
మానవుల శ్రేయస్సు కోసమే యాగాలు
అల్లవరం: యజ్ఞయాగాల పరమార్థం సర్వమానవాళి శ్రేయస్సు అని భీమవరం మావుళ్లమ్మ అమ్మవారి ఆలయ వేద ఉపవాచకులు ఈవని శ్రీరామచంద్ర సోమయాజులు అన్నారు. అల్లవరం మండలం దేవగుప్తం గ్రామంలో వేద పండితుడు మరువాడ వెంకటేశ్వరశర్మ పర్వవేక్షణలో పోచినపెద్ది శ్యామ్ శర్మ ఆధర్యంలో జరుగుతున్న నక్షత్ర పూర్వక నవగ్రహ శివ పంచాయతన యాగానికి ఆయన బుధవారం ముఖ్యఅతిథిగా విచ్చేశారు. తొలుత శివ పంచాయతన యాగం మూడో రోజున ఉమాపార్వతీ మల్లేశ్వర స్వామివారికి అన్నాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు అమ్మవారికి కుంకుమ పూజ చేశారు. అనంతరం 27 నక్షత్రాలకు నవగ్రహ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సోమయాజులు మాట్లాడుతూ శివ పంచాయత యాగం విశిష్టతను తెలిపారు. హైందవ జాతిని ఉద్ధరించడానికి జగద్గురు ఆది శంకరాచార్యులు ఉద్భవించారని, ఆయనతోనే ఈ జాతి మనుగడ సాగుతోందన్నారు. అనంతరం భక్తులు ఆయన ఆశీస్సులు పొందారు.