
చందువ చేప సాగు ఎంతో లాభదాయకం
తొండంగి: చందువ చేపల పెంపకం ఎంతో లాభదాయకమని సెంట్రల్ మైరెన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎంఎఫ్‌ఆర్‌ఐ) ప్రధాన శాస్త్రవేత్త జోకే కిజహకూడన్ అన్నారు. దానవాయిపేట వద్ద వైభవ్ హెచరీస్ (ఇండియా) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చందువ చేప విత్తనోత్పత్తి కేంద్రాన్ని బుధవారం మండలంలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చందువ చేపకు దేశ, విదేశాల్లో డిమాండ్ ఉందని, దీన్ని పెంచడానికి రైతులు ముందుకు రావాలని కోరారు. వైభవ్ హెచరీస్ మేనేజింగ్ డైరెక్టర్ బేటే చంద్రశేఖర్ మాట్లాడుతూ విశాఖపట్నంలోని ఐకార్ – సెంట్రల్ మైరెన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎంఎఫ్‌ఆర్‌ఐ) సుమారు 13 ఏళ్ల పాటు పరిశోధన చేసిన తర్వాత ఇండియన్ పొంపానో (చందువ చేప) పెంపకాన్ని దేశంలో అభివృద్ధి చేయాలని నిర్ణయించుకుందన్నారు. ఈ మేరకు తమతో సంప్రదించగా చందువ చేప విత్తనోత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించడానికి ముందుకొచ్చామన్నా రు. శాస్త్రవేత్త జాయల్ మాట్లాడుతూ దేశంలోనే మొదటిసారిగా చందువ చేప విత్తనోత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించామన్నారు. వీటిని చెరువులోనే కాకుండా కాలువలు, నదులు, సముద్రంలో కూడా పెంచవచ్చన్నారు. కార్యక్రమంలో వైభవ్ హెచరీస్ (ఇండియా) డైరెక్టర్లు బేటే సాయి కపిల్ త్రిలోక్, బేటే సాయి కపిల్ విఖ్యాత్, శాస్త్ర వేత్తలు డాక్టర్ బీజీ జీవీఆర్, డాక్టర్ జయశ్రీ లోక, డాక్టర్ రితీష్ రంజన్, డాక్టర్ శేఖర్ మహాజన్, తొండంగి మండల మత్స్యకార సంఘం నాయకుడు రమణ, జి.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
సీఎంఎఫ్‌ఆర్‌ఐ ప్రధాన శాస్త్రవేత్త
జోకే కిజహకూడన్
దానవాయిపేటలో విత్తనోత్పత్తి
యూనిట్ ప్రారంభం