
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
● అన్నయ్య దిన కార్యక్రమానికి
వెళుతుండగా దుర్ఘటన
అంబాజీపేట: అతి వేగంగా వచ్చిన లారీ ఓ వ్యక్తి నిండుప్రాణాన్ని బలితీసుకుంది. అన్నయ్య దిన కార్యక్రమాన్ని ముగించేందుకు స్కూటీపై కౌశికకు వెళుతున్న ఇద్దరు అన్నదమ్ములను లారీ ఢీ కొట్టింది. అందులో ఒకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందగా, మరొకరు చికిత్స పొందుతూ మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గంగలకుర్రులో ఈ గత నెల 24న మృతి చెందిన మంగిపూడి సూర్యనారాయణ దిన కార్యక్రమాన్ని మంగిపూడి నాగరాజు, అతని సోదరుడు రామచంద్రరావుల ఇంటి వద్ద నిర్వహించారు. అనంతరం ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు నాగరాజు (64), రామచంద్రరావు (68)స్కూటీపై స్థానికంగా ఉన్న కౌశిక నదికి వెళుతున్నారు. గంగలకుర్రు ప్రాథమిక పాఠశాల సమీపంలో నాలుగు రోడ్ల సెంటర్ వద్దకు వచ్చేసరికి ముక్కామల నుంచి అంబాజీపేట వైపు అతివేగంగా వెళుతున్న లారీ వీరిని బలంగా ఢీ కొట్టింది. దాంతో నాగరాజు, రామచంద్రరావులను 108లో అమలాపురం ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యలో నాగరాజు మృతి చెందగా, రామచంద్రరావు చికిత్స పొందుతూ మృతిచెందారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. ఘటనా స్థలాన్ని ఎస్సై కె.చిరంజీవి పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. లారీ డ్రైవర్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడని ఎస్సై చెప్పారు. అప్పటి వరకు అన్న దిన కార్యక్రమాన్ని పూర్తి చేసిన అతని సోదరులు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడడం బంధువులు, స్థానికులను కలచివేసింది. అప్పటికే అన్నదమ్ముల్లో ఒకరిని కోల్పోయి శోకసముద్రంలో ఉన్న మంగిపూడి కుటుంబ సభ్యులు మరో ఇద్దరు మృత్యువాత పడ్డారన్న దుర్వార్త వినడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు.