెప్పండి!

పెరవలి: ఊరూరా తిరుగుతూ.. బుర్ర కథలు చెబుతూ.. పగటి వేషాలు వేస్తూ.. ప్రజలకు వినోదాన్ని పంచుతూ.. చైతన్యాన్ని నింపే సంచార జీవులు బేడ బుడగ జంగాలవారు. దేవుని భక్తిని, దేశభక్తిని నింపుతూ.. చారిత్రక గాథలను పాటలుగా ఆలపిస్తూ.. కథలుగా చెబుతూ జీవనం సాగించేవారు. కొంత మంది వ్యవసాయం, కూలి పనులు చేసుకుంటే జీవించేవారు. కాలం సమాజంలో ఎన్నో మార్పులు తెచ్చింది. వీరి జీవితంలో కూడా మార్పులు వచ్చాయి. కొంత మంది ఇప్పటికీ కుల వృత్తిని కొనసాగిస్తూండగా.. మరి కొంత మంది జీవితంలో ఓ మెట్టు పైకెక్కాలనే ఆకాంక్షతో ఉన్నత చదువులు చదువుకున్నారు.. చదువుకుంటున్నారు. అయితే, కొన్నేళ్లుగా వీరి కులమేమిటో ప్రభుత్వం ధ్రువీకరించకపోవడంతో ఇటు ప్రభుత్వ పథకాలు, అటు ఉద్యోగాల వంటి వాటికి దూరమవుతున్నారు. ప్రభుత్వం చిన్నచూపు చూస్తూండటంతో తాము ఎంతో నష్టపోతున్నామని ఆవేదన చెందుతున్నారు.

ఏం జరిగిందంటే..

రాజ్యాంగం 341 షెడ్యూలు, 1950లో రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం బేడ బుడగ జంగాల వారిని షెడ్యూల్డ్‌ కులానికి చెందిన వారిగా పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రకారం ఎస్సీ కేటగిరీలో 59 కులాలు ఉండగా.. అందులో తొమ్మిదో కులంగా బుడగ జంగాలు ఉన్నారు. అప్పటి నుంచి వారు ఎస్సీలుగానే కొనసాగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2008లో కొంత మంది తెలంగాణ నాయకులు ఆంధ్ర ప్రాంతంలో బుడగ జంగాలు లేరని చెప్పి, జీఓ 144 తీసుకువచ్చారు. దీని ఫలితంగా మన రాష్ట్రంలో వీరికి ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాల జారీని నిలిపివేశారు. దీంతో వీరు కేవలం ఓటర్లుగానే ఉన్నారు తప్ప, కుల ధ్రువీకరణ లేక ప్రభుత్వ పరంగా అందాల్సిన పథకాలు, సబ్సిడీ రుణాలు, ఇతర సౌకర్యాలకు దూరమయ్యారు. వ్యాపారం చేద్దామంటే బ్యాంకులు అప్పులు ఇవ్వని దుస్థితి. గత్యంతరం లేక రెక్కల కష్టం పైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. తమ బతుకుల్ని చిందరవందర చేసిన 144 జీఓను రద్దు చేయాలని పదహారేళ్లుగా బుడగ జంగాలు డిమాండ్‌ చేస్తూనే ఉన్నారు.

