
శ్రీనివాసా.. శ్రీ చిద్విలాసా..
వాడపల్లి క్షేత్రం భక్తజన సందోహం
కొత్తపేట: శ్రీనివాసా.. శ్రీ వేంకటేశా అంటూ భక్తులు శనివారం తన్మయత్వంలో మునిగి తేలారు. వాడపల్లి స్వామివారిని చూసి భక్తిపారవశ్యంతో ఓలలాడారు. శ్రీ, భూ సమేత వేంకటేశ్వరస్వామి క్షేత్రం శనివారం భక్తులతో కిక్కిరిసింది. రాష్ట్ర నలుమూలల నుంచీ భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. డీసీ, ఆలయ ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో సిబ్బందికి అదనపు ఏర్పాట్లు చేశారు. స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్ ఆధ్వర్యంలో పూజాదికాలు నిర్వహించారు. స్వామివారిని సుగంధ పరిమళ పుష్పాలతో విశేషంగా అలంకరించారు. అలాగే వేంకటేశ్వర సహిత ఐశ్వర్యలక్ష్మీ హోమం నిర్వహించి, భక్తులకు స్వామి దర్శనం కల్పించారు. భక్తుల సౌకర్యార్ధం అదనపు ఏర్పాట్లలో భాగంగా ఫ్‌లైఓవర్ నిర్మించారు. స్వామి దర్శనానికి భక్తులు పైనుంచి వెళుతుండగా కింద ఏడు వారాల నోము చేసుకునే భక్తులు ఏడు ప్రదక్షిణలు చేశారు. స్వామి దర్శనానంతరం ఆ ప్రాంగణంలోని అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామిని భక్తులు దర్శించుకుని, అన్నప్రసాదం స్వీకరించారు.
శనైశ్చరునికి తైలాభిషేకాలు
కొత్తపేట: శనిదోష నివారణకు ప్రసిద్ధి చెందిన మందపల్లి ఉమా మందేశ్వర (శనైశ్చర) స్వామిని శనివారం అత్యధిక సంఖ్యలో భక్తులు దర్శించి, ప్రత్యేక పూజలు, తైలాభిషేకాలు జరిపించారు. దేవదాయ, ధర్మదాయ శాఖ ఉప కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో భక్తుల పూజలకు ఏర్పాట్లు చేశారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా భక్తుల పూజలు, తైలాభిషేకాలు టిక్కెట్లు ద్వారా దేవస్థానానికి రూ.3,30,890, అన్నప్రసాదం విరాళాలు రూపంలో రూ.76,782తో మొత్తం రూ.4,07,672 ఆదాయం వచ్చినట్టు ఈఓ తెలిపారు.
బాలాజీకి రూ.1.22 లక్షల ఆదాయం
మామిడికుదురు: అప్పనపల్లి బాల బాలాజీ స్వామి ఆలయానికి శనివారం విశేష సంఖ్యలో భక్తులు వచ్చారు. సుప్రభాత సేవ, తొలి హారతిని ఘనంగా జరిపించారు. స్వామి వారి సన్నిధిలో జరిగే లక్ష్మీనారాయణ హోమాన్ని భక్తులు దర్శించుకున్నారు. స్వామి వారికి వివిధ సేవల ద్వారా రూ.1,22,575 ఆదాయం వచ్చింది. స్వామి వారిని 2,600 మంది భక్తులు దర్శించుకున్నారని ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. 1,200 మంది భక్తులు స్వామి వారి అన్న ప్రసాదం స్వీకరించారన్నారు. లడ్డూ ప్రసాదం విక్రయం ద్వారా రూ.16,680 ఆదాయం రాగా నిత్యాన్నదానం ట్రస్టుకు భక్తులు రూ.36,176 విరాళంగా అందించారన్నారు.