
పట్టణాలకు పన్నుపోటు
సాక్షి, రాజమహేంద్రవరం: ‘ఏరుదాటే వరకు ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న’ అన్న చందంగా తయారైంది కూటమి నేతలు, ప్రభుత్వం తీరు. సార్వత్రిక ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చేందుకు ఏటా పెంచే 15 శాతం పన్ను తాము అధికారంలోకి వస్తే తగ్గిస్తామని హామీలు గుప్పించారు కూటమి నేతలు. అధికార పగ్గాలు చేపట్టాక అమలు మరిచారు. వెరసి పట్టణాల్లో పన్నుభారంతో ప్రజలు సతమతం అవుతున్నారు. దీనికితోడు పన్నులు చెల్లించే ప్రజలకు 100 శాతం వడ్డీ రాయితీ అమలు చేయాల్సి ఉన్నా.. కేవలం 50 శాతానికి మాత్రమే పరిమితం చేసింది. అది కూడా చెల్లింపుల గడువు ముగిసే చివరి ఐదు రోజులు మాత్రమే అవకాశం కల్పించడంతో పన్నుల వసూళ్లలో మందగమనం ఏర్పడింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 50 శాతం మాత్రమే పన్నులు వసూలయ్యాయి.
ఇదీ సంగతి
ఇంటి, కుళాయి, ఖాళీ స్థలాలు తదితర పన్నుల వసూళ్లపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో నగరపాలక సంస్థ అధికారులతో విస్తృత ప్రచారం చేపట్టింది. పన్నులు చెల్లించకపోతే కుళాయి కనెక్షన్లు కట్ చేస్తామని హెచ్చరికలు సైతం జారీ చేసింది. పన్నుల వసూళ్లకు ప్రత్యేకంగా అధికారులను నియమించారు. వారిని ఇళ్ల వద్దకు పంపి దాదాగిరీ చేసే విధానానికి తెర తీసింది. అప్పటికీ వసూళ్లలో వేగం పుంజకోకపోవడంతో సరికొత్త ఆలోచనకు నాంది పలికింది. పన్నులు చెల్లించిన వారికి 50 శాతం వడ్డీ రాయితీ కల్పిస్తామని ప్రకటనలు చేసింది. అది కూడా పూర్తిగా అమలు చేయలేదు. పన్నుల వసూళ్ల గడువు కేవలం ఐదు రోజులు ఉందనగా ప్రకటించారు. ఈ ఆఫర్ ఉందని ప్రజలు తెలుసుకునేలోపే సమయం ముగియడంతో రాయితీతో పెద్దగా ప్రయోజనం కలిగిన దాఖలాలు లేవు. రాయితీ సైతం మొత్తం బకాయిలు చెల్లించిన వారికే వర్తింపజేయడంతో పన్నుల చెల్లింపులపై పట్టణ ప్రజలు ఆసక్తి చూపలేదు. వెరసి పన్ను వసూళ్లు 50 శాతం మాత్రమే జరిగినట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి.
కుళాయి పన్నులపై తీవ్ర ఒత్తిడి
కుళాయి పన్నులపై మున్సిపల్ అధికారులు ప్రజలపై తీవ్ర ఒత్తిడి పెంచారు. ఒకటి, రెండు కాదు పదేళ్ల కుళాయి పన్ను చెల్లింపునకు ఒకేసారి డిమాండ్ నోటీసులు ఇచ్చారు. గతంలో ఎన్నడూ లేని సంప్రదాయానికి తెర తీశారని జనం వాపోతున్నారు. కుళాయిలకు ప్రతి నెలా రూ.100 నీటి చార్జీలు మున్సిపాలిటీ, కార్పొరేషన్లు వసూలు చేస్తున్నాయి. ఏడాదికి రూ.1,200 ఇంటి పన్నుతో పాటు చెల్లించాల్సి ఉంది. కేవలం ఇంటి పన్ను వసూళ్లపై మాత్రమే దృష్టి సారించిన మున్సిపల్ అధికారులు కుళాయి పన్నులను పట్టించుకోలేదు. దీంతో ఆ బకాయిలు పేరుపోవడం.. ఒక్కసారి పదేళ్ల కుళాయి పన్ను చెల్లించాలని చెప్పడంతో ప్రజలు అవాక్కవుతున్నారు. ఒక్కసారిగా అంతమొత్తం చెల్లించాలంటే ఎలాగని ప్రశ్నించినా పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు. పైగా కుళాయి కనెక్షన్లు కట్ చేయడంతో తాగునీటి కోసం తాము ఎక్కడికి వెళ్లాలని ఆందోళన చెందుతున్నారు. కట్టకపోతే కేసులు బనాయిస్తామని బెదిరించిన సందర్భాలు సైతం లేకపోలేదు. కుళాయిలున్న కుటుంబాలో అత్యధిక శాతం పేద, మధ్య తరగతి ప్రజలే ఉన్నారు. ఒక్కసారిగా అంత మొత్తం చెల్లించాలంటే కష్టం.
గత ప్రభుత్వ హయాంలో 100 శాతం రాయితీ
కార్పొరేషన్, మున్సిపాలిటీల అభివృద్ధికి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కృషి చేసింది. రూ.కోట్లతో అభివృద్ధి పనులకు నాంది పలికింది. కార్పొరేషన్లు, మున్సిపాటిలీల్లో పన్ను బకాయిల వసూళ్లలో ప్రజలు ఆర్థిక ఇబ్బందులను దూరం చేసేందుకు 100 శాతం వడ్డీ రాయితీ కల్పించింది. ప్రస్తుత ప్రభుత్వంలా కేవలం 5 రోజుల సమయం మాత్రమే ఇవ్వకుండా నెల రోజుల పాటు రాయితీ ద్వారా పన్నులు చెల్లించేందుకు అవకాశం కల్పించేవారు. ప్రభుత్వ చర్యలతో ప్రతి ఏటా 90 శాతానికి పైగా పన్నులు వసూలయ్యేవి. ప్రజలకు వడ్డీ భారం తగ్గి ఊరట కలిగేది. మున్సిపాలిటీలకు సైతం ఆదాయం సమకూరడంతో అభివృద్ధి పనులు వేగంగా జరిగేవి.
పన్నుల వసూళ్లు ఇలా..
ఏటా పన్ను వసూళ్లు ఏప్రిల్ నుంచి సెప్టెంబర్, అక్టోబర్ నుంచి మార్చి వరకు రెండు దఫాలుగా పరిగణించి చేపడతారు. నిర్దేశించిన సమయంలో చెల్లించకపోతే రూ.100కు రూ.2 చొప్పున వడ్డీ వసూలు చేస్తారు.
మున్సిపాలిటీ డిమాండ్ వసూళ్లు వసూలైన (రూ.కోట్లలో) (రూ.కోట్లల్లో) శాతం
కాకినాడ 110.99 52.97 47.72
పిఠాపురం 10.17 4.97 48.90
సామర్లకోట 8.78 4.47 50.93
రాజమహేంద్రవరం 132.32 71.09 53.73
నిడదవోలు 8.47 4.72 55.72
ఏలేశ్వరం 2.61 1.49 57.12
అమలాపురం 14.72 9.01 61.19
రామచంద్రాపురం 7.65 4.93 64.46
పెద్దాపురం 7.18 4.72 65.81
కొవ్వూరు 4.56 3.69 81.04
ఎన్నికల సమయంలో మున్సిపాలిటీల్లో
పన్ను తగ్గిస్తామన్న కూటమి నేతలు
అధికారంలోకి వచ్చాక
15 శాతం పెంచుతూ నిర్ణయం
వడ్డీ రాయితీ 50 శాతమే వర్తింపు
వెరసి పన్ను వసూళ్లలో మందగమనం
50 శాతానికి మించి
వసూలు కాని వైనం
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ
హయాంలో 100 శాతం రాయితీ
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా పన్నుల వసూళ్లు ఇలా...
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా రాజమహేంద్రవరం, కాకినాడ కార్పొరేషన్లు ఉండగా.. 9 మున్సిపాలిటీలు, 3 నగర పంచాయతీలు ఉన్నాయి. పన్నుల వసూళ్లలో ఒక్క కొవ్వూరు మున్సిపాలిటీ మినహా మిగిలిన వాటిల్లో పన్నుల వసూళ్లలో మందగమనం కనిపిస్తోంది. రాజమహేంద్రవరంలో అత్యధిక శాతం రూ.132.32 కోట్ల డిమాండ్ ఉంటే.. రూ.71.09 కోట్లు మాత్రమే వసూలయ్యాయి.