జిల్లాలో 5 వేల మందికి ఇక్కట్లు

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4 లక్షల మంది బుడగ జంగాల వారు ఉండగా.. జిల్లాలో వీరి జనాభా సుమారు 5 వేలు. వీరిలో చదువుకున్న వారు సుమారు 2 వేల మంది ఉన్నారు. డిగ్రీ చదివి, కేవలం కుల ధ్రువీకరణ లేక.. ఉద్యోగాలు పొందలేక అనేక మంది నానా ఇబ్బందులు పడుతున్నారు. గత్యంతరం లేక దువ్వెనలు, పిన్నీసులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. మండల కేంద్రమైన పెరవలిలో సుమారు 500 మంది బుడగ జంగాల వారున్నారు. గతంలో ఎస్సీ గుర్తింపు ఉన్న సమయంలో పిల్లలను హాస్టళ్లలో వేసి చదువు చెప్పించేవారు. 144 జీఓ వచ్చిన తరువాత హాస్టల్‌ సదుపాయాన్ని కోల్పోయారు. అంతే కాదు.. చదువులు, ఇతరత్రా పథకాలకు ప్రభుత్వ సహాయం లభించని దుస్థితి. ఫలితంగా బుడగజంగాల్లో చదువుకున్న పిల్లలకు సైతం ఉద్యోగాలు దూరమయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తే బుడగ జంగాలకు బీసీ ధ్రువీకరణ పత్రం ఇస్తామంటున్నారని, అది కూడా మాటలే తప్ప అధికారకంగా ఏమీ లేదని వారు వాపోతున్నారు. తమకు అన్నివిధాలా నష్టదాయకంగా మారిన జీఓ 144ను వెంటనే రద్దు చేసి, బంగారు భవిష్యత్తును అందుకునే అవకాశాన్ని తమ పిల్లలకు కల్పించాలని కనపడిన నాయకులను, అధికారులను వారు వేడుకుంటూనే ఉన్నారు.

గాల్లో కలిసిన చంద్రన్న హామీలు

జీఓ రద్దు కోసం పదహారేళ్లుగా బుడగ జంగాల వారు అనేక రూపాల్లో ఉద్యమించారు. 2014 ఎన్నికల సమయంలో పాదయాత్ర చేస్తున్న ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెరవలి మండలంలో తీపర్రులో సభ నిర్వహించారు. తాను అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో బుడగ జంగాలను ఎస్సీలుగా మారుస్తానని ఆ సందర్భంగా హామీ ఇచ్చారు. ఆయన అధికార పగ్గాలు చేపట్టారు కానీ, ఇచ్చిన హామీ మాత్రం నెరవేర్చలేదు. 2018 మార్చి 20న బుడగ జంగాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యలమర్తి మధు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. అప్పట్లో టీడీపీ మంత్రుల బృందం వచ్చి మధు దీక్షను విరమింపజేశారు. ప్రభుత్వం జేసీ శర్మ కమిటీ వేసిందని, 3 నెలల్లో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీకి కూడా నేటికీ అతీగతీ లేదు. ఇదిలా ఉండగా ఎస్సీ వర్గీకరణపై 2024 ఆగస్టులో ఇచ్చిన తీర్పు ప్రకారం బుడగ జంగాలను ఎస్సీల్లో 9వ కులంగా, కేటగిరీ–1ఎగా గుర్తించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు కూడా ఇచ్చింది. ఇది కూడా ఇప్పటి వరకూ అమలుకు నోచుకోలేదు. బుడగ జంగాలను ఎస్సీ కేటగిరీ–1ఎలో చేరుస్తూ తాజాగా రాష్ల్ర అసెంబ్లీ మరోసారి తీర్మానం చేసింది. దీనిని కేంద్రానికి పంపించాలని నిర్ణయించింది. అయితే, గతంలో కూడా ఇదేవిధంగా తీర్మానాలు చేసి, పంపించినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈసారి ఏం జరుగుతుందోనని బుడగ జంగాల వారు ఎదురు చూస్తున్నారు.

వైఎస్సార్‌ సీపీ హయాంలో..

కుల ధ్రువీకరణకు దూరమై, దైన్యంగా జీవితాలు గడుపుతున్న బుడగ జంగాల వారి ఇబ్బందులను గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం గుర్తించింది. ఎస్సీల్లో చేర్చాలంటూ చేసిన తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించేంత వరకూ ఈ వర్గం వారు నష్టపోకూడదని భావించింది. ఈ మేరకు వీరికి ఎటువంటి కుల ధ్రువీకరణ పత్రం లేకుండానే, సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ద్వారా ప్రభుత్వ పథకాలు అందించింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత వారికి ఈ సౌకర్యం దూరమైంది.

ఫ 16 ఏళ్లుగా కుల ధ్రువీకరణకు

నోచుకోని బేడ బుడగ జంగాలు

ఫ 6 నెలల్లో ఎస్సీల్లో చేరుస్తామని

2013లో చంద్రబాబు హామీ

ఫ 3 నెలల్లో అని 2018లో

మరోసారి వాగ్దానం

ఫ కుల నిర్ధారణ లేక

అందని ప్రభుత్వ పథకాలు

పిల్లల బతుకులైనా బాగుండాలి

జీఓ 144ను రద్దు చేసి మా పిల్లలకు చదువుకునే అవకాశం కల్పించాలి. దీనికోసమే మా పోరాటం. మా బతుకులు ఎలాగూ తెల్లారిపోయాయి. మా పిల్లల బతుకులైనా బాగుండాలి.

– పస్తాల రాధాకృష్ణ, పెరవలి

మైక్రో బయాలజీ చదివినా..

నేను డిగ్రీలో మైక్రోబయాలజీ చదివాను. కానీ ఏమీ ఫలితం లేకుండా పోయింది. కుల ధ్రువీకరణ లేక.. ఉద్యోగం రాక.. బతకటానికి బోర్లు వేస్తున్నాను. కొత్తగా మాకు ఏమీ కల్పించవద్దు. 2008 వరకూ మాకున్న సౌకర్యాలు అలాగే ఇస్తే చాలు. 144 జీఓ రద్దు చేసి, మమ్మల్ని గతంలో మాదిరిగానే ఎస్సీలుగా కొనసాగించాలి.

– పేర్ల చిరంజీవి, పెరవలి

రేషన్‌ కార్డు కూడా ఇవ్వడం లేదు

కుల ధ్రువీకరణ లేక మాకు రేషన్‌ కార్డు కూడా ఇవ్వడం లేదు. అసలే పనుల్లేక ఊరూరా తిరుగుతూ పిన్నీసులు, రబ్బర్‌ బ్యాండ్లు అమ్మి బతుకుతున్నాం. ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం పొందలేకపోతున్నాం.

– పస్తం వెంకట దుర్గమ్మ, పెరవలి

అన్ని విధాలా నష్టం

జీఓ 144 వలన అన్ని విధాలా నష్టపోతున్నాం. చదువు, ఉద్యోగాల్లో అవకాశాలు కోల్పోతున్నాం. ప్రభుత్వాలు మా జీవితాలతో ఆడుకుంటున్నాయి. జీఓ 144 రద్దు కోసం ఎన్నో పోరాటాలు చేశాం. నాయకులు హామీలిచ్చారు కానీ అమలు చేయడం లేదు. అయినా పోరాడతాం. మా పిల్లల కోసం తప్పదు కదా! – పేర్ల నాగులు, జిల్లా ఉపాధ్యక్షుడు,

బేడ బుడగ జంగాల హక్కుల పోరాట సమితి, పెరవలి

మహాప్రభో.. మా కులమేదో చెప్పండి!1
1/5

మహాప్రభో.. మా కులమేదో చెప్పండి!

మహాప్రభో.. మా కులమేదో చెప్పండి!2
2/5

మహాప్రభో.. మా కులమేదో చెప్పండి!

మహాప్రభో.. మా కులమేదో చెప్పండి!3
3/5

మహాప్రభో.. మా కులమేదో చెప్పండి!

మహాప్రభో.. మా కులమేదో చెప్పండి!4
4/5

మహాప్రభో.. మా కులమేదో చెప్పండి!

మహాప్రభో.. మా కులమేదో చెప్పండి!5
5/5

మహాప్రభో.. మా కులమేదో చెప్పండి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement