రెండు చోట్ల నలుగురి మృతి
పెద్దనాపల్లి, కాండ్రకోట గ్రామాల్లోని ఏలేరు కాలువలో ప్రమాదం
కాండ్రకోట నూకాలమ్మ అమ్మవారి దర్శనానికి వచ్చిన ఓ కుటుంబానికి చెందిన బాలుడు, యువకుడు స్థానిక ఏలేరు నదిలో మునిగి మృతి చెందిన సంఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. యానానికి చెందిన కొప్పాడ సత్తిబాబు, తిరమాడి రాజు కుటుంబాలు ఈ నెల ఒకటిన అమ్మవారి దర్శనానికి వచ్చాయి. దర్శనం అనంతరం సమీపంలోని ఓ తోటలో వంటలు చేసుకుని, ఆనందంగా గడిపారు. ఈలోపు కొప్పాడ బాలు (20), అతడి మేనల్లుడు తిరమాడి నాగ విశాల వర్మ (8) ఏలేరు నదిలోకి స్నానానికి వెళ్లారు. అయితే సాయంత్రం అయినా వారిద్దరూ తిరిగిరాలేదు. దీంతో ఈ విషయాన్ని ఆ గ్రామ పెద్దలు, పెద్దాపురం పోలీసులకు సమాచారం ఇచ్చారు. రాత్రి పది గంటలు కావడంతో తర్వాత రోజు ఉదయాన్నే ఎస్‌ఐ మౌనిక, అగ్నిమాపక సిబ్బంది ఆధ్వర్యంలో గజ ఈతగాళ్లతో ఏలేరు నదిలో గాలింపు చర్యలు మొదలుపెట్టారు.
మృతదేహాల లభ్యం
ముందుగా ఉదయం బాలుడు వర్మ మృతదేహం లభ్యమైంది. బాలు మృతదేహం సాయంత్రానికి నీటిపై తేలింది. దీంతో రెండు మృతదేహాలను పెద్దాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. దీనిపై పెద్దాపురం పోలీసలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలుకు తల్లీతండ్రితో పాటు చెల్లి హారిక ఉంది. రైల్వే డిపార్ట్‌మెంట్‌లో చిరు ఉద్యోగంతో జీవనం సాగిస్తున్నాడు. వర్మ నాలుగో తరగతి చదువుతున్నాడు.
ఏలేశ్వరం/పెద్దాపురం: ఏలేరు కాలువలో స్నానానికి దిగి నలుగురు మృత్యువాత పడ్డారు. అప్పటి వరకూ స్నేహితులు, కుటుంబ సభ్యులతో గడిపిన వారు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. పని కోసం వచ్చిన ఇద్దరు స్నేహితులు, అమ్మవారి దర్శనానికి వచ్చిన మేనమామ, మేనల్లుడు ఏలేరు కాలువలో మునిగిపోయారు. పెద్దనాపల్లి, కాండ్రకోట గ్రామాల్లో ఈ విషాద ఘటనలు జరిగాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగ్గంపేట గ్రామానికి చెందిన దేవర జీవన్ కుమార్ (19), మొల్లి వీర వెంకట దుర్గ (తరుణ్) (19), నీలాద్రి జగన్ కుమార్, దేవర దేవిశ్రీ ప్రసాద్, కొల్లిపోయిన విజయ్‌కుమార్, పర్రి సునీల్, వైభోగుల నారాయణమూర్తి బుధవారం కిర్లంపూడి మండలం ఎస్.తిమ్మాపురానికి తాపీపనికి వెళ్లారు.
మధ్యాహ్న సమయంలో చల్లగా ఉంటుందని సమీపంలోని ఏలేశ్వరం మండల పరిధి పెద్దనాపల్లిలో ఉన్న ఏలేరు కాలువలో స్నానానికి దిగారు. అయితే ప్రమాదవశాత్తూ దేవర జీవన్ కుమార్, మొల్లి వీర వెంకట దుర్గ మునిగిపోయారు. మిగిలిన వారు సురక్షితంగా బయటపడి జగ్గంపేట పోలీసులకు సమాచారం అందించారు. ఏలేశ్వరం మండల పరిధి కావడంతో ఎస్సై రామలింగేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ప్రత్తిపాడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
కోనేటి వీధిలో విషాద ఛాయలు
జగ్గంపేట: పెద్దనాపల్లి వద్ద ఏలేరు కాలువలో మునిగి చనిపోయిన ఇద్దరు యువకులు జగ్గంపేటలోని కోనేటి వీధికి చెందిన వారు కావడంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి. మొల్లి వీర వెంకట దుర్గ తాపీ మేస్త్రిగా పనిచేస్తున్నాడు. దేవాలయాలపై సిమెంట్‌తో దేవుళ్ల బొమ్మలను రూపొందించడంతో ఎంతో నైపుణ్యం ఉంది. అతడి తండ్రి రాంబాబు కొన్ని కారణాలతో కొంతకాలం క్రితం ఇల్లు విడిచి ఎక్కడికో వెళ్లిపోయాడు. దీంతో ఆ కుటుంబ భారాన్ని దుర్గ మోస్తున్నాడు. తల్లి రాజులు, చెల్లి గాయత్రిల బాగోగులు చూసుకొంటున్నాడు. ఇప్పడు దుర్గ మృతి చెందడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది.
ఇంటర్ పరీక్షలు రాసి..
దేవర జీవన్ కుమార్ ఇటీవలే ఇంటర్మీడియెట్ పరీక్షలు రాశాడు. ప్రస్తుతం సెలవులు కావడంతో తాపీ పనికి వెళుతున్నాడు. అతడి తండ్రి వాసు తాపీమేస్త్రిగా పనిచేస్తున్నాడు. ఆయనకు ఇద్దరి కుమారులు. వారిలో జీవన్ చిన్నవాడు. బుధవారం మధ్యాహ్నం వరకు తాపీపని చేసిన జీవన్ తన స్నేహితులతో కలిసి ఏలేరు కాలువలో స్నానానికి వెళ్లాడు. ప్రమాదవశాత్తూ మృతి చెందాడు.

స్నానానికి దిగి మృత్యు ఒడికి..

స్నానానికి దిగి మృత్యు ఒడికి..