
విచిత్రకళా ప్రదర్శన
ప్రదర్శనలో కానరాని జనం
● పేలవంగా ముగిసిన కార్యక్రమం
● తమకు ఒరిగిందేమీ లేదని
చిత్రకారుల ఆవేదన
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): ‘అమరావతి వీధి చిత్రకళా ప్రదర్శన’ పేరిట సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరంలో శుక్రవారం అట్టహాసంగా నిర్వహించిన కార్యక్రమం నగర వాసులను నిరాశకు గురి చేసింది. నగరంలోని జైలు రోడ్డులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దేశంలోని 500 మంది చిత్రకారులు పాల్గొంటారని, అనేక చిత్రాలు ప్రదర్శిస్తారని చెప్పారు. తీరా చూస్తే కూటమి నాయకుల ఆర్భాటమే కనిపించింది. చిత్రకారులను ప్రోత్సహించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని కనీసం మూడు రోజులైనా నిర్వహించి ఉంటే నగర ప్రజలకు తెలిసి ఉండేది. కేవలం ఒక్క రోజు మాత్రమే నిర్వహించడంతో అసలు ఈ ప్రదర్శన ఉందనే విషయమే చాలా మందికి తెలియలేదు. దీంతో ఆశించిన స్థాయిలో జనం రాక ప్రదర్శన వెలవెలబోయింది. చివరకు స్కూల్ పిల్లలను తీసుకుని వచ్చి, మమ అనిపించారు. మధ్యాహ్నం నుంచి ఎండ వేడి, ఉక్కపోతతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరయ్యారు. సాయంత్రం కాస్త చల్లబడిన తరువాత కొద్ది మంది ఈ చిత్ర కళా ప్రదర్శనను వీక్షించడానికి వచ్చారు. కొంతమంది మెహందీ పెట్టించుకొని వెళ్లిపోయారు. ఈ ప్రదర్శనలో ఆశించిన స్థాయిలో విక్రయాలు లేవని స్టాల్స్ వద్ద చిత్రాలు పెట్టిన చిత్రకారులు ఆవేదన చెందుతున్నారు. అనేక వ్యయ ప్రయాసలతో ఎక్కడెక్కడి నుంచో వచ్చామని, తీరా చూస్తే ఇక్కడ కొనుగోళ్లు నిరాశపరిచాయని చెప్పారు.
ట్రాఫిక్ మళ్లింపుతో ఇబ్బందులు
నగరంలోని సెంట్రల్ జైలు రోడ్డు చాలా రద్దీగా ఉంటుంది. ఇటువంటి రోడ్డుకు ఇరువైపులా చిత్రకళా ప్రదర్శన స్టాల్స్ ఏర్పాటు చేశారు. దీనికోసం ఈ మార్గంలో వాహనాల రాకపోకలను నియంత్రించారు. లాలాచెరువు మీదుగా వచ్చే వాహనాలను లాలాచెరువు హైవే నుంచి మోరంపూడి సెంటర్ మీదుగా మళ్లించారు. అలాగే, కంబాలచెరువు నుంచి వచ్చే వాహనాలను కోరుకొండ రోడ్డు మీదుగా మళ్లించారు. దీంతో ప్రజలు నానా అవస్థలూ పడ్డారు. కార్యక్రమంలో శాసన సభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు, రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్ పి.ప్రశాంతి, ఎస్పీ నరసింహ కిషోర్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత, ఏపీ స్టేట్ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ చైర్‌పర్సన్ తేజస్వి, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాసు, బత్తుల బలరామకృష్ణ, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.
ఇదో వి‘చిత్రం?’
సీఎం చంద్రబాబు స్వయంగా గీశారంటూ చెబుతున్న ఓ చిత్రాన్ని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు రూ.1,01,116కు ఈ చిత్రకళా ప్రదర్శనలో కొనుగోలు చేయడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. చంద్రబాబు అత్యద్భుతంగా గీసినదంటూ బుద్ధుడి చిత్రపటాన్ని ఈ ప్రదర్శనలో ఉంచగా.. దానిని డిప్యూటీ స్పీకర్ కొనుగోలు చేశారు. వాస్తవానికి ఆ చిత్రాన్ని కర్నూలుకు చెందిన వేరే చిత్రకారుడు గీశాడు. దానిపై చంద్రబాబు సంతకం చేసినందుకుగానూ డిప్యూటీ స్పీకర్ రూ.లక్షకు పైగా వెచ్చించి కొనుగోలు చేయడం సందర్శకులను నివ్వెరపరచింది.

విచిత్రకళా ప్రదర్శన

విచిత్రకళా ప్రదర్శన