
నేడు సమ్మర్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్
రాజమహేంద్రవరం సిటీ: జిల్లా మీదుగా గురువారం వన్‌వే సమ్మర్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలు నడిపేందుకు చర్యలు చేపట్టినట్టు రైల్వే అధికారులు బుధవారం ప్రకటించారు. 07011 చర్లపల్లి– విశాఖపట్నం మధ్య నడిచే ఈ రైలు గురువారం చర్లపల్లిలో బయలుదేరి శుక్రవరం విశాఖపట్నం చేరుకుంటుందని అధికారులు ప్రకటించారు. ఈ రైలు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం, సామర్లకోట, అన్నవరం, తుని రైల్వే స్టేషన్లో ఆగనుందని తెలిపారు.
నేటి నుంచి
పదవ తరగతి స్పాట్
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): పదో తరగతి పరీక్షల మూల్యాంకనం జిల్లాలో గురువారం నుంచి జరగనుంది. ఆ వివరాలను డీఈవో కె.వాసుదేవరావు బుధవారం తెలిపారు. స్థానిక ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో పదవ తరగతి మూల్యాంకనం ప్రారంభమవుతుంది. అందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. చీఫ్ ఎగ్జామినర్స్ 101 మంది, అసిస్టెంట్ ఎగ్జామినర్స్ 630 మంది, స్పెషల్ అసిస్టెంట్స్ 201 మంది పనిచేయనున్నారు.
ఫార్మసీ విద్యార్థి ఆరోగ్య
పరిస్థితిపై హెల్త్ బులెటిన్
కంబాలచెరువు(రాజమహేంద్రవరం): ఫార్మసీ విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని ప్రభుత్వాసుపత్రి వైద్య బృందం తెలిపింది. ఆమె ఆరోగ్య పరిస్ధితిపై ప్రభుత్వ వైద్య బృందం బుధవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. రోగి అపస్మారక స్థితికి వచ్చిందని, ఈ కారణంగా ఐసీయూలో వెంటిలేటర్ ద్వారా చికిత్స అందుతోందన్నారు. రక్తపోటు, పల్స్, శ్వాసక్రియ తక్కువగా ఉన్నాయన్నారు. ఏసీఎల్‌ఎస్ మార్గ్గదర్శకాల ప్రకారం కార్డియోపల్మనరీ రెసుసిటేషన్ సీపీఆర్ ఇచ్చారన్నారు. సుదీర్ఘ చికిత్స తర్వాత స్వల్పంగా శరీర స్పందన తిరిగి వచ్చిందన్నారు. చికిత్సలో భాగంగా ఎమ్‌ఆర్‌ఐ, సిటీ స్కాన్, ఈఈజీ, కార్డియాలజీ, న్యూరాలజీ పరీక్షలు చేశారన్నారు. మెదడు తీవ్రంగా పాడైపోయిందన్నారు.
పంచాయతీ
కార్యదర్శిపై 9న విచారణ
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): పంచాయతీ కార్యదర్శి మహమ్మద్ ఉన్నీసాబీబీపై జిల్లా పంచాయతీ కార్యాలయంలో విచారణ చేపట్టనున్నారు. కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామ పంచాయతీలో పనిచేసిన సమయంలో ఒక ఇంటి పన్ను మార్పులపై ఆమైపె వచ్చిన అవినీతి అభియోగాలపై ఏసీబీ, జిల్లా పంచాయతీ అధికారులు సంయుక్తంగా ఈ నెల 9న ఉదయం 11 గంటలకు ఈ విచారణ చేపట్టనున్నారు. జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్, ఏసీబీ సీఐ ఈ విచారణ చేపట్టనున్నారు. గతంలో ఆమైపె వచ్చిన అవినీతి ఆరోపణలపై నిజనిర్ధారణ కోసం ఈ విచారణ సాగనుంది. ఈ విచారణలో ఆమైపె వచ్చిన అవినీతి ఆరోపణలు నిజమైతే ఆమైపె శాఖపరమైన చర్యలు తీసుకోనున్నారు. ప్రస్తుతం మహహ్మద్ ఉన్నీసాబీబీ సామర్లకోట మండలం నవర పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు.
సామర్లకోట చైర్‌పర్సన్‌పై
అవిశ్వాసానికి రంగం సిద్ధం
సామర్లకోట: పట్టణ మున్సిపల్ కౌన్సిల్‌లో బలనిరూపణకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని వైఎస్సార్ సీపీకి చెందిన కౌన్సిలర్లు బుధవారం జిల్లా కలెక్టన్ షన్మోహన్ సగిలి, మున్సిపల్ కమిషనర్ ఎ.శ్రీవిద్యకు వినతి పత్రాలు అందజేశారు. కొంత కాలంగా చైర్‌పర్సన్ గంగిరెడ్డి అరుణ తీరుపై అదే పార్టీకి చెందిన కౌన్సిలర్లు అసంపూర్తితో ఉన్నారు. దాంతో 31 మంది సభ్యులు ఉన్న కౌన్సిల్ సభ్యులలో 22 మంది సంతకాలు చేసి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని వినతి పత్రాలు అందజేశారు. మున్సిపల్ కమిషనర్ ఎ.శ్రీవిద్య విలేకర్లతో మాట్లాడుతూ సగానికి మించి సభ్యులు బల నిరూపణ కోసం వినతి పత్రం అందజేస్తే దానిపై నిర్ణయం తీసుకోవలసి ఉంటుందన్నారు. బలనిరూపణ సమావేశం ఏర్పాటుకు కలెక్టరు నుంచి ఆదేశాలు రావలసి ఉందన్నారు. వినతి పత్రంలో సంతకాలు చేసిన వారి నుంచి సమాచారం సేకరించి తదుపరి నిర్ణయం తీసుకొంటారన్నారు. వైస్‌చైర్మన్ ఉబా జాన్‌మోజెస్, కౌన్సిలర్లు ఆవాల లక్ష్మీసత్యనారాయణ, పాగా సురేష్‌కుమార్, నేతల హరిబాబు, యార్లగడ్డ జగదీష్, వైఎస్సార్ సీపీ నాయకుడు రెడ్నం దొరబాబు పాల్గొన్నారు.