
ఆలయాలే లక్ష్యంగా చోరీలు
● పట్టుబడ్డ ఇద్దరు దోపిడీ దొంగలు
● రూ.10 లక్షల విలువైన 10 కేజీల
వెండి రికవరీ
అమలాపురం రూరల్: ఆలయాల్లో దేవుడి ఆభరణాలు, హుండీల్లో నగదు దోచుకునే ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. రూరల్ సర్కిల్ పరిధిలో ఇటీవల వివిధ దేవాలయాల్లో జరిగిన చోరీలకు పాల్పడిన దొంగల వివరాలను అమలాపురం తాలూకా పోలీసు స్టేషన్‌లో శనివారం డీఎస్పీ టీఎస్‌ఆర్‌కే ప్రసాద్, రూరల్ సీఐ ప్రశాంత్ కుమార్, తాలూకా ఎస్‌ఐ శేఖర్ బాబుతో కలిసి విలేకరులకు వెల్లడించారు. రూరల్ సీఐ ప్రశాంత్‌కుమార్, తాలూకా ఎస్సై శేఖర్‌బాబు, రూరల్ సర్కిల్ క్రైం పార్టీ కలసి దొంగలను పట్టుకున్నట్లు తెలిపారు. యానాంకు చెందిన మల్లాడి కాసురాజు, పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం ముత్యాలపల్లి గ్రామానికి చెందిన కొల్లాటి తిరుపతి రాజులను అదుపులోకి తీసుకుని విచారించి వారి నుంచి చోరీ చేసిన రూ.10 లక్షల విలువైన 10 కేజీల వెండిని రికవరీ చేసి అమలాపురం ఏజేఎఫ్‌సీఎం కోర్టులో ప్రవేశపట్టినట్లు తెలిపారు.
నాలుగు ఆలయాల్లో చోరీల
వివరాలు ఇవీ..
అమలాపురం రూరల్ మండలం సవరప్పాలెంలో ఫిబ్రవరి 28న రమా సత్యనారాయణ దేవాలయంలో 5 కిలోల 10 గ్రాముల 620 మిల్లీ గ్రాముల వెండి అభరణలు దొంగిలించారు. అల్లవరం మండలం సామంతకుర్రు గ్రామంలో వెంకటేశ్వర ఆలయంలో 4.800 కిలోల వెండి ఆభరణాలు, కొమరగిరిపట్నం సాయిబాబా గుడి తాళాలు పగలగొట్టి హోండీలోని రూ.వెయ్యి నగదు, ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి సంత మార్కెట్ సమీపంలో విజయ కనకదుర్గమ్మ ఆలయంలోని హుండీలోని రూ.1500 నగదు చోరీ చేశారు. కాగా దొంగతనాలకు ఉపయోగించే మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకునట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి 10 కేజీల వెండి, రూ.2500 నగదు, వారు నేరాలకు ఉపయోగించే మోటర్ సైకల్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు.
వారు కలుసుకున్నది ఇలా..
కొల్లాటి తిరుపతిరాజు డిగ్రీ వరకు చదివి అల్లరి చిల్లరగా తిరిగే వాడు. రైస్ పుల్లింగ్‌తో మోసాలకు పాల్పడేవాడు. కొల్లాటి తిరుపతి రాజుతో అతడికి పరిచయం ఏర్పడింది. ఇటీవల కాలంలో వారు అమలాపురం ఆలయాల్లో చోరీలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కారు. రూరల్ సీఐ ప్రశాంత్ కుమార్, రూరల్ ఎస్సై శేఖర్ బాబు, అల్లవరం ఎస్‌ఐ తిరుమలరావు, క్రైం పార్టీ ఏఎస్‌ఐ వి.సుబ్బారావు, హెచ్‌సీ ఏసుబాబు, పీసీలు శివరాకృష్ణ, ఎం.ధర్మరాజు, నాగరాజులను ఎస్పీ కృష్ణారావు అభినందించారని డీఏస్పీ ప్రసాద్ తెలిపారు.