నల్లజర్ల: కళ్లు కూడా తెరవక ముందే మృత్యువుతో పోరాడి ఓడిపోయింది ఆ చిన్నారి. అల్లారుముద్దుగా పెంచుకోవాల్సిన ఆ తల్లి.. పుట్టగానే ఆ శిశివును తుప్పల్లో పడేసింది. పొగాకు బ్యారన్ల వద్ద పొదల్లో కుక్కలు పీకుతుండగా కూలీలు చూసి ఆ శిశువును బయటకు తెచ్చి, ఏఎన్‌ఎం మహాలక్ష్మికి, గ్రామ సంరక్షణాధికారి దీప్తికి అప్పగించారు. నల్లజర్ల మండలం పోతవరంలో మంగళవారం జరిగిన ఈ సంఘటన పాఠకులకు విదితమే. తొలుత పోతవరం పీహెచ్‌సీలోను, అనంతరం ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ చిన్నారి మంగళవారం రాత్రి 11.30 సమయంలో మృతి చెందినట్టు ఎస్సై సోమరాజు తెలిపారు. బుధవారం ఏలూరు వెళ్లి మార్చురీలో ఉన్న శిశువు శరీరంపై ఉన్న పుట్టుమచ్చలు, గాయాలను పరిశీలించి, నమోదు చేసుకున్నారు. శిశువును పడవేసిన ప్రాంతంలోని సీసీ కెమెరా ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు. డీఎన్‌ఏ శాంపిల్ తీసినట్టు ఏఎన్‌ఎం మహాలక్ష్మి తెలిపారు.
ఎవరా ముగ్గురు?
ముళ్ల పొదల్లో గాయాలతో ఉన్న శిశువును పోతవరం పీహెచ్‌సీకి తరలించినప్పటి నుంచి అంబులెన్స్‌లో ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించడం వరకు ముగ్గురు వ్యక్తులు వెంబడించినట్టు ఆశా కార్యకర్త సత్యవతి, ఏఎన్‌ఎం మహాలక్ష్మి బుధవారం పోలీసులకు తెలిపారు. తాము ఎమ్మెల్యే తాలూకా అని, శిశువును తామే తీసుకెళ్తామని కాపలా సిబ్బందితో అనడం పలు అనుమానాలకు తావిస్తోంది. శిశువు మృతి చెందే వరకు పలు నంబర్లతో ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లతో ఫోన్‌లో మాట్లాడినట్టు చెబుతున్నారు. ఆ ఫోన్ నంబర్లను తీసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.