
నాగాంజలి మృతి బాధాకరం
శనివారం శ్రీ 5 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
● ఆమె ఆఖరి కోరిక ప్రకారం
దీపక్‌కు కఠిన శిక్ష పడాలి
● ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి
● బాధిత కుటుంబానికి న్యాయం
జరిగే వరకూ అండగా ఉంటాం
● మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్
సాక్షి, రాజమహేంద్రవరం/కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి మృతి బాధాకరమని మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్‌రామ్ అన్నారు. ఆమె మరణవార్త తెలుసుకుని పోస్ట్‌మార్టం చేస్తున్న ప్రభుత్వాసుపత్రికి చేరుకున్న ఆయన శుక్రవారం బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, మృతురాలు సూసైడ్ నోట్‌లో ఏం కోరుకుందో దానిపై ఆమె తల్లిదండ్రులతో కలిసి పోరాటం చేస్తామన్నారు. దీపక్‌కు కఠిన శిక్ష పడాలని నాగాంజలి కోరుకుందని, అది నెరవేరే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీపక్ లాంటి కీచకులకు తగిన శిక్ష విధించడం ద్వారా ఇలాంటి ఘటనలు జరగకుండా చూడవచ్చన్నారు. నాగాంజలి కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం, కిమ్స్ ఆస్పత్రి యాజమాన్యం బాధ్యత తీసుకోవాలని, ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. తానేదో రాజకీయం చేస్తున్నట్లు కొందరు పేర్కొనడం తగదని భరత్‌రామ్ పేర్కొన్నారు. విద్యార్థులు ధర్నా చేస్తున్నప్పుడు తాను కూడా వెళ్లానన్నారు. నాగాంజలి స్వయంగా ఇంజక్షన్ చేసుకుందా.. లేక ఎవరైనా చేశారా అనే అనుమానాస్పద ఘటన నేపథ్యంలో ఆ అమ్మాయికి తగిన న్యాయం జరిగే వరకూ అండగా ఉండాలని భావించామని వివరించారు. అప్పుడే విషయం బయటకు వచ్చిందని, లేకుంటే ఆ రోజు సాయంత్రమే చక్కబెట్టేసి ఉండేవారని అన్నారు. విషయం బయటకు వచ్చాకే దీపక్‌పై కఠిన సెక్షన్లు పెట్టారన్నారు. ఈ ఘటనపై హోం మంత్రి స్పందించకపోవడం, కనీసం ఒక ట్వీట్ కూడా చేయకపోవడం దారుణమన్నారు. దీనినిబట్టి కూటమి ప్రభుత్వం ఆడపిల్లలకు ఇచ్చే గౌరవమేమిటో అర్థమవుతోందని భరత్‌రామ్ అన్నారు.

నాగాంజలి మృతి బాధాకరం