
బస్సు ఢీకొని జంగమ దేవర మృతి
మామిడికుదురు: మామిడికుదురు 216వ జాతీయ రహదారిపై ఎస్‌బీఐ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే గ్రామంలోని జంగాలపుంత (గన్నేరు రోడ్డు)కు చెందిన జంగమ దేవర ఇంగువ ఏడుకొండలు (48) మృత్యువాత పడ్డారు. మోటార్ సైకిల్‌పై ఏడుకొండలు పాశర్లపూడి వైపు వెళ్తుండగా పాలకొల్లు నుంచి అప్పనపల్లి వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెనుక భాగం మోటార్ సైకిల్‌కు తగిలి ఏడుకొండలు వెనుక చక్రం కింద పడిపోయాడు. అతని తలపై నుంచి బస్సు చక్రం వెళ్లడంతో తల ఛిద్రమై అక్కడికక్కడే మృతి చెందారు. ఏడుకొండలు మృతితో అతని భార్య వరలక్ష్మి, కొడుకు లక్ష్మణరావు, వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. నగరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజోలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.