
ప్రకృతి సాగును లక్ష ఎకరాలకు పెంచాలి
దేవరపల్లి: ప్రకృతి వ్యవసాయ విభాగం ద్వారా జిల్లావ్యాప్తంగా ఖరీఫ్‌లో 47 వేల ఎకరాల్లో పంటలు పండిస్తున్నారని, దీనిని 2029 నాటికి లక్ష ఎకరాలకు పెంచాలని జిల్లా వ్యవసాయాధికారి ఎస్.మాధవరావు అన్నారు. ఖరీఫ్ కార్యాచరణ ప్రణాళికపై రైతులకు, ప్రకృతి వ్యవసాయ విభాగం, సెర్ప్ సిబ్బందికి స్థానిక పొగాకు బోర్డు కార్యాలయం వద్ద గురువారం నిర్వహించిన డివిజన్ స్థాయి శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సహజసిద్ధమైన పంటలు పండించి, ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులు అందించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. ఎరువులు, పురుగు మందుల వల్ల ఆహారం కలుషితమవుతోందని తెలిపారు. వేసవిలో పచ్చిరొట్ట పంటలుగా మినుము, పెసర, జీలుగ, జనుము సాగు చేసి, భూసారాన్ని పెంచుకోవాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయ విభాగం ద్వారా 30 రకాల నవధాన్యాల విత్తనాలను 13 కిలోల కిట్లుగా అందజేస్తున్నామన్నారు. జిల్లాలో 85 వేల హెక్టార్ల సాగు భూములుండగా, వేసవిలో 30 వేల హెక్టార్లలో పంటలు వేయాలని సూచించారు. ఇందులో 5 వేల హెక్టార్లలో పెసర, మినుము, 6 వేల హెక్టార్లలో ఇతర పంటలు వేయాలని అన్నారు. పొలం గట్లపై కూరగాయల పంటలు, పాదులు పెట్టాలని రైతులకు మాధవరావు సూచించారు.
ప్రకృతి వ్యవసాయ విభాగం జిల్లా ప్రాజెక్టు మేనేజరు బొర్రా తాతారావు మాట్లాడుతూ, దేవరపల్లి, గోపాలపురం, నల్లజర్ల మండలాల్లో కిచెన్ గార్డెన్లు ఎక్కువగా వేశామని తెలిపారు. జిల్లావ్యాప్తంగా 1.20 లక్షల మంది కిచెన్ గార్డెన్లు వేశారన్నారు. మండల సమాఖ్య అధ్యక్షురాలు గద్దే రమాదేవి మాట్లాడుతూ, ప్రతి మండల కేంద్రంలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్స్ ఏర్పాటు చేసి, విక్రయాలు జరపాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ప్రకృతి వ్యవసాయ విభాగం ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సి.చంద్రశేఖర్, ఏడీపీఎం వల్లీ, మూడు మండలాల వ్యవసాయాధికారులు కె.విజయ్, కె.కమల్‌రాజ్, బి.రాజారావు పాల్గొన్నారు.