
ఆడుకుంటూ.. అనంతలోకాలకు..
పెదపూడి: అనపర్తి మండలం కొప్పవరంలోని నల్ల కాలువలో చిన్నారి ప్రమాదవశాత్తూ పడి మృతి చెందినట్లు ఏఎస్సై బి.దుర్గాప్రసాద్ తెలిపారు. ఆయన శుక్రవారం తెలిపిన వివరాల మేరకు కొప్పవరంలోని నల్ల కాలువ గట్టుపై మచ్చ దొరబాబు నివసిస్తూ తాపీపని చేస్తుంటాడు. అతనికి కుమార్తె అనూష భార్గవి(4), కొడుకు ఉన్నారు. రోజులానే దొరబాబు ఉదయం తాపీ పనికి వెళ్లాడు. తల్లి కూతురు, కొడుకుతో ఇంటి వద్ద ఉంది. అనుష 10 గంటల సమయంలో ఆడుకుంటూ కొంత సేపటికి కనిపించలేదు. ఆందోళనకు గురైన తల్లి వెంటనే దొరబాబుకు విషయం చెప్పింది. అతడు వెంటనే ఇంటికి వచ్చి బంధువుల సాయంతో పరిసరాల్లో వెదికినా ఫలితం లేకపోయింది. దొరబాబు ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాలువ గట్టుపై వారు వెతుకుతుండగా పెదపూడి మండలం చింతపల్లి గ్రామంలోని కాలువలో రేవు వద్ద చిన్నారి మృతదేహాన్ని కనుగొన్నారు. సీఐ వీఎల్‌వీకే సుమంత్ ఘటన స్థలానికి చేరుకుని చిన్నారిని పరిశీలించి వివరాలు సేకరించారు. అనంతరం చిన్నారి మృతదేహాన్ని అనపర్తిలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు బోరున విలపించారు.
కాలువలో పడి చిన్నారి మృతి

ఆడుకుంటూ.. అనంతలోకాలకు..