రాజమహేంద్రవరం సిటీ: కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందని ఏపీ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్ పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం నగరంలోని బొల్లినేని కిమ్స్ హాస్పిటల్‌లో ఫార్మసీ విద్యార్థి అంజలికి జరిగిన అన్యాయం క్షమించరాని విషయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిని డాక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫార్మసీ విద్యార్థినికి జరిగిన అన్యాయం రెండు మూడు రోజుల తర్వాత వెలుగులోకి రావడం చాలా బాధాకరమైన విషయమన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ఇలాంటి విచారకరమైన ఘటనలు చాలా జరుగుతున్నాయన్నారు. అంజలికి జరిగిన అన్యాయాన్ని మాజీ సీఎం జగనన్న దృష్టికి తీసుకుని వెళ్తానన్నారు. ఆమెకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందన్నారు. ఈ ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈమె వెంట పార్టీ నాయకులు బూడిద శరత్‌కుమార్, కాటం సంజయ్ కాంత్, ఎస్.కె.షరీఫ్ ఉన్నారు.