
వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధం
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): వక్ఫ్ సవరణ బిల్లు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని ఏపీ మైనార్టీ, ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ షేక్ నిజాం గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ బిల్లుకు టీడీపీ, జనసేన మద్దతిచ్చి, చేయాల్సిందంతా చేసేసి, ముస్లిం సమాజానికి తప్పుడు సమాచారం ఇస్తున్నారని పేర్కొన్నారు. వక్ఫ్ కమిటీల్లో అన్య మతస్తులకు కూడా చోటు కల్పించారన్నారు. కలెక్టర్లకు తుది నిర్ణయం ఉండదని చెబుతూనే ఉన్నత స్థాయి అధికారులను నియమిస్తామనడంలో మతలబు ఏమిటని ప్రశ్నించారు. ఉన్నతాధికారులు కూడా ఆయా ప్రభుత్వాల చెప్పుచేతల్లో ఉంటారని, వారి కనుసైగల్లోనే విధులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఇలాంటి అంశాలను టీడీపీ మైనారిటీ నాయకులు, ఎమ్మెల్యేలు సమర్ధించడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. అల్లాహ్ పట్ల భయం ఉంటే టీడీపీలోని ముస్లిం నాయకులు వెంటనే ఆ పార్టీకి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు బీజేపీతో జత కట్టడాన్ని నిరసిస్తూ 1997లో బషీరుద్దీన్ బాబూఖాన్ తన పదవికి రాజీనామా చేశారని గుర్తు చేశారు. అదే విధంగా మైనారిటీ మంత్రి ఫరూక్, ప్రభుత్వ సలహాదారు షరీఫ్, ఎమ్మెల్యేలు, చైర్మన్లు, ఇతర నాయకులు తమ పదవులకు రాజీనామా చేయాలని నిజాం డిమాండ్ చేశారు.
లంచం అడిగితే
సమాచారం ఇవ్వండి
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రభుత్వాధికారులు లంచం అడిగినట్లు, అవినీతికి పాల్పడుతున్నట్లు తెలిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని ఆ శాఖ రాజమహేంద్రవరం రేంజ్ డీఎస్పీ ఎం.కిశోర్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తనకు 9440 44 6161, జిల్లా ఏసీబీ ఇన్‌స్పెక్టర్ ఎన్‌వీ భాస్కరరావుకు 9440 44 6160, కాకినాడ జిల్లా ఇన్‌స్పెక్టర్ డి.వాసుకు 83329 71041, కోనసీమ జిల్లా ఇన్‌స్పెక్టర్ వై.సతీష్‌కు 9440 44 6163, ఏసీబీ రాజమహేంద్రవరం రేంజ్ కార్యాలయానికి 0883–2467833 ఫోన్ నంబర్లలో సమాచారం ఇవ్వవచ్చని వివరించారు.
9వ తేదీ వరకూ
అభ్యంతరాల స్వీకరణ
కంబాలచెరువు: ఉపాధ్యాయుల సాధారణ సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలను ఈ నెల 9వ తేదీ సాయంత్రం వరకూ స్వీకరిస్తామని డీఈవో కె.వాసుదేవరావు గురువారం తెలిపారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లా పాఠశాల విద్యాశాఖ పరిధిలో ప్రభుత్వ జిల్లా పరిషత్, మండల పరిషత్ మునిసిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సాధారణ సీనియారిటీ జాబిత ఉపాధ్యాయ సమాచార వ్యవస్థ ఆధారంగా రూపొందించామన్నారు. ఈ జాబితాల వివరాలు సంబంధిత పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లా పాఠశాల విద్యాశాఖ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.డీఈవోఏలూరు.ఆర్గ్ వెబ్‌సైట్, నోటీసు బోర్డులో ఈ నెల 3వ తేదీ నుంచి ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో అభ్యంతరాలను 9వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు ఏలూరులోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సమర్పించాలన్నారు.