
మీరు ఏదో మంచి చేస్తారని గెలిపించాం
మలికిపురం: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు ఏదో చేస్తారని.. రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారనుకుని.. మీరు చేసినా చేయకపోయినా మీ వెనుక ఉండి పార్టీని గ్రామాల్లో అభివృద్ధి పథంలో నడిపే వాళ్లమని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జిల్లా కేశనపల్లి సర్పంచ్, మలికిపురం మండల సర్పంచ్‌ల సమాఖ్య అధ్యక్షుడు యెనుముల వీర వెంకట సత్య నాగేంద్రప్రసాద్ (నాగు) అన్నారు. ఈ మేరకు కాపు, బీసీ కార్పొరేషన్ రుణాల సమస్యలను వివరిస్తూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లను ఉద్దేశిస్తూ గురువారం ఆయన సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో హాట్ టాపిక్‌గా మారింది.
మలికిపురం మండలంలోని 21 గ్రామాల్లో కాపు కార్పొరేషన్‌కు రుణాల కోసం 1,060 మంది దరఖాస్తు చేస్తే 44 మందికి మాత్రమే ఇచ్చారని, ఇది చాలా అన్యాయమని ఆ వీడియోలో పేర్కొన్నారు. కేశనపల్లిలో కాపు కార్పొరేషన్ రుణాల కోసం 70 మంది దరఖాస్తు చేసుకుంటే ఇద్దరికి మాత్రమే ఇవ్వడం దారుణమన్నారు. ‘కార్పొరేషన్ లోన్ల గురించి మీరు చెబుతున్నారు. మేమే చెప్పు దెబ్బలు తింటున్నాం’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గ్రామాల్లో కార్పొరేషన్ లోన్లు చాలా తక్కువగా ఇచ్చారనే బాధ ఉందని, రెండు కార్పొరేషన్ లోన్లు ఇచ్చిన మీరు 70 మందితో మమ్మల్ని తిట్టిస్తున్నారని దుయ్యబట్టారు. కార్పొరేషన్ లోన్ల విషయాన్ని చంద్రబాబు, పవన్ కల్యాణ్ పరిశీలించాలన్నారు. బీసీ కార్పొరేషన్ రుణాలకు 484 మంది దరఖాస్తులు పెట్టుకుంటే మండలంలో 65 మందికి ఇస్తామని చెబుతున్నారని, ఈ విషయాన్ని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌కు వివరిస్తే.. ఈ సమస్య తన పరిధిలో లేదని చెబుతున్నారన్నారు. 1994 నుంచి టీడీపీలో ఉన్నామని, గ్రామంలో పార్టీ నిర్వీర్యం కాకుండా కాపాడుకుంటూ వచ్చామని తెలిపారు. కార్పొరేషన్ రుణాల విషయంపై పునరాలోచన చేసి, సర్పంచ్‌లు తలెత్తుకుని తిరిగేలా చేయాలని కోరారు. కేశనపల్లిలో రెండు కాపు కార్పొరేషన్ రుణాలు, ఒక బీసీ కార్పొరేషన్ రుణం ఇస్తే మిగిలిన దరఖాస్తుదారులకు ఏం చెప్పాలో తెలియని పరిస్థితి నెలకొందని నాగు అన్నారు.
రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారనుకున్నాం
కేశనపల్లి సర్పంచ్ యెనుముల నాగు
కార్పొరేషన్ లోన్లతో
గ్రామాల్లో తలెత్తుకోలేని పరిస్థితి
సీఎం, డిప్యూటీ సీఎంకు వీడియో సందేశం