వాడపల్లి వెంకన్నకు రూ.1.23 కోట్ల ఆదాయం
కొత్తపేట: కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లిలోని శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయ హుండీల ద్వారా రూ.1.23 ఆదాయం వచ్చినట్టు దేవాదాయ –ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. 31 రోజుల అనంతరం దేవదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో గురువారం హుండీలను తెరిచి నగదు, మొక్కుబడులను లెక్కించారు. ప్రధాన హుండీల నుంచి రూ.96.99,132, అన్న ప్రసాదం హుండీల నుంచి రూ.23,27,304, బంగారం 10 గ్రాములు, వెండి 1 కేజీ 925 గ్రాములు, విదేశీ కరెన్సీ నోట్లు 20 వచ్చినట్టు వివరించారు. ఆలయ క్షేత్ర పాలకుడు అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామి ఆలయ హుండీల ద్వారా రూ 2,99,236 ఆదాయం లభించిందన్నారు. దేవదాయ శాఖ రాజమహేంద్రవరం ఇన్‌స్పెక్టర్ టీవీఎస్‌ఆర్ ప్రసాద్, గోపాలపురం గ్రూపు దేవాలయాల గ్రేడ్ – 3 ఈఓ బీ కిరణ్, ఆత్రేయపురం గ్రూపు దేవాలయాలు గ్రేడు – 3 ఈఓ బీ నరేంద్రకుమార్, దేవస్థానం మాజీ చైర్మన్ కరుటూరి నరసింహారావు, ఉప సర్పంచ్ పోచిరాజు బాబూరావు పాల్గొన్నారు.
వ్యక్తి దారుణ హత్య
కొవ్వూరు: తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామ శివారున అరటి తోటలో పెండ్యాల ప్రభాకర్ (45)ను బుధవారం రాత్రి కత్తులతో నరికి పాశవికంగా హత్య చేశారు. దొమ్మేరు గ్రామానికి చెందిన పెండ్యాల ప్రభాకర్ గత కొన్నేళ్లుగా కొవ్వూరులో నివాసం ఉంటున్నారు. సేంద్రియ వ్యర్థాలను సేకరించే వ్యాపారం చేస్తున్నారు. గత రాత్రి పార్టీకి రమ్మని ఫోన్ రావడంతో బయటికి వెళ్లారు. రాత్రి పది గంటల నుంచి ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది. గురువారం ఉదయం స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పట్టణ పోలీసులకు సమా చారం అందించారు. ప్రభాకర్‌పై కత్తితో దాడి చేసి కుడి చేయి హస్తాన్ని నరికి తీసుకుని వెళ్లి పోయారు. హత్యకు గురైన ప్రాంతం చుట్టుపక్కల చేయి కోసం పోలీసులు గాలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ ఘటన స్థలంలో నుంచి వివరాలు సేకరించాయి. తలపైన బలంగా కత్తితో దాడిచేసి హతమార్చారు. చేతి గుర్తు వరకు నరికి వేశారు. మృతుడు ఇంటి నుంచి మోటారు సైకిల్‌పై బయలుదేరగా మార్గమధ్యలో మరో వ్యక్తి ఆయనతో ఉన్నట్లు సమాచారం. ఆ వ్యక్తి ఎవరనే అంశంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. చేతికి బంగారు కడియం, బంగారు ఉంగరాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఆ కారణం చేతనే చేతిని నరికి పెట్టుకెళ్లారా అన్న కోణంలోను పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. ప్రభాకర్‌కు వచ్చిన ఫోన్ కాల్స్ ఆధారంగా విచారణ చేస్తున్నారు. అసలు పార్టీకి పిలిచిందెవరు? మోటారు సైకిల్ వెనుక కూర్చోని వెళ్లిన వ్యక్తి ఎవరు.? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఒంటిపై ఉన్న బంగారం కోసం హత్య చేశారా...లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలోను పోలీసులు దృష్టి సారించారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు ఏడాది క్రితమే వివాహం అయ్యింది.
● చేయి నరికి తీసుకెళ్లిన దుండగులు
● తూర్పుగోదావరి జిల్లా దొమ్మేరులో ఘటన