రాజమహేంద్రవరం సిటీ: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరం ఆర్టీసీ డిపో నుంచి భద్రాచలానికి ఏడు ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు డిపో మేనేజర్ షేక్ షబ్నం శుక్రవారం తెలిపారు. 5వ తేదీ సాయంత్రం నాలుగు గంటల నుంచి ప్రతి గంటకు ఒక స్పెషల్ బస్సు నడిచేలా ఏర్పాట్లు చేశామన్నారు. భక్తుల సౌకర్యార్థం వీటికి రిజర్వేషన్ సౌకర్యం కల్పించామన్నారు. సీతారాముల కల్యాణం అనంతరం భద్రాచలం నుంచి 6వ తేదీ ఒంటి గంట నుంచి తిరిగి రాజమహేంద్రవరానికి ప్రత్యేక బస్సులు వస్తాయన్నారు.
నేటి నుంచి రబీ
ధాన్యం సేకరణ
జేసీ చిన్నరాముడు
రాజమహేంద్రవరం సిటీ: జిల్లాలోని 216 రైతు సేవా కేంద్రాల్లో శనివారం నుంచి రబీ ధాన్యం సేకరణ ప్రారంభిస్తున్నామని జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లావ్యాప్తంగా 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కామన్ వైరెటీకి రూ.2,300, గ్రేడ్–ఎ రకానికి రూ.2,320 చొప్పున కనీస మద్దతు ధర చెల్లిస్తామన్నారు. హమాలీ, గోనెసంచులు, రవాణా చార్జీలను ప్రభుత్వం ద్వారా చెల్లిస్తామన్నారు. రైతుల సౌకర్యార్థం రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కోసం 216 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు, 216 మంది టెక్నికల్ అసిస్టెంట్లు, 216 మంది హెల్పర్లను తాత్కాలికంగా నియమించామని తెలిపారు. ధాన్యం కొనుగోలు విషయమై సందేహాలు, ఫిర్యాదులకు కలెక్టరేట్‌లో 83094 87151 నంబరుతో కంట్రోల్ రూము ఏర్పాటు చేశామన్నారు. ఇది ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ అందుబాటులో ఉంటుందని జేసీ చిన్నరాముడు తెలిపారు.
స్లాట్ బుకింగ్ సేవలను
సద్వినియోగం చేసుకోవాలి
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో (ఒరిజినల్ బ్రాంచి) స్లాట్ బుకింగ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా రిజిస్ట్రార్ ఆర్.సత్యనారాయణ అన్నారు. కార్యాలయంలో స్లాట్ బుక్ చేసుకున్న కొనుగోలుదారులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆయన శుక్రవారం ప్రారంభించారు. రిజిస్ట్రేషన్ అనంతరం దస్తావేజులను రాష్ట్ర క్రెడాయ్ చైర్మన్ బుడ్డిగ శ్రీనివాస్‌కు జిల్లా రిజిస్ట్రార్ ఆర్.సత్యనారాయణ, జాయింట్ సబ్ రిజిస్ట్రార్–1, 2లు ఆర్.రాంబాబు, కె.పుల్లంరాజు అందజేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ, స్లాట్ బుకింగ్‌ను పబ్లిక్ డేటా ఎంట్రీ విధానం ద్వారా, రిజిస్ట్రేషన్.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్‌సైట్ ద్వారా, క్యూఆర్ కోడ్ ద్వారా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంటుందని వివరించారు. ఈ విధానం వలన కక్షిదారులు వేచి ఉండే సమయం, మధ్యవర్తుల ప్రభావం తగ్గుతాయని చెప్పారు. ప్రస్తుతం జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో మాత్రమే ఈ విధానం అమలు చేస్తున్నామని, దశలవారీగా మిగిలిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కూడా అమలు చేస్తామని సత్యనారాయణ తెలిపారు. స్లాట్ బుకింగ్ ద్వారా తొలి రోజు 42 రిజిస్ట్రేషన్లు చేశామని జాయింట్ సబ్ రిజిస్ట్రార్–1 రాంబాబు తెలిపారు.
పెళ్లి పీటలు ఎక్కే వేళ..
మృత్యుఘాతం
గండేపల్లి/జగ్గంపేట: కొద్ది రోజుల్లో పెళ్లి.. నేడు పుట్టిన రోజు.. ఈ నేపథ్యంలో కొత్త దుస్తులు కొనుక్కుని.. ఎంతో ఆనందంగా తిరిగి వస్తున్న ఆ యువకుడిపై మృత్యువు కన్నెర్ర చేసింది. గండేపల్లి మండలం మల్లేపల్లికి చెందిన చిక్కాల కాటమస్వామి, సావిత్రి దంపతులకు కుమార్తె, కుమారుడు చిక్కాల శ్రీను (28) ఉన్నారు. కుమార్తెకు గతంలోనే వివాహం చేశారు. శ్రీను ట్రాక్టర్ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. తండ్రి కాటమ స్వామి వ్యవసాయం చేస్తున్నారు. శ్రీనుకు గోకవరం మండలం మల్లవరానికి చెందిన అమ్మాయితో ఈ నెల 20న వివాహం చేయాలని నిశ్చయించారు. శనివారం శ్రీను పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో పుట్టిన రోజు, పెళ్లి వేడుకలకు దుస్తులు కొనుగోలు చేసేందుకు స్నేహితుడితో కలిసి, శ్రీను మోటార్ సైకిల్‌పై శుక్రవారం పెద్దాపురం వెళ్లాడు. అక్కడ మిత్రులిద్దరూ కొత్త దుస్తులు కొనుకున్నారు. సాయంత్రం ఆనందంగా ఇంటికి తిరిగి వస్తూండగా, వారి బైక్‌ను జగ్గంపేట మండలం కాట్రావులపల్లి పెట్రోల్ బంకు వద్ద వెనుక నుంచి వస్తున్న లారీ వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో శ్రీను (28) అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. మోటార్ సైకిల్‌పై ఉన్న స్నేహితుడు స్వల్పంగా గాయపడ్డాడు. పెళ్లి సమీపిస్తున్న వేళ.. పుట్టిన రోజుకు ఒక రోజు ముందు శ్రీను రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ ఇంట్లో విషాదం నెలకొంది.
భద్రాచలానికి ప్రత్యేక బస్సులు