సాక్షి, రాజమహేంద్రవరం: పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతిపై నిజాలు నిగ్గు తేల్చాలని మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్‌రామ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దళితులు, క్రైస్తవ సమాజానికి రక్షణ ఉందా? అని ప్రశ్నించారు. హోం మంత్రి వచ్చి ప్రజలకు భరోసా కల్పించాలా..? లేదా? అని ఆయన ప్రశ్నించారు. బుధవారం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి వద్ద భరత్ విలేకరులతో మాట్లాడారు. పాస్టర్ మరణంపై పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమవుతుంటే నిజాలు నిగ్గు తేల్చకపోవడం దారుణమన్నారు. ఘటన జరిగిన ప్రదేశానికి అసలు డాగ్ స్క్వాడ్‌ని పంపించారా? అని ప్రశ్నించారు. పక్కనే పెట్రోలు బంకు ఉన్నందున పూర్తిస్థాయి సీసీ ఫుటేజ్ ఎందుకు బయటకు తీయడం లేదని ప్రశ్నించారు. వెళ్లినప్పటి సీసీ ఫుటేజ్ చూపిస్తున్నారే తప్ప, ముందు ఏం జరిగిందో, తర్వాత ఏం జరిగిందో వంటి అంశాలను కూడా పూర్తిగా తెలియజేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
రాజకీయం చేసేందుకేముంది?
మానవతా దృక్పథంతో ఆలోచన చేయకుండా రాజకీయం చేస్తున్నారని విమర్శలు చేయడంలో అర్థం లేదని భరత్ వ్యాఖ్యానించారు. అలా అనేవారు ఇంట్లో ఇలాంటి పరిణామం జరిగితే ఇలాగే మాట్లాడతారా? అని ఆయన ప్రశ్నించారు. పాస్టర్ మరణం గురించి తెలుసుకుని వేలాదిమంది వచ్చారంటే ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో అర్థం చేసుకోవాలన్నారు. పోస్ట్‌మార్టం ఎందుకు జాప్యం చేశారో అర్థం కావడం లేదున్నారు. దళితులకు, క్రైస్తవ సమాజానికి కూటమి ప్రభుత్వం ఏ పాటి గౌరవం ఇస్తోందని ఆయన ప్రశ్నించారు. నల్లజర్ల మండలంలో అంబేడ్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేయడం చూస్తుంటే, అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోందని అన్నారు. నిన్నటికి నిన్న ఒక ఫార్మసీ విద్యార్థిని లైంగిక వేధింపులు తట్టుకోలేక సూసైడ్ నోట్ రాసి, ఆత్మహత్యా యత్నానికి పాల్పడిందని ఆయన గుర్తుచేశారు. ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత వెలుగులోకి వచ్చిందంటే అసలుప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఎఫ్‌ఐఆర్ ఎప్పుడు కట్టారని ప్రశ్నించారు. ఈ కేసులో అరెస్టు ఎందుకు చేయలేదని నిలదీశారు. ప్రాణహాని ఉన్నట్లు పాస్టర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినట్లు చెబుతున్నారని, పోలీసు యంత్రాంగం ఏం చర్యలు తీసుకుందని భరత్ ప్రశ్నించారు. ఈవీఎం ఎమ్మెల్యే వచ్చి, ఏంచేసినట్టని అన్నారు. ఈ ఘటనపై సీఐడీ విచారణ చేయిస్తామనడాన్ని భరత్ ఎద్దేవా చేశారు. ముందు పోస్ట్‌మార్టం రిపోర్టు బయట పెట్టాలని అన్నారు.
మాజీ ఎంపీ భరత్‌రామ్