‘పది’ పరీక్షల హాలులో సిమెంట్ బస్తాలు
అమలాపురం టౌన్: పదో తరగతి పరీక్షా కేంద్రంలోని ఒక గదిలో సిమెంటు బస్తాలు నిల్వ ఉంచడం.. విద్యార్థులు వచ్చిన తర్వాత వాటిని తొలగించడానికి చర్యలు చేపట్టడంపై వారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలివీ.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని నల్ల వంతెన వద్ద ఉన్న ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలోని రూమ్ నంబర్ ఏడులో 22 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాసేందుకు ఏర్పాట్లు చేశారు. బ్లాక్ బోర్డు, బెంచీలపై నంబర్లు కూడా రాశారు. ఇదిలా ఉండగా పలు పాఠశాలల్లో నిర్మాణ పనులకు అవసరమైన సిమెంటు బస్తాలను ఈ స్కూలును స్టాక్ పాయింట్‌గా ఉపయోగిస్తూ, ఇదే గదిలో నిల్వ ఉంచారు. సోమవారం ఉదయం నుంచి టెన్త్ పరీక్షలు మొదలవుతున్నాయని తెలిసి కూడా వీటిని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, పరీక్షల నిర్వహణాధికారులు అలాగే ఉంచేశారు. ముందు రోజో లేదా పరీక్షలు రాసేందుకు వచ్చేలోగానో ఆ బస్తాలను అక్కడి నుంచి తొలగించి ఉండాల్సింది. కానీ, పరీక్షలు రాసేందుకు విద్యార్థులు ఈ గదికి వచ్చేసరికి కూలీలతో సిమెంట్ బస్తాలను బయటకు తీసుకుని వస్తున్నారు. ఆ దృశ్యాలను చూసి, విద్యార్థుల తల్లిదండ్రులు అసహనానికి గురయ్యారు. పరీక్షల నిర్వహణపై ఇంత నిర్లక్ష్యమేమిటని ఆగ్రహించారు. పరీక్షలు రాసేందుకు వచ్చిన విద్యార్థులను తరగతి గది బయట నిలబెట్టి, సిమెంట్ బస్తాలు బయటకు తీసుకురావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విషయం తెలియడంతో జిల్లా విద్యా శాఖాధికారి షేక్ సలీమ్ బాషా వెంటనే ఈ పాఠశాలను సందర్శించారు. సిమెంట్ బస్తాలు పాడవకూడదనే ఉద్దేశంతోనే వాటిని ప్రధానోపాధ్యాయుడు తరగతి గదిలో ఓ మూల భద్రపరిచారని చెప్పారు. పరీక్ష ప్రారంభం కాకముందే సిమెంట్ బస్తాల తొలగింపు చేపట్టారని తెలిపారు.
విద్యార్థులను నిలిపి, బస్తాల తొలగింపు
నిర్లక్ష్యంపై తల్లిదండ్రుల ఆగ్రహం