
ఓడలరేవు సొసైటీ సీఈవో మృతి
అమలాపురం టౌన్: అల్లవరం మండలం ఓడలరేవు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (సొసైటీ) సీఈవో సత్తి వెంకటేశ్వరరావు (60) కాకినాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. ఆయన ఓ మహిళ ట్రాప్‌లో పడి నగదు, బంగారం పోగొట్టుకుని, గడ్డి మందు కలిపిన మద్యాన్ని తాగడంతో తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ మేరకు అమలాపురం పట్టణ సీఐ పి.వీరబాబు బుధవారం మాట్లాడుతూ వెంకటేశ్వరరావు మృతి చెందారని మధ్యాహ్నం 2 గంటలకు సమాచారం వచ్చిందన్నారు. ఆయనపై హత్యాయత్నం చేశారన్న అభియోగంపై ట్రాప్ చేసిన మహిళను, సహకరించిన మరో ఇద్దరిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపర్చామన్నారు. ఇప్పుడు వెంకటేశ్వరరావు మృతి చెందడంతో హత్యాయత్నం కేసును హత్యగా మార్చినట్టు వెల్లడించారు. కాగా..వెంకటేశ్వరరావుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
చికిత్స పొందుతూ మృత్యువాత
హత్యగా మారిన హత్యాయత్నం కేసు