బాలికా విద్యకు భరోసా | - | Sakshi
Sakshi News home page

బాలికా విద్యకు భరోసా

Apr 3 2025 12:12 AM | Updated on Apr 3 2025 12:12 AM

బాలిక

బాలికా విద్యకు భరోసా

ముఖ్యమైన తేదీలు

దరఖాస్తుల ప్రారంభం : 22 – 03 – 2025

స్వీకరణకు చివరి తేదీ : 11 – 04 – 2025

ప్రిపరేషన్‌ ఆఫ్‌ సెలక్షన్‌ జాబితా : ఏప్రిల్‌ 16

వెరిఫికేషన్‌ : ఏప్రిల్‌ 16 నుంచి 18 వరకూ..

6, 11 తరగతులకు ఎంపికై న విద్యార్థుల జాబితా: ఏప్రిల్‌ 21

ఎంపికై న వారి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌: ఏప్రిల్‌ 21 నుంచి 25 వరకూ..

రాయవరం: పేద, అనాథ బాలికల కోసం ఏర్పాటు చేసిన కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ) వారి విద్యకు భరోసాగా నిలుస్తున్నాయి. కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా బోధన చేస్తున్నాయి. వీటిలో ప్రవేశాలకు ఏటేటా డిమాండ్‌ పెరుగుతోంది. సాధారణ విద్యతో పాటు ఒకేషనల్‌, కంప్యూటర్‌ విద్యను సైతం ఇక్కడ అందిస్తున్నారు. ఆంగ్ల బోధనతో పాటు ఉచిత భోజనం, వసతి, పుస్తకాలు, యూనిఫాం తదితర సౌకర్యాలు అందిస్తున్నారు.

ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

కాకినాడ జిల్లాలోని నాలుగు కేజీబీవీల్లో ప్రవేశానికి విద్యార్థినులకు అవకాశం ఉంది.వీటిలో 6వ తరగతిలో ప్రవేశానికి మార్చి 27 నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. ప్రతి పాఠశాలలో 6వ తరగతికి 40 సీట్లు ఉన్నాయి. అలాగే ఇంటర్మీడియేట్‌ మొదటి సంవత్సరం విద్యార్థులకు 160 సీట్లు కేటాయించారు. వీటికి ఉమ్మడి జిల్లా పరిధిలో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

కేజీబీవీల వివరాలు

జిల్లా సమగ్ర శిక్షా ప్రాజెక్టు కింద మైదాన ప్రాంతంలో తుని, కోటనందూరు, శంఖవరం, తొండంగిలలో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలున్నాయి. గతంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మైదాన ప్రాంతంలోని నాలుగు కేజీబీవీలతో పాటుగా రంపచోడవరం, మారేడుమిల్లి, గంగవరం, వై.రామవరం, ఎటపాక, కూనవరం, వీఆర్‌పురం, చింతూరులో కేజీబీవీలు ఉండేవి. జిల్లాల విభజన అనంతరం ఏజెన్సీ కేజీబీవీలు అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోకి వెళ్లాయి. ఇప్పుడు కేవలం కాకినాడ జిల్లా పరిధిలోని నాలుగు కేజీబీవీల్లో కాకినాడ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల పరిధిలోని విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశముంది.

ఏటా 40 మందికి అవకాశం

కేజీబీవీలలో ఏడాదికి 40 మంది వంతున 6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 7, 8 తరగతుల్లో ఖాళీలను బట్టి సీట్లు కేటాయిస్తారు. జిల్లాలోని నాలుగు కేజీబీవీలో ఇంటర్‌ విద్యను ప్రవేశ పెట్టారు. శంఖవరం కేజీబీవీలో ఎంపీసీ, తుని, తొండంగి కేజీబీవీల్లో బైపీసీ, కోటనందూరు కేజీబీవీలో ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సులున్నాయి.

వీరికి తొలి ప్రాధాన్యం

అనాథ బాలికలు, సింగిల్‌ పేరెంట్‌, పేద పిల్లలతో పాటు బడి బయట ఉన్న పిల్లలు, బడి మానేసిన వారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న బాలికలకు తొలి ప్రాధాన్యత కింద కేజీబీవీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. వలస కూలీల చిన్నారులు, కార్మిక శాఖ అధికారులు సిఫారసు చేసిన వారికీ ప్రవేశాల్లో ప్రాధాన్యం ఉంటుంది. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు. రాష్ట్ర స్థాయిలో స్క్రూట్నీ అనంతరం ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఎంపికై న విద్యార్థి మొబైల్‌కు ఎంపికై నట్లుగా సమాచారం వస్తుంది. 2018 నుంచి కేజీబీవీల్లో ఇంటర్‌ విద్యనూ అందుబాటులోకి తీసుకువచ్చారు.

ఫిమేల్‌ లిటరసీ రేటు ఆధారం

ఫిమేల్‌ లిటరసీ రేటు తక్కువుగా ఉన్న మండలాలకు చెందిన విద్యార్థినులకు తొలి ప్రాధాన్యత ఇస్తారు. దాని ప్రకారం కాకినాడ జిల్లాలోని ఫిమేల్‌ లిటరసీ తక్కువుగా ఉన్న మండలాల విద్యార్థినులకు అవకాశం ఉంటుంది. సీట్లు భర్తీ కాకపోతే కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల పరిధిలోని ఫిమేల్‌ లిటరసీ తక్కువుగా ఉన్న మండలాల విద్యార్థినులతో భర్తీ చేస్తారు.

గుణాత్మక విద్యాబోధన

కేజీబీవీల్లో బాలికలకు క్వాలిఫైడ్‌ ఉపాధ్యాయులతో గుణాత్మక విద్యను అందిస్తున్నారు. వీటితో పాటు ఆంగ్ల మాధ్యమం కూడా బోధిస్తున్నారు. కార్పొరేట్‌ పాఠశాలలకు ఏ మాత్రం తీసిపోని విధంగా బోధన చేస్తున్నారు. రెగ్యులర్‌ పాఠ్యాంశాల బోధనతో పాటు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు, కంప్యూటర్‌ విద్య, క్రీడల్లో శిక్షణ ఇస్తున్నారు. విద్యతో పాటు కుట్లు, అల్లికలు, టైలరింగ్‌, బొమ్మల తయారీ, పేపర్లతో వివిధ రకాల నమూనాలు తయారు చేయడం నేర్పుతున్నారు. కబడ్డీ, టెన్నిస్‌, వాలీబాల్‌, సాఫ్ట్‌బాల్‌, హాకీ, టెన్నికాయిట్‌ తదితర క్రీడల్లో శిక్షణనిస్తున్నారు. నాలుగు కేజీబీవీల్లో ఒకేషనల్‌ కోర్సును 2023–24 నుంచి అందుబాటులోకి తీసుకుని వచ్చారు. 2024–25 నుంచి పాల్‌ ల్యాబ్స్‌ అందుబాటులోకి రాగా, ల్యాబ్‌లు, లైబ్రరీ రూమ్‌లను సిద్ధం చేస్తున్నారు.

కేజీబీవీలలో చక్కని విద్యాబోధన

6వ తరగతి నుంచి ఇంటర్‌ వరకూ అవకాశం

ప్రవేశాలకు మొదలైన దరఖాస్తుల స్వీకరణ

ఈ నెల 11 వరకూ గడువు

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

ప్రతి కేజీబీవీల్లో 6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తుదారులు నేరుగా కాకుండా ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల గడువు ముగియగానే పరిశీలన చేసి ప్రవేశాన్ని నిర్ణయిస్తాం. పేద విద్యార్థినులకు కేజీబీవీలో ప్రవేశం ఒక సువర్ణావకాశం. చదువు, ఆటపాటల్లో కేజీబీవీ విద్యార్థులు మెరుగైన ఫలితాలను సాధిస్తున్నారు.

– జి.నాగమణి,

ఆర్‌జేడీ, పాఠశాల విద్యాశాఖ, కాకినాడ

ఆహ్లాదకర వాతావరణం

కేజీబీవీల్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. నిత్యం వైద్య సిబ్బంది పర్యవేక్షణలో విద్యార్థులు ఉంటారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ఉపాధ్యాయుల పర్యవేక్షణలో స్టడీ అవర్లు జరుగుతాయి. ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ చూపిస్తారు.

– పి.ఉమామహేశ్వరి,

జీసీడీవో, ఏపీ సమగ్ర శిక్షా, కాకినాడ

బాలికా విద్యకు భరోసా1
1/2

బాలికా విద్యకు భరోసా

బాలికా విద్యకు భరోసా2
2/2

బాలికా విద్యకు భరోసా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement