
సాంకేతిక లోపంతో ఇసుక రవాణాకు బ్రేక్
కొవ్వూరు: ఇసుక రవాణాలో బిల్లులు ఇచ్చే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం గురువారం నుంచి కొత్తగా ప్రారంభించింది. దీనికి సంబంధించిన పరికరాలు మధ్యాహ్నం వరకూ పని చేయకపోవడంతో ఇసుక రవాణాకు బ్రేక్ పడింది. ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ పరికరాలు పని చేయలేదు. దీంతో ఇసుక రవాణాకు వచ్చిన వాహనాలన్నీ ర్యాంపుల్లోనే నిలిచిపోయాయి. కొత్త విధానం ప్రకారం ఇసుక రవాణాకు వచ్చే వాహనానికి ముందుగా ఫొటో తీసి, వివరాలు రిజిస్ట్రేషన్ చేయాలి. లోడింగ్ అనంతరం మరోసారి ఫొటో తీసి అప్‌లోడ్ చేయాలి. అనంతరం బిల్లు జనరేట్ చేయాలి. వాడపల్లి ర్యాంపులో ఈ విధంగా మొదటి బిల్లు తీసిన తరువాత రెండో బిల్లు రాలేదు. దీంతో ఇసుక రవాణాకు వచ్చిన వాహనాలన్నీ వెనుతిరిగి వెళ్లిపోయాయి. కుమారదేవం ఓపెన్ రీచ్‌లో సాయంత్రం వరకూ బిల్లులు రాలేదు. ఔరంగబాద్, ఏరినమ్మ, ఔరంగబాద్–2, కొవ్వూరు, ఆరికిరేవుల, దండగుండరేవుల ర్యాంపుల్లోనూ ఇదే సమస్య ఎదురైంది. దీంతో దూర ప్రాంతాల నుంచి ఇసుక కోసం వచ్చిన వాహనదారులు వెనుతిరిగారు. వాడపల్లి, కుమారదేవం ర్యాంపుల వద్ద లారీలు భారీగా బారులు తీరాయి. కొన్ని ర్యాంపుల్లో ఇసుక లోడింగ్ చేసుకుని బిల్లుల కోసం కొద్దిసేపు నిరీక్షించారు. చివరకు పరికరంలో సాంకేతిక లోపాల కారణంగా బిల్లులు రాకపోవడంతో ఇసుక రవాణాకు బ్రేక్ పడింది. నూతన పాలసీలో వీఆర్‌ఓ లాగిన్ కావాల్సి ఉంటుందని చెబుతున్నారు. శుక్రవారం నుంచి కొత్త విధానం పని చేయవచ్చునని అధికారులు చెప్పారు